Wednesday, April 16, 2025

సలేశ్వరం జాతర.. వెళ్ళొస్తాం.. మల్లొస్తాం లింగమయ్య

- Advertisement -
- Advertisement -

ముగిసిన సలేశ్వరం జాతర వేడుకలు
చివరి రోజు శ్రీశైలం ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్.. భక్తుల ఇబ్బందులు

మన తెలంగాణ/ నాగర్ కర్నూల్ ప్రతినిధి: దక్షిణ తెలంగాణ అమర్నాథ్ గా పిలిచే సలేశ్వరం లింగమయ్య జాతర వేడుకలు ముగిశాయి. సలేశ్వరం జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. సలేశ్వరం జాతర సందర్భంగా భక్తులు ఇబ్బందులు నడుమనే లింగమయ్యను దర్శించుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం రాంపూర్ పెంట సమీపంలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యం పరిధిలోని నల్లమల్ల కొండల్లో ఆలయం ఉంది. ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహించే సలేశ్వరం లింగమయ్య జాతర ముగింపు వేడుకలు ఆదివారంతో ముగిశాయి. ఈనెల 11 నుంచి 13 వరకు జాతర నిర్వహించారు. అభయారణ్యం పరిధిలో ఆలయం ఉండడంతో అటవీశాఖ అనుమతులతో జాతర నిర్వహించారు. మూడు రోజులపాటు నిర్వహించిన జాతర వేడుకలు తెరిపించేందుకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర చెందిన వేలాది మంది భక్తులు లింగమయ్య స్వామిని దర్శించుకున్నారు. వివిధ మార్గాల ద్వారా రాంపూర్ పెంట వరకు చేరుకున్న భక్తులు అక్కడి నుంచి కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. దట్టమైన అభయారణ్యంలో కొండలు, కోనలు.. రాళ్లు రప్పలు దాటుకుంటూ కర్రల సాయంతో ఆలయానికి చేరుకునే సమయంలో ‘వస్తున్నాం వస్తున్నాం’ లింగమయ్య దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో ‘వెళ్ళొస్తాం మల్లొస్తాం లింగమయ్య’ అంటూ శివనామస్మరణతో సాగే యాత్ర ప్రతిభక్తులు మదిలో చిర స్మరణీయంగా నిలిచిపోతుంది. మూడు రోజుల వ్యవధిలో రెండు లక్షల మంది పైగా భక్తులు ఆలయాన్ని దర్శించుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

భక్తులకు తప్పని ఇబ్బందులు

సలేశ్వరం చేరుకోవడానికి భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ సేవలు కేవలం పుల్లాయపల్లి పెంట వారికి ఉండడం అక్కడి నుంచి ఆటోలు ఇతర మార్గాల ద్వారా రాంపూర్ పెంట అక్కడి నుంచి కాలినడకన సలేశ్వరం క్షేత్రానికి చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. జాతర చివరి రోజైన ఆదివారం సైతం భక్తుల అవస్థలు వర్ణనాతీతం. అటవీ నిబంధనల పేరుతో యాత్రికుల వాహనాలను మన్ననూరు అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద టోల్ వసూలు.. ప్లాస్టిక్ వస్తువుల పరిశీలన నెమ్మదిగా జరగడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో సలేశ్వరం క్షేత్రానికి వచ్చే వాహనాలు హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారిపై భారీగా బారులు తీస్తూ కనిపించాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు వాహనాల్లో వెళ్లే యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పౌర్ణమి సందర్భంగా సలేశ్వరానికి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలతో పాటు.. ఆలయానికి వెళ్లే రహదారి పొడవునా భక్తజనంతో కిటకిటలాడిపోయింది. సలేశ్వర ఆలయానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అచ్చంపేట ఆర్ డివొ మాధవి డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏర్పాటులను పర్యవేక్షించారు. డిఎఫ్ఒ రోహిత్ గోపిడి అటవీశాఖ సిబ్బందితో ప్రత్యేక పర్యవేక్షణ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News