మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుపతి, తిరుమలలో గత కొంత కాలం నుంచి చిరుతల సంచారం అటు భక్తులను, ఇటు అధికారులను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ క్రమంలో తిరుపతి ఎస్వీయూ క్యాంపస్‌లో బోనులో ఓ చిరుత చిక్కింది. అటవీ సిబ్బంది ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అధికారులు వెల్లడించారు. కొంత కాలం నుంచి ఎస్వీయూ క్యాంపస్‌లో రాత్రివేళ సంచరిస్తూ అటు విద్యార్థులు, సిబ్బందిని, ఆ మార్గంలో వెళ్లే వారిని హడలెత్తించింది. దీని దెబ్బకు క్యాంపస్ చుట్టుపక్కల చిరుత సంచారంపై బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు రాత్రివేళ ఎస్వీయూ ప్రాంగణంలో బయట తిరగకూడదని సైతం అధికారులు హెచ్చరించారు.
తాజాగా ఎస్వీయూలో బోనులో చిక్కిన చిరుతను వెటర్నరీ డాక్టర్ పరిశీలించారు. బోనులో చిక్కిన చిరుత ఆరోగ్యంగా ఉందని నిర్ధారించారు. అనంతరం అటవీ శాఖ సిబ్బంది ఆ చిరుతను సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. కొన్ని రోజులుగా ఎస్వీయూ హాస్టల్ వద్ద, క్యాంపస్ ఏరియాలో సంచరిస్తోంది. జూ పార్క్ రోడ్డులోని దేవ్ లోక్ స్థల ఆవరణలోనూ సంచరించింది. దాంతో విద్యార్థులు, సిబ్బంది, ఆ ప్రాంతంలో వెళ్లేవారు సైతం ఆందోళనకు లోనయ్యారు. తాజాగా అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.