కంచ గచ్చిబౌలి భూముల వెనుక వేల కోట్ల బాగోతం బిజెపి ఎంపి హస్తం
త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తా దేశంలో కాంగ్రెస్, బిజెపి ఉమ్మడి సిఎం
రేవంత్ ఒక్కరే రాష్ట్రంలో నెగెటివ్ పాలసీలు..నెగెటివ్ పాలిటిక్స్ అక్టోబర్‌లో
బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక మీడియాతో చిట్‌చాట్‌లో కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : కంచ గచ్చిబౌలి భూముల వెనుక రూ.వేల కోట్ల బాగోతం ఉంద ని త్వరలో భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతానని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 400 ఎకరాల భూ మి వెనుక వేల కోట్ల వ్యవహారం ఉందని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో బిజెపి ఎంపీ ఉన్నారని చెప్పారు. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉందని, ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మో స్తే.. మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారని చు రకలు అంటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి 16 నెలలైనా మంత్రివర్గాన్ని విస్తరించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా ఒక్క రూపాయి కూడా రాలేదని అన్నారు. హెచ్‌సియు వ్యవహారంలో సిఎం రేవంత్‌రెడ్డి విఫలమైనందునే హైకమాండ్ జోక్యం చేసుకుంటోందని,అందుకే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు చేస్తున్నామని ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి, బిజెపి మధ్య రహస్య బంధం ఉందని ఆరోపించారు. సిఎం రేవంత్‌రెడ్డిని కాపాడుతుందే బిజెపి నాయకత్వం అని పేర్కొన్నారు. దేశంలో బిజెపి, కాంగ్రెస్ ఉమ్మడిగా బలపర్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. రెండు జాతీయ పార్టీల మద్దతుతో రేవంత్‌రెడ్డి పాలన చేస్తున్నారని, ఆయన దేశంలో అత్యంత పవర్ ఫుల్ ముఖ్యమంత్రి అని చెప్పారు.
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మంగళవారం నందినగర్‌లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాజకీయ బాంబులు పేలకపోవటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైలెంట్ అయ్యారని విమర్శించారు. అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని తాము కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా విచారణ చేపట్టలేదని అన్నారు. రేవంత్, రాహుల్ (ఆర్‌ఆర్) టాక్స్ అని స్వయంగా ప్రధాని మోదీ అన్నారని… కానీ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల్లో తాము పోటీకి దూరంగా ఉన్నామని చెప్పారు. హైదరాబాద్ పరిధిలో పోటీకి తమకు సరిపడా సభ్యులు లేని కారణంగానే పోటీ దూరంగా ఉన్నామని తెలిపారు. బిజెపి కోసం తామెందుకు పోటీకి దూరంగా ఉంటామని అన్నారు. ఎన్నికల్లో పోటీపై తమ విధానం తమకు ఉంటుందని స్పష్టం చేశారు. హెచ్‌సియు భూముల విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌కు అంత ఉలికిపాటు ఎందుకు..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ రక్షణ కవచం అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే హెచ్‌సియు భూముల అమ్మకం ఆపలేదా..? అని నిలదీశారు.
బహిరంగ సభకు అనుమతి ఇవ్వకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తర్వాత బిఆర్‌ఎస్ పార్టీ మాత్రమే విజయవంతంగా 25 ఏళ్లు పూర్తిచేసుకుంటోందని కెటిఆర్ అన్నారు. తెలుగు రాష్ట్రాలలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండో తెలుగు పార్టీ బిఆర్‌ఎస్ అని వ్యాఖ్యానించారు. హన్మకొండలోని ఎల్కతుర్తిలో 1200 ఎకరాల్లో బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభ ఉంటుందని తెలిపారు. బిఆర్‌ఎస్ రజతోత్సవ సభకు అనుమతివ్వాలని తమ పార్టీకి చెందిన వరంగల్ జిల్లా నాయకులు ఇప్పటికే ఎసిపిని కోరారని, ఇదే విషయంలో తాను డిజిపితో మాట్లాడానని చెప్పారు. బహిరంగ సభను పోలీసులు అనుమతి ఇవ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు. తమ పార్టీ రజతోత్సవ సభ కోసం 3 వేల ఆర్‌టిసి బస్సులు కేటాయించాలని తమ పార్టీ నేతలు ఆర్‌టిసి ఎండి సజ్జనార్‌ను కోరినట్లు తెలిపారు. బిఆర్‌ఎస్ చరిత్రలో రజతోత్సవ సభ అతి పెద్దది అవుతుందని వ్యాఖ్యానించారు. ఏడాది పాటు కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ప్రతి నెలా వివిధ జిల్లాల్లో కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు.
జిల్లా పార్టీ కార్యాలయాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని అన్నారు. మే నెలలో డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేపడతామని వెల్లడించారు. అక్టోబర్‌లో పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని తెలిపారు. జూన్, జులైలో స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చని అంటున్నారని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొంటామని అన్నారు. మే నెల నుంచి అక్టోబర్ వరకు పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల నియామకంపై దృష్టి పెడతామని తెలిపారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు ప్రమాదకరం అని, వరంగల్ సభ ద్వారా ఇదే సందేశాన్ని కెసిఆర్ ప్రజలకు ఇవ్వబోతున్నారని తెలిపారు. హాస్టల్స్, గురుకులాల్లో సన్న బియ్యం ప్రవేశపెట్టిందే కెసిఆర్ అని చెప్పారు. సన్న బియ్యం కాన్సెప్ట్ కొత్తదేమీ కాదని, స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే.. కాంగ్రెస్‌కు ఉన్న ఆదరణ ఏంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
ఎఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని మేము కూడా అనవచ్చు
రాష్ట్రంలో నెగెటివ్ పాలసీలు.. నెగెటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని కెటిఆర్ విమర్శించారు. కొండాపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి నుంచి మాజీ సిఎం కెసిఆర్ వరకు వారిపై కేసులు ఎలా పెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తుందని కెటిఆర్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. హైడ్రా, మూసీ, లగచర్ల సంఘటనలలో బాధితులు తమ మద్దతు కోరితే వారికి అండగా నిలిచామని తెలిపారు. హెచ్‌సియు భూముల విషయంలోనూ విద్యార్థులు, ప్రజలు,పర్యావరణవేత్తలు, ఇతర ప్రముఖులు స్పందించిన తర్వాత తాము వారికి అండగా నిలిచామని అన్నారు. విద్యార్థుల ఉద్యమానికి తాము సారథ్యం వహించలేదని..
ప్రధాన ప్రతిపక్షంగా అండగా నిలబడ్డామని చెప్పారు.హెచ్‌సియు విద్యార్థులపై కేసుల ఉపసంహరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే కేసుల ఉపసంహరణ సరిపోదు అని, జంతువధ కారకులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఏఐ వీడియోల పేరుతో తప్పించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. ఎఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు… అనుముల ఇంటెలిజెన్స్ అని తాము కూడా అనవచ్చని పేర్కొన్నారు. హెచ్‌సియు వ్యవహారంలో ఎఐ వీడియోలు అంటూ తమ పార్టీ నేతలపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేసి టూల్ కిట్ సాయంతో సోషల్ మీడియాలో తమపై ఎదురుదాడి చేయిస్తున్నారని విమర్శించారు.
ఆదిత్యనాథ్‌దాస్ నియామకం ఎపి ప్రయోజనాల కోసమేనా..?
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి, కృష్ణా జలాల్లో విచ్చలవిడి జలదోపిడీ జరుగుతోందని కెటిఆర్ మండిపడ్డారు. భూకంపం, భారీ వరద వచ్చినా మేడిగడ్డ చెక్కుచెదరలేదని చెప్పారు. కెసిఆర్‌పై ఉన్న కోపంతో నీళ్లు వదిలేయడంతో పంటలు ఎండుతున్నాయని చెప్పారు. నీటి కేటాయింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్ తరుపున వాదనలు వినిపించిన ఆదిత్యనాథ్ దాస్‌ను తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా నియమించడం ఏంటని ప్రశ్నించారు. ఆదిత్యనాథ్‌దాస్ నియామకం ఎపి ప్రయోజనాల కోసమా..? అని నిలదీశారు.
రాష్ట్రంలోని ఫార్మా, ఐటీ ఎగుమతులపై ట్రంప్ నిర్ణయాల ప్రభావం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాల ప్రభావం రాష్ట్రంలోని ఫార్మా, ఐటీ ఎగుమతులపై ఉంటుందని కెటిఆర్ అన్నారు. అమెరికా అడ్డగోలుగా పెంచిన నూతన టారిఫ్ వల్ల తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ట్రంప్ తీసుకువచ్చిన నూతన టారిఫ్ విధానం పైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని చెప్పారు. అమెరికా పన్నులు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలతో ప్రజల ఆర్థిక సంపద ఆవిరైపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అమెరికా విధించిన పన్నుల పైన కేంద్ర ప్రభుత్వం వద్ద సమాధానం లేదని, ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానం అంటూ లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డివిరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు, పెట్రోల్ ధరలు తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి మద్యంపై వచ్చే ఆదాయం తప్ప జిఎస్‌టి, స్టాంప్ డ్యూటీ, వాహనాలపై రిజిస్ట్రేషన్ వచ్చే ఆదాయం తగ్గిందని కెటిఆర్ అన్నారు.