Wednesday, April 16, 2025

కొడుకు సరసం..తండ్రికి మరణ శాసనం

- Advertisement -
- Advertisement -

కొడుకు సరసం తండ్రికి మరణ శాసనమైంది. ఇద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం పట్టపగలే ప్రధాన రహదారిపై హత్యకు దారి తీసింది. గ్రామస్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లికి చెందిన బోరం వీరయ్య (53)కు ఇద్దరు కుమారులు ఉదయ్, పరమేష్ ఉన్నారు. వ్యవసాయమే ఆ కుటుంబానికి జీవనాధారం. కాగా వీరయ్య రెండో కుమారుడు పరమేష్‌కు గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. వీళ్ళిద్దరు కలిసి కొద్ది రోజుల క్రితం ఊరు విడిచి వెళ్లిపోయారు. మహిళ బంధువులు వారిద్దరిని ఏపి గుంటూరు జిల్లాలోని ఓ గ్రామంలో ఉండగా తీసుకొచ్చి గ్రామంలో పంచాయతీ పెట్టారు. ఒకరి వద్దకు మరొకరు వెళ్ళొద్దని గ్రామస్తుల సమక్షంలో రెండు కుటుంబాల వారు ఒప్పందం చేసుకున్నారు. మహిళను భర్త దగ్గరకు పంపించారు. అదే గ్రామానికి చెందిన మహేష్ గౌడ్‌తో సదరు మహిళకు చాలా సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం జరిగింది.

వీరికి ఇద్దరు సంతానం. కాగా కొద్ది రోజుల నుంచి మహిళతో పరమేష్ సన్నిహితంగా ఉంటున్నాడు. వీరిద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే కొద్ది రోజు కిందట వీరిద్దరు గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారిద్దరిని గ్రామానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత మహిళ బంధువులు పరమేష్‌పై దాడి చేశారు. దీని గురించి అప్పట్లోనే అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేశామని పోలీసులు కేసు పెట్టకుండా నిర్లక్షం వహించారని మృతుని బంధువులు ఆరోపించారు. కాగా మంగళవారం మధ్యాహ్నం బీరం వీరయ్య తన పెద్ద కొడుకు వెంకటేష్, మరో యువకుడు కలిసి తమ ద్విచక్ర వాహనంపై అచ్చంపేట నుంచి గ్రామ సమీపంలోని ఇటుకల బట్టి వద్దకు రాగా వెనుక నుంచి కారులో వీరిని అనుసరిస్తూ వస్తున్న మహేష్ గౌడ్, అతని బావమరిది శివ, మరో వ్యక్తి శివలు వీరయ్య వస్తున్న బైక్‌ను అచ్చంపేట హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆపేశారు.

కారులో ఉన్న వారు బైక్‌పై ఉన్న వారితో గొడవకి దిగారు. వెంటనే అందులోని ఒకరు సుత్తితో వీరయ్య తలపై బలంగా మోదారు. మరొకరు గొడ్డలితో అతని మెడపై బలంగా నరకడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు. తండ్రిపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన వెంకటేష్ పైన కూడా దాడి చేశారు. అతను భయంతో పెద్దగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. సంఘటన స్థలానికి అచ్చంపేట డిఎస్పి శ్రీనివాసులు, సిఐ రవీందర్, ఎస్సై రమేష్ చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News