ఎపిలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విడవలూరు మండలంలో ఓ వివా హిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కట్నం కోసం భర్త, అత్తమామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తాటిచెట్లపాలెంకి చెందిన సుగుణమ్మకు ఊటుకూరుకు చెందిన హరికృష్ణతో 2021లో వివాహమైంది. కట్నం కింద 17 సవర్ల బంగారం, రూ.2 లక్షల నగదు ఇచ్చారు. సంవత్సరం పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో అదనపు కట్నం కోసం అత్తింటి వారు సుగుణమ్మను వేధించసాగారు. వారం క్రితం ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి బాధితు రాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
భర్త అత్తమామలే సుగుణమ్మను చంపి ఆత్మహత్య చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై వారు విడవలూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ డిఎస్‌పి శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా అత్తింటివారు పరారీలో ఉన్నారు. ‘ఊటుకూరుకి చెందిన హరికృష్ణకు 2021లో అమ్మాయిని ఇచ్చి వివాహం చేశాం. సంవత్సరం తర్వాత అదనపు కట్నం కోసం వేధించారు. వారం క్రితం సుగుణమ్మను కొట్టారు. అమ్మాయికి మందు తాగించారు. మేము ఆసుపత్రికి వచ్చే సరికి ఆమె చనిపోయి ఉంద’ని మృతురాలి బంధువు ఈశ్వరయ్య వెల్లడించారు.