జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గాజులరామారం బాలాజీ లేఔట్ సహస్ర మహేష్ హైట్స్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే వెంకటేశ్వర్‌రెడ్డి, తేజ (35) దంపతులకు ఇద్దరు పిల్లలు. ఉన్నట్లుండి తేజ తన ఇద్దరు పిల్లలను కొబ్బరిబొండం కత్తితో నరికి, అనంతరం అపార్ట్మెంట్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికులను, పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. సాయంత్రం 4 గంటల సమయంలో జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్, ఏసీపీ బాలానగర్, డీసీపీ బాలానగర్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనలో తేజ, పెద్ద కుమారుడు హర్షిత్ రెడ్డి (11) అక్కడికక్కడే మృతి చెందినట్టు గుర్తించారు. చిన్న కుమారుడు ఆశిష్ రెడ్డి (9)ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా తేజ రాసిన ఆరుపేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో ఆమె తన భర్త వెంకటేశ్వర్‌రెడ్డిపై కొంత కోపంగా ఉన్నట్టు, అలాగే మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు లేఖలో పేర్కొన్నది. ఆమె కంటికి సంబంధించి ఆరోగ్య సమస్యలతో పాటు పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా దానికి కారణమని తెలుస్తోంది. తేజ కుటుంబంలో నెలకొన్న మానసిక, వైయక్తిక సమస్యలే ఈ ఘోర ఘటనకు దారితీశాయని పోలీసులు భావిస్తున్నారు. నిందితురాలైన తేజ తాను, పిల్లలను నరికి చంపే స్థితికి ఎలా చేరుకుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదనకు దారితీసింది. తేజ కుటుంబానికి చెందిన బంధువులు, పరిచయస్తులు ఈ విషాద ఘటనను తట్టుకోలేక పోతున్నారు.