Monday, April 21, 2025

బలం లేదు కాబట్టే బరిలోకి దిగలేదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సి
ఎన్నికకు దూరంగా ఉంటాం కౌన్సిలర్లకు
విప్ జారీ చేస్తాం ధిక్కరించిన వారిపై
చర్యలు తప్పవు బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభ
తెలంగాణ ప్రజల ఇంటి పండుగ
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సి ఎన్నిక పోలింగ్‌కు బిఆర్‌ఎస్ దూరంగా ఉం టుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రకటించారు. బలం లేదు కాబట్టే స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సి ఎన్నికలో అభ్యర్థిని పోటీలో పెట్టలేదని చెప్పారు. ఎన్నికకు హాజరు కావద్దని పార్టీ తరఫున కౌన్సిలర్లకు విప్ జారీ చేస్తామని, విప్ ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. బిజెపి వద్దు.. ఎంఐఎం వద్దు.. ఇరు పార్టీలకు సమదూ రం పాటించాలని అన్నారు. ఈ నెల  24వ తేదీన ఓటింగ్‌కు అందరూ దూరంగా ఉండాలని పార్టీ నేతలకు కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం గ్రేటర్ హైదరాబాద్ నేతలు, కార్యకర్తలతో బిఆర్‌ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంలో జరిగింది.

ఈ సమావేశానికి కెటిఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొనగా, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎంఎల్‌ఎలు ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, ఎంఎల్‌సిలు దాసోజు శ్రవణ్, వాణీదేవీ, గ్రేటర్ హైదరాబాద్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని కాలనీలు, బస్తీల్లో బిఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగురవేసి 27 నాటి ఆవిర్భావ సభ కోసం దండులా కదలాలని కెటిఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 27న జరిగే బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అని పేర్కొన్నారు.

ఎన్‌టిఆర్ టిడిపి తర్వాత.. 25 ఏళ్ల పాటు పార్టీని నడిపింది కెసిఆర్ మాత్రమేనని ఉద్ఘాటించారు. టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కొని కెసిఆర్ పార్టీ పెట్టారని గుర్తుచేశారు. కులబలం, ధనబలం లేకుండా కెసిఆర్ పార్టీని స్థాపించారని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌కు హైదరాబాద్ నగరంలో గతంలో స్థలం ఇవ్వలేదని గుర్తుచేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తన స్థలాన్ని పార్టీకి ఇస్తే నాటి ప్రభుత్వం ఆఫీసును ఖాళీ చేయించిందని పేర్కొన్నారు. కెసిఆర్ దీక్ష, పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని, ప్రజలు ఏ పాత్ర ఇచ్చినా బిఆర్‌ఎస్ సమర్థంగా పోషిస్తుందని తెలిపారు. చేసినవి చెప్పుకోనందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని పేర్కొన్నారు. 17 నెలల్లో బిఆర్‌ఎస్ గ్రాఫ్ బాగా పెరిగిందని వ్యాఖ్యానించారు.

పథకాలకు పైసలు లేవని చెబుతూ, లక్షన్నర కోట్లు పెట్టి మూసీ కడతానని రేవంత్ రెడ్డి అంటున్నారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం హైడ్రా, మూసీ, హెచ్‌సియు భూముల పేరుతో అరాచకాలు చేస్తోందని మండిపడ్డారు. కోర్టు సెలవులను చూసుకొని మరి పేదల మీద హైడ్రా ప్రతాపం చూపించిందని, హైకోర్టు మొట్టికాయలు వేసిన హైడ్రా తన పనితీరు మార్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా దెబ్బకు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పతనమైందని, లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని ఎంతోమంది పేదల కడుపు మీద కాంగ్రెస్ కొట్టిందని మండిపడ్డారు.

హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ సూపర్ హిట్ అయ్యింది

హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ సూపర్ హిట్ అయిందని కెటిఆర్ ఉద్ఘాటించారు. హైదరాబాద్ బయట కాంగ్రెస్ చేతిలో ప్రజలు మోసపోయారన్నారు.హైదరాబాదులో కాంగ్రెస్, బిజెపి కంటే బిఆర్‌ఎస్ బలంగా ఉందని అన్నారు. 2017 జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో 150కి గాను 99 కార్పొరేట్ స్థానాలను గెలుచుకొని బిఆర్‌ఎస్ కొత్త చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాదులో క్లీన్ స్వీప్ చేశామని, 2020 జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఎవరి మద్దతు లేకుండానే విజయం సాధించామని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోను ఓఆర్‌ఆర్ లోపల గులాబీ జెండానే ఎగిరిందని, కాంగ్రెస్‌కు ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కలేదని అన్నారు. హైదరాబాద్ ప్రజల ముందు కాం గ్రెస్, బిజెపిల మాయమాటలు, దొంగనాటకాలు పనిచేయలేదని చెప్పారు. డీ లిమిటేషన్ జరిగితే గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఎక్కువ అసెంబ్లీ సీట్లు, ఎంపీ సీట్లు పెరుగుతాయని చెప్పారు. రేవంత్ రెడ్డి పిచ్చి పనులతో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో అసహ్యం పెరుగుతుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చి నా ప్రజలే తమను గెలిపించుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరలోనే ఉప ఎన్నికలు కచ్చితంగా వ స్తాయని, వాటి కోసం కూడా కొట్లాడాలని పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. సందట్లో సడేమియాలా బిజెపి నేతలు అధికారం కోసం ఆశపడుతున్నారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిఆర్‌ఎస్ తుఫాన్ ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరిగి బిఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

ఇద్దరు కేంద్రమంత్రులతో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదు

ఇద్దరు కేంద్రమంత్రులతో తెలంగాణకు ఎలాంటి ఉపయోగం లేదని కెటిఆర్ విమర్శించారు. రాష్ట్ర బిజెపి ఎంపీ లు కాంగ్రెస్‌ను ఒక్క మాట కూడా అనరు అని, 17 నెలల్లో తెలంగాణకు బిజెపి ఒక్క పైసా పని చేయలేదని ఆరోపించారు.హెచ్‌సియు భూములపై మోడీ ఎందుకు విచారణ జరిపించట్లేదు..? అని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్, బిజెపి ఒక్కటే అని ఆరోపించారు. పేరు చెప్పకుండా తాను ఒక బిజెపి ఎంపీని అంటే గుమ్మడి కాయల దొంగల్లాగా అందరూ భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను నమ్మి మొన్ననే మోసపో యాం.. ఈసారి బిజెపిని నమ్మితే మళ్లీ మోసపోతామని ప్రజలు భయపడుతున్నారని పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఇడి ఛార్జ్ షీట్ పెడితే సిఎం రేవంత్‌రెడ్డి బిజెపి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని అన్నా రు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సిఎం రేవంత్ రెడ్డిలది దృఢమైన బంధం అని ఆరోపించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో మోదీ ఎందుకు విచారణ చేయించడం లేదని కెటిఆర్ ప్రశ్నించారు.

అక్టోబర్‌లో బిఆర్‌ఎస్ అధ్యక్ష ఎన్నిక

బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అక్టోబర్‌లో ఉంటుందని కెటిఆర్ వెల్లడించారు. ఈ నెల 27 పార్టీ రజతోత్సవ సభ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని, ఈసారి డిజిటల్ సభ్యత్వాలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. అన్ని విషయాలపై అవగాహనతో మాట్లాడగలిగేలా నియోజకవర్గాలలో కార్యకర్తలకు త్వరలో శిక్షణ ఇస్తామని కెటిఆర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News