సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జైలర్’ భారీ వసూళ్లతో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అయితే ‘జైలర్’లో రమ్యకృష్ణ ఉంది కాబట్టి ‘జైలర్ -2’లో కూడా ఆటోమేటిగ్గా తన పాత్ర కొనసాగుతుంది. ఇందులో ప్రత్యేకత ఏం లేదు. కానీ ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఓ ప్రత్యేకమైన సందర్భాన్ని షేర్ చేశారు రమ్యకృష్ణ. తన ఇన్‌స్టాలో ‘జైలర్- 2’ షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజునే, రజనీకాంత్ తో కలిసి ఆమె నటించిన ‘నరసింహ’ సినిమా విడుదలై సరిగ్గా 26 ఏళ్లు అయింది. ఇదే విషయాన్ని ఆమె గుర్తు చేసింది.
‘నరసింహా’ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె పోషించిన అత్యంత శక్తిమంతమైన పాత్రల్లో అది కూడా ఒకటి. ఆ సినిమా టైమ్‌లో రజనీకాంత్ ఫ్యాన్స్, రమ్యకృష్ణపై దాడులకు కూడా దిగారంటే, ఆ పాత్ర ఎంత పండిందో అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమా తర్వాత రజనీకాంత్‌తో మళ్లీ నటించే అవకాశం రాలేదు. ఎట్టకేలకు ‘జైలర్’తో రజనీ, -రమ్యకృష్ణ మళ్లీ కలిశారు. ఈసారి కూడా హిట్ కొట్టారు. ఇప్పుడు ‘జైలర్- 2’ చేస్తున్నారు. ప్రస్తుతం ‘జైలర్ 2’ కేరళ రాష్ట్రంలోని అట్టపాడి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది.