న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో జరిగిన భవనం కూలిపోయిన ఘటనలో ముగ్గురు పిల్లలు సహా 11 మంది మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదన్ని మిగిల్చింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), ఢిల్లీ అగ్నిమాపక, పోలీసు సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలంలో రోజంతా తీవ్రంగా శ్రమించి.. శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. అలాగే, 11 మంది మృతదేహాలను బయటకు తెచ్చారు.
ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు మృతి చెందారు. వీరిలో భవనం యజమాని 60 ఏళ్ల తెహ్సిన్, ఆయన కుమారుడు, కోడలు, ముగ్గురు మనవళ్లు, చిన్న కోడలు ఉన్నారు. “మేము మా కుటుంబంలోని ఒక తరాన్ని క్షణంలోనే కోల్పోయాము” అని తెహ్సిన్ సోదరుడు భూలాన్ కన్నీటి పర్యాంతయయ్యారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా.. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ఈ ఘటనపై దర్యాప్తుకు సిఎం ఆదేశించారు.
విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి
ఈ సంఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. “ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో భవనం కూలి దురదృష్టకర సంఘటనలో పిల్లలు, మహిళలు సహా అనేక మంది మరణించిన వార్త చాలా బాధాకరం. మృతుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను” అని రాష్ట్రపతి ఎక్స్ లో పోస్ట్ చేసింది.