సినిమా ఇండస్ట్రీ బయటకు కనిపించేంత అందంగా ఉండదు అని కొందరు అంటూ ఉంటారు. కొందరు ఆర్టిస్టులకు అది బంగారు బాట వేస్తే.. మరికొందరికి చేదు అనుభవాలను మిగిలిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. హీరోయిన్‌గా ఎదగాలి అంటే ఎన్నో అవరోధాలను దాటాల్సి ఉంటుందని కొందరు చెబుతుంటారు. అలా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్.
ఓ సినిమా షూటింగ్ సమయంలో ఓ హీరో డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె వెల్లడించింది. ఆ షూటింగ్ జరుగుతున్న సమయంలో తన ముందే దుస్తులు మార్చుకోవాలని. ఇలాంటి మాటలు అందరి ముందే మాట్లాడేవాడని ఆమె తెలిపింది. ఆ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు ఎంతో ఇబ్బందిపడ్డానని.. అది ఒక అసహ్యకరమైన సంఘటన అని పేర్కొంది.
ఆ తర్వాత నుంచి డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్లతో నటించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఈ విషయంపై బయటపెట్టిన తర్వాత తనకు ఇంకా అవకాశాలు రాకపోవచ్చని.. అయినా కూడా తాను ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నానంది. ‘నాతో అలా ప్రవర్తించిన నటుడి గురించి అందరికీ తెలుసు. కానీ ఎవరు దాని స్పందించే ధైర్యం చేయరు. డ్రగ్స్ తీసుకోవడం అనేది అతని వ్యక్తిగతం కానీ, అది పని చేస్తున్న చోట ప్రభావం చూపకూడదు. అది ఆమోదయోగ్యం కాదు’ అని విన్సీ తెలిపింది.