హైదరాబాద్: అధికార దాహంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే కూల్చే యత్నం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపణలు చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలని పగటి కలలు కంటున్నారని పొంగులేటి అన్నారు. శంషాబాద్ లోని నోవొటెల్ లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ విప్ లు ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ మేరకు పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వాన్ని కూల్చి ఆ సీట్లో కూర్చోవాలని తండ్రికుమారుల తాపత్రయమని మండిపడ్డారు. నడి బజారులో పశువుల మాదిరాగా ఎందరిని కొంటారో కొనాలని సవాల్ విసిరారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సూచించారు. గతంలో అక్రమంగా భూములు కొల్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లగొట్టిన భూములను భూభారతి ద్వారా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని తెలియజేశారు.
భూభారతి వచ్చాక కొత్త ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. భూములు వెనక్కి తీసుకుంటామని భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. తెలంగాణ మాజీ మంత్రి కెసిఆర్ సూచన మేరకే కొత్త
ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. గచ్చిబౌలిలో 400 ఎకరాలు వెనక్కి తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. పేదల ఆస్తులను భూభారతి ద్వారా తిరిగి పేదలకు పంచుతామని పొంగులేటి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మీద మొదటి నుంచి కుట్రలు జరుగుతున్నాయని, వెంటనే సిఎం అయిపోవాలని తండ్రి, కుమారుడు చూస్తున్నారని ధ్వజమెత్తారు. భూభారతి రావడంతో బిఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందని, ఎక్కడ అక్రమాలు బయట పడతాయోననే భయం కనిపిస్తోందని పొంగులేటి స్పష్టం చేశారు.