నా సహనాన్ని పరీక్షించొద్దు ఒక్కొక్కరి దగ్గర
మూడు ప్రధాన శాఖలు ఉండడం సమంజసం కాదు
అధిష్టానం మాట నిలబెట్టుకోవాలి మంత్రి పదవి
రాకుండా జానారెడ్డి అడ్డుతగులుతున్నారు
ఎంఎల్‌ఎ రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మన తెలంగాణ/చండూర్: రాష్ట్ర మంత్రిమండలిలో ఒక్కొక్కరి వద్ద మూడు ప్రధాన శాఖలు ఉండడం సమంజసం కాదని మునుగోడు ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అధిష్టానానికి తనపై మంచి నమ్మకం ఉందని, పార్టీ కోసం నిజాయితీగా, నిఖార్సుగా పనిచే సే వ్యక్తులకు మంత్రి పదవులు ఇస్తే పార్టీ అభివృద్ధి చెందుతుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా, చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలైనా నేటివరకు అన్ని మంత్రిత్వ శాఖలను పూర్తి చేయడంలో విఫలం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బిజెపిలో ఉన్నప్పుడు నుండి కాంగ్రెస్ అధిష్టానం తమ పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి కట్టబెడతామని, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపి అభ్యర్థిని చామల కిరణ్ కుమార్ గెలిపించే విషయంలోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారని అన్నారు. అలాంటి హామీలను భుజస్కందాలపై వేసుకొని భువనగిరి పార్లమెంటు నుండి రెండు లక్షల 50 వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించి రికార్డ్ సృష్టించిన ఘనత తనకు దక్కిందన్నారు. గత 16 నెలల నుండి మంత్రివర్గ విస్తరణ రేపు.. మాపు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్న తరుణంలో ఉగాదికి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని నమ్మకం అందరికీ ఏర్పడిందని అన్నారు. ఇక తన సహనాన్ని పరీక్షించొద్దని.. ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటానో తనకే తెలియదని ఘాటుగా చురకలు వేశారు.
తనకు మంత్రి పదవి వచ్చే క్రమంలో జిల్లా నుండి మాజీ మంత్రి జానారెడ్డి అడ్డు తలుగుతున్నారని, అది సరైన విధానం కాదన్నారు. అధిష్టానం పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. మంత్రి పదవిలో ఉన్నవారు తమ ప్రాంత అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడ్డ మునుగోడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మంత్రి పదవి కోసం ఆరాటపడుతున్నానే తప్ప.. వేరే ఉద్దేశం లేదన్నారు. అభివృద్ధి కోసం నోచుకోని మునుగోడు ప్రాంతానికి మంత్రి పదవి లభిస్తే ఈ ప్రాంతం తాగు, సాగు నీరు రోడ్లు, విద్య, వైద్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడమే తమ ధ్యేయమన్నారు. జిల్లా నాయకుల తప్పిదంతోనే తన మంత్రి పదవి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం మాటకు కట్టుబడి ఉండి మునుగోడు ప్రాంతానికి మంత్రి పదవి కేటాయించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట డిసిసిబి ఛైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ దోటి నారాయణ యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు కోరిమి ఓంకారం, జిల్లా నాయకులు కోడి శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు అనంత చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ దొటి సుజాత వెంకటేష్ యాదవ్, వైస్ ఛైర్మన్ పొలు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.