Sunday, April 20, 2025

సివిల్ వివాదంపై క్రిమినల్ కేసా.. ? పోలీసులకు సుప్రీం జరిమానా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆస్తి వివాదానికి సంబంధించిన సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినందుకు సుప్రీం కోర్టు ఉత్తరప్రదేశ్ పోలీస్ అధికారులకు రూ.50,000 జరిమానా విధించింది. సివిల్ వివాదాలతో ఎఫ్‌ఐఆర్ నమోదును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు వెల్లువెత్తుతున్నాయని, ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్తి వివాదంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఆమోదయోగ్యం కాదని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. జరిమానాను మాఫీ చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరగా అందుకు నిరాకరించింది.

గతంలో ఇటువంటి కేసులో సివిల్ విషయాన్ని క్రిమినల్ కేసుగా మార్చడం ఆమోదయోగ్యం కాదని తెలిపినప్పటికీ పోలీసులు తమ పద్ధతి మార్చుకోవట్లేదని మండిపడింది. ఈ కేసులో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిరానీ సోదరులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శిల్పిగుప్తా అనే వ్యక్తి దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను స్థానిక మెజిస్టీరియల్ కోర్టు రెండు సార్లు తిరస్కరించినప్పటికీ రాష్ట్ర పోలీస్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని పేర్కొంది.

ఈ కేసు పూర్వాపరాలు… ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిరానీ కుటుంబం కాన్పూర్ లోని తమ గిడ్డంగిని శిల్పి గుప్తా అనే వ్యక్తికి రూ. 1.35 కోట్లకు విక్రయించడానికి మౌఖికంగా ఒప్పందం కుదిరింది. అయితే 25 శాతం అడ్వాన్స్ కాకుండా గుప్తా కేవలం రూ. 19 లక్షలు మాత్రమే చెల్లించారు. దీంతో వారు మరో వ్యక్తికి తమ గిడ్డంగిని రూ. 90 లక్షలకు విక్రయించారు. అయితే తాను చెల్లించిన రూ. 19 లక్షలు తిరిగి ఇవ్వాలని కోరగా, బిరానీలు స్పందించకపోవడంతో బాధితుడు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు బిరానీలపై మోసం , బెదిరింపు వంటి క్రిమినల్ నేరాలను నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు అలహాబాద్ కోర్టును ఆశ్రయించగా దర్యాప్తుకు నిరాకరించడంతో బాధితుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News