కాంగ్రెస్ ఇస్తామన్న రూ. 12 లక్షలపై
ఖర్గే, రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలి
రూ.12 లక్షల కాదు…12 రూపాయలు
కూడా ఇవ్వరు రాష్ట్రంలో ఎప్పుడు
ఎన్నికలు జరిగినా తుఫాన్ వేగంతో
మా పార్టీ అధికారంలోకి వస్తుంది
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
తెలంగాణ భవన్‌లో ఘనంగా
అంబేద్కర్ జయంతి వేడుకలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు పెడితే తుఫాన్ వేగంతో బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని ఇంటికి త్వ రగా పంపాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. కెసిఆర్ మళ్లీ సిఎం కాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చే శారు. తెలంగాణకు మళ్లీ మంచి రోజులు రానున్నాయని ఉద్ఘాటించారు. తెలంగాణ భవన్‌లో సోమవా రం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులతో కలిసి కెటిఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వ ర్, శ్రీనివాస్ గౌడ్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మ ధుసూదనాచారి, బిఆర్‌ఎస్ నేతలు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్,ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ,
రేవంత్ రెడ్డిపై
ప్రజలు నమ్మకం కోల్పోయారని చెప్పారు. ఆటో వాళ్ల దగ్గర నుంచి అంతరిక్షం వరకు ఎన్నికలు వస్తే.. బిఆర్‌ఎస్‌కు ఓటు వేస్తామని చెబుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి చెబితే నమ్మరు కాబట్టే..ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పిలిచి కాంగ్రెస్ ఎస్‌సి, ఎస్‌టి డిక్లరేషన్ ప్రకటించిందని తెలిపారు. అబద్ధపు ప్రచారంతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని మండిపడ్డారు. దళితులకు అంబేద్కర్ అభయహస్తం ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. రూ.12 లక్షల కాదుకదా.. 12 రూపాయలు కూడా ఇవ్వరని విమర్శించారు. దళితబంధు కింద ఇస్తామన్న రూ. 12 లక్షలపై ఖర్గే, రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్‌సి, ఎస్‌టిలకు విద్యాజ్యోతిల పథకం కింద 10వ తరగతి పాస్ అయితే రూ.10 వేలు, ఇంటర్ పాస్ అయితే రూ.15 వేలు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ.25 వేలు, పిజి చేస్తే లక్ష, పిహెచ్‌డిలు చేస్తే రూ.5 లక్షలు ఇస్తామన్న హామీ ఏమైందని అడిగారు. ఎస్‌సి, ఎస్‌టిల అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. అంబేద్కర్ స్పూర్తితో కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు.
దళితబంధుతో బిఆర్‌ఎస్‌కు నష్టం జరిగిన మాట వాస్తవమని, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం అని.. కానీ దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ఖలేజా ఉన్న్ నాయకుడు కాబట్టే.. కెసిఆర్ దళితబంధు లాంటి పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.12 లక్షలు కాదు కదా.. 12 రూపాయలు కూడా ఇవ్వదని అన్నారు. అంబేడ్కర్ దళితజాతికి మాత్రమే నాయకుడు కాదు అని, గాంధీ, నెహ్రూకు ధీటైన నాయకుడు అంబేడ్కర్ అని చెప్పారు. కాంగ్రెస్, బిజెపి కేంద్రంలో ఎవరు అధికారం ఉన్నా.. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్‌పై అమిత్ షా కామెంట్స్ దారుణమని మండిపడ్డారు. మతం మతం అంటూ బిజెపి దేశంలో విద్వేశాలు రెచ్చగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు కరెంటు, రుణమాఫీ లాంటివి ఇస్తే.. మోదీకి, బిజెపికి నచ్చదని, కానీ దోపిడీ దారులకు వేల కోట్లు మాఫీ చేయటానికి బిజెపి వెనుకాడదని ఆరోపించారు. డీ లిమిటేషన్‌తో దక్షిణాది గొంతు కోస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆధునిక భారతావనికి అంబేద్కర్ పునాదులు వేశారు
ఆధునిక భారతావనికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పునాదులు వేశారని కెటిఆర్ వ్యాఖ్యానించారు. బాబాసాహెబ్ ఆలోచన, ముందు చూపు చాలా గొప్పదని వెల్లడించారు. దేశంలో అందరూ బాగుండాలన్నదే అంబేద్కర్ ఆలోచన అని పేర్కొన్నారు. అంబేద్కర్ నమ్మిన సిద్దాంతం బోధించు, సమీకరించు, పోరాడు అనే తత్వాన్ని అర్థం చేసుకుని, ఆచరణలో పెట్టిందే కెసిఆర్ అని చెప్పారు. పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి లక్షల సంఖ్యలో ప్రజలను సమీకరిస్తూ, వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ, వివరిస్తూ, తెలంగాణకు అన్యాయం జరిగితే పోరాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యంగం ఆధారంగా రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కెసిఆర్ అని పేర్కొన్నారు. అంబేద్కర్‌ను అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదువుకోవడానికి బరోడా మహారాజ్ ఆశీర్వదించి పంపారని, కానీ బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో వేలాది మంది పిల్లలను అమెరికా పంపించి లక్షలాది పిల్లలను పటిష్టమైన పునాదివేశామని కెటిఆర్ తెలిపారు.