మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఓ వ్యక్తి పై కత్తులతో దాడి చేయగా ఆ వ్యక్తి కి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మోత్కూర్ మండలంలోని పొడిచేడు గ్రామానికి చెందిన చంద్రయ్య, స్వరూప దంపతులు మృతి చెందడంతో వారి పిల్లలు శ్రావణి, శివలను చంద్రయ్య బావమరిది నర్రె నరసింహులు పెంచి పోషిస్తున్నారు. వారికి ఆరెగూడెం గ్రామ పరిధిలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. శ్రావణి మూడు సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన ఏనుగు మహేందర్ అనే యువకుడిని ప్రేమించి, వివాహం చేసుకుంది.
నరసింహులు, మహేందర్ మధ్య ఆస్తి వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా, నరసింహులు ఒకటిన్నర ఎకరాల భూమిని మహేందర్‌కు ఇవ్వడానికి అంగీకరించినప్పటికీ, మహేందర్ మిగిలిన భూమిని కూడా స్వాధీనం చేసుకోవాలని నర్సింహ్మపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఏనుగు మహేందర్, అతని అనుచరులు ఏనుగు మధు, కప్పె సైదులతో కలిసి మోత్కూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుకల్లో నరసింహులుపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన నరసింహులను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు, మోత్కూరు ఎస్ఐ డి. నాగరాజు తెలిపారు.