బిల్లుల పెండింగ్‌పై సుప్రీంకోర్టు చివాట్లకు గురైన తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఇప్పుడు జై శ్రీరామ్ వివాదంలో చిక్కుకున్నారు. విద్యార్థుల సమావేశంలో పాల్గొన్న గవర్నర్ వారిని శ్రీరామ్ అని ఎలుగెత్తి చాటాలని అడగడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. మధురై లో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఫంక్షన్‌కు గవర్నర్ ఇటీవల హాజరయ్యారు. విద్యార్థులు అంతా సామూహికంగా జై శ్రీరామ్ అని నినదించాలని సూచించారు. బహిరంగ కార్యక్రమంలో గవర్నర్ ఈ విధంగా చేయడం అనుచితం అని తమిళనాడులోని అధికారిక డిఎంకె ప్రభుత్వ వర్గాలు, విద్యా సంస్థలు నిరసనకు దిగాయి. గవర్నర్‌ను వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కీలక పదవిలో ఉన్న వ్యక్తి ఏకంగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలకు దిగడం ఆయన పదవికి తగదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ
వర్నర్ రవికి, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు పలు విషయాలలో పచ్చగడ్డి భగ్గుమంటున్నది. ఆయన విద్యాసంస్థల పట్ట రాజ్యాంగయుత సంవిధానం పాటించలేదు. రాష్ట్రానికి రాజ్యాంగ ప్రతినిధి అయి ఉండి ఈ విధంగా లౌకిక వాదానికి వ్యతిరేకంగా వ్యవహరించడం దారుణం అని విమర్శలు తలెత్తాయి. రాజ్యాంగంలోని 159వ ఆర్టికల్‌ను ఆయన ఉల్లంఘించారని వెంటనే బర్తరఫ్ చేయాల్సి ఉందని డిమాండ్ తీవ్రస్థాయికి చేరుకుంది.ఇప్పటికే గవర్నర్‌కు సుప్రీంకోర్టు నుంచి మందలింపులు వచ్చాయి. విధి నిర్వహణలో ఏకపక్ష ధోరణిని పాటిస్తున్నాడు. ఇప్పుడు మరో స్టంట్‌కు పాల్పడిందని కాంగ్రెస్ నేత శ్రీకాంత్ సెంథిల్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బహిష్కరణకు గురయిన గవర్నర్ పద్ధతి ఇప్పటికీ మారకపోవడం శోచనీయం అని వ్యాఖ్యానించారు.ఇప్పటి వ్యవహారంపై గవర్నర్ వివరణ తీసుకోవడానికి వార్తా సంస్థలు యత్నించాయి. అయితే రాజ్‌భవన్ వర్గాల నుంచి స్పందనరాలేదు. కాంగ్రెస్, డిఎంకె నేతలు ఇప్పుడు రవి తక్షణ తొలిగింపునకు పట్టుపడుతున్నారు.
శ్రీరామ నవమి నాడే కాలేజీలో కార్యక్రమం జరిగింది. కంబ రామాయణం రాసిన గొప్ప కవిని గౌరవించుకుందామని, జై శ్రీరామ్ అందామని గవర్నర్ విద్యార్థులతో జై కొట్టించడం , సంబంధిత వీడియో వైరల్ కావడం కలకలం అయింది. విద్యార్థులకు మతపరమైన భక్తిని నూరిపోయడానికి యత్నించడం గొడవకు దారితీసింది. దేశంలోని సమాఖ్య విధానాన్ని బేఖాతరు చేస్తూ గవర్నర్ వ్యవహరించడం ఆయన వైఖరిని మరో మారు చాటిందని డిఎంకె అధికారిక ప్రతినిధి ధరణిధరన్ స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మౌలానా అస్సాన్ స్పందిస్తూ గవర్నర్ వైఖరి పూర్తిగా మత పెద్దగా మారిందని మండిపడ్డారు. ఓ మత సిద్ధాంతాన్ని ప్రచారం చేసేదిగా ఉందని వ్యాఖ్యానించారు.