Monday, April 21, 2025

సన్నరకాల వరి.. తెలంగాణ సిరి

- Advertisement -
- Advertisement -

ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్‌లో తెలంగాణలో సన్నరకాల వరిసాగు భారీ ఎత్తున విస్తరించింది. దాదాపు 40 లక్షల ఎకరాల్లో సాగు పూర్తయింది. గత యాసంగి సీజన్‌తో పోలిస్తే 15 లక్షల ఎకరాల వరకు పెరిగినట్టు చెప్పవచ్చు. దీన్ని బట్టి ఏ యాసంగి సీజన్‌లోనైనా ఇదేవిధంగా సన్నరకాల వరి భారీ ఎత్తున సాగవుతాయన్న సంకేతాలు సూచిస్తున్నాయి. ఈ విధమైన చెప్పుకోదగిన మార్పు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ప్రోత్సాహకమే ప్రధాన కారణం. క్వింటాల్‌కు రూ. 500 వంతున ప్రభుత్వం ప్రోత్సాహకం కల్పించింది. మొదట ఖరీఫ్ సీజన్‌లో దీన్ని అమలు చేశారు. యాసంగి సీజన్‌లోనూ కొనసాగించారు. నేరుగా రైతు మిత్ర పథకంగా దీన్ని అమలు చేయడం వల్లనే సత్ఫలితాలు సమకూరాయి.

ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎదురవుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఈమేరకు తన విధానాన్ని మలచుకుంది. ఏటా రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాలంటే 24 లక్షల నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకాల బియ్యం అవసరమవుతుంది. ఈ వ్యూహం సేకరణ లక్షాలకు అనుగుణంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఇందుకు సంబంధించి భాగస్వాములంతా సమానంగా ఆశావాదులు కాకపోవచ్చు. అయితే కొన్ని రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు ఒకే పంటపై అతిగా ఆధారపడడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. సమగ్ర పంటల వైవిధ్య వ్యూహం అవసరమని సూచిస్తున్నారు. తోటల పెంపకంతోసహా ప్రతి పంట రకానికి ఉన్న డిమాండ్ వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇప్పటికే జిల్లాల వారీగా నేల స్వభావం, వాతావరణ పరిస్థితులపై సమగ్రమైన అధ్యయనాలు జరిగాయి. అయితే ఇప్పుడు కావలసినదంతా సమన్వయ ప్రణాళిక. ఆయా నేలలకు ఏ పంట అనుకూలంగా ఉంటుందో, ఎంతవరకు వాటికి నీటి సరఫరా అవుతుందో ఆలోచించవలసిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వరి.. నీటి లభ్యతపై ఆధారపడే పంట. రాష్ట్రం మొత్తం మీద 29 లక్షల వ్యవసాయ మోటార్లు పనిచేస్తున్నాయి. అదే సమయంలో భూగర్భ జలాలు తరిగిపోతుండడం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రైతుల దృష్టిలో రాయితీలు (బోనస్) స్వాగతించాల్సిందే. కానీ ఎంతకాలం ఇలా రాయితీలు కల్పించవలసి వస్తుందో అన్నది చర్చనీయాంశమవుతోంది.

ఇప్పుడు దొడ్డురకం వరి కన్నా సాగవుతున్న సన్నరకాల వరి చాలావరకు లాభదాయకమేనని త్వరగా తెలుస్తోంది. ఎకరాల దిగుబడి వారీగా రాయితీలు సహాయం అందిస్తాయి. కానీ పంటకు తగిన నీటి సరఫరా అవుతుందా లేదా అన్నది ఆలోచించడం తప్పనిసరి. పంట లాభదాయకం కావాలంటే నీటి సౌకర్యమే కీలకం. స్థానిక నేల స్వభావం, వర్షపాతం, విత్తనాల రకం, ఎరువుల వినియోగం ఇవన్నీ పంట దిగుబడికి ఆధారమవుతాయి. 2023 నాటి యాసంగిలో 67,83,358 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. దీంతో పోలిస్తే 2024 లో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీరు సమృద్ధిగా ఉన్నందున వరిసాగుకు సానుకూలత ఏర్పడింది. గత ఏడాది 75.32 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలను సాగు చేయించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అందులో 40 లక్షల ఎకరాల మేరకు సన్నరకాల వరి విస్తీర్ణం నిర్ణయమైంది. ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాలనే తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని, రాష్ట్రంలోని అవసరాల దృష్టా ఖరీఫ్ సీజన్‌లో దొడ్డు రకాల వరికి బదులు సన్నవరి ధాన్యం పండించాలని రైతులకు సూచించింది.

ఆ మేరకు సన్నాలకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ప్రకటించడంతో అధికశాతం రైతులు సన్నవరి ధాన్యం సాగువైపే మొగ్గు చూపారు. వానాకాలంలో మొత్తం 66.77 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా, అందులో 40.44 లక్షల (61 శాతం) ఎకరాల్లో సన్నాలు సాగయ్యాయి. ఈ నేపథ్యంలో యాసంగిలో 54.83 లక్షల ఎకరాల వరిసాగు విస్తీర్ణానికి గాను, 40 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు కావడం గమనార్హం. 2023 వానాకాం సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 33 రకాల సన్నధాన్యాలను ప్రకటించింది. తెలంగాణ సోనా, బిపిటి, హెచ్‌ఎంటి వంటి సన్నరకాలను పెద్ద ఎత్తు సాగు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను కోరడం ఫలితాలను అందించింది. ఇప్పుడు ప్రభుత్వం రేషన్ కార్డులపై సన్నబియ్యం సరఫరా చేస్తుండటం మంచి స్పందన వస్తోంది. ఇది వరకు రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం మాత్రమే ఇచ్చేవారు.

లబ్ధిదారులు చాలా మంది దొడ్డు బియ్యం తీసుకోవడానికి వెనుకాడేవారు. చాలా వరకు ఈ దొడ్డు బియ్యం పక్కదారి పట్టేది. బహిరంగ మార్కెట్‌లో లబ్ధిదారులు సన్నబియ్యం కొనుగోలు చేయాలంటే అధిక ధర పలికేది. నెలకు సగటున ఒక కుటుంబానికి రూ.1000 నుంచి రూ.1200 వరకు బియ్యానికే ఖర్చు పెట్టవలసి వచ్చేది. ఇప్పుడు రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇస్తుండటంతో ప్రతి వారూ దీన్ని తీసుకోడానికి ముందుకు వస్తున్నారు. ఇది వరకు రాష్ట్రంలో 80 లక్షల రేషన్ కార్డులు, 2.80 కోట్ల మంది లబ్ధిదారులు ఉండేవారు. అదనంగా కార్డులు లేని 30 లక్షల మందిని కలుపుకుని మొత్తం 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం అందేలా ప్రభుత్వం చొరవ తీసుకుంది. అన్నయోజన పథకానికి కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి బియ్యం పథకానికి రూ. 10,655 కోట్లు ఖర్చవుతుండగా, సన్నబియ్యం సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 2858 కోట్లు ఖర్చుచేయడం ఎంతైనా ముదావహం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్ఠాత్మక పథకంగా ప్రజలను ఆకట్టుకుంటుందనడంలో అతిశయోక్తి లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News