Thursday, April 17, 2025

‘స్థానిక’ ఎన్నికల్లో విజయం మనదే:హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

ఎంత స్పీడ్ గా కాంగ్రెస్ గెలిచిందో అంతే స్పీడ్ గా గ్రౌండ్లో కుప్ప కూలిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా, గజ్వేల్ పట్టణంలోని శోభా గార్డెన్ లో మెదక్ ఎంఎల్‌ఎసి డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రతాప్ రెడ్డితో కలిసి ఈనెల 27న వరంగల్‌లో జరిగే భారాస భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం పార్టీ నాయకులతో కలిసి హరీశ్‌రావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎరేవంత్ రెడ్డి వచ్చాకా ఆస్తులు అమ్ముదామన్న, కుదవ పెడదామన్నా వీలులేకుండా పోయిందని, గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని అన్నారు. వ్యాపారాలు పూర్తిగా నడవడం లేదని ఏ వ్యాపారిని అడిగినా వ్యాపారం లేదు అంటున్నారని అన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో ఇండ్లు, షాపులు కిరాయికి దొరికేవి కావని..కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా టూ లెట్ బోర్డులు కనపడుతున్నాయని అన్నారు. ఇచ్చిన హామీలు ఎగ్గొట్టుడు, అబద్ధాలు చెప్పడం, చెట్లు నరకుడు, బూతులు మాట్లాడుడు.. ఇవి రేవంత్ రెడ్డి బ్రాండ్లు అని అన్నారు.

మిషన్ భగీరథ, కళ్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా వంటి అనేక పథకాలు కెసిఆర్ బ్రాండ్లు అని అన్నారు. చెట్లు పెట్టుడు కెసిఆర్ వంతు అయితే చెట్లు నరకుడు రేవంత్ రెడ్డి వంతు అని అన్నారు. జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ ఇప్పుడు లేచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. గ్రామాలలో సన్న బియ్యం ఇస్తున్నారని, అందులో 40 శాతం నూకలే అని సహపంక్తి భోజనం పేరిట ఇంటి నుండి క్యారెజ్ తీసుకొని బిల్డప్ ఇస్తూ ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారని మండిపడ్డారు. నూకలు లేకుండా గురుకులాలకు కెసిఆర్ ఏ విధంగా సన్న బియ్యం ఇచ్చారో దమ్ముంటే అదేవిధంగా ఇవ్వండని సవాల్ విసిరారు. వడ్లు కొనమని అడిగితే.. నూకలు బుక్కండి అన్నది బిజెపి ప్రభుత్వం అయితే నూకలు ఉన్న బియ్యం ప్రజలకు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. లోకల్ బాడీ ఎన్నికలలో బిఆర్‌ఎస్‌కు లాభం అవుతుందని, కష్టపడి పనిచేస్తే మీ అందరికీ అవకాశాలు వస్తాయని మీ అందరికీ తన సంపూర్ణ మద్దతు సహకారం ఉంటుందని అన్నారు.ఉమ్మడి మెదక్ జిల్లా నుండి లక్ష మంది హాజరు కావాలని కెసిఆర్ మనకు టార్గెట్ ఇచ్చారని అన్నారు. నాయకులు సమావేశానికి కార్లలో కాకుండా కార్యకర్తలతో బస్సులో రావాలని ప్రతి ఒక్కరు కష్టపడి మీటింగ్ సక్సెస్ అయ్యే వరకు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News