నేటి నుంచి వాన్స్ దంపతుల నాలుగు రోజుల భారత పర్యటన
కీలక అంశాలపై చర్చించనున్న మోడీ, వాన్స్
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం రాత్రి యుఎస్ ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌తో వాణిజ్యం. టారిఫ్, ప్రాంతీయ భద్రత సహా కీలక అంశాలపైన, మొత్తంగా ద్వైపాక్షిక సంబంధాల విస్తరణకు మార్గాలపైన చర్చలు జరపనున్నారు. ఆ తరువాత వాన్స్, భారత సంతతి యుఎస్ రెండవ మహిళ ఉష కోసం ప్రధాని మోడీ విందు నిర్వహించనున్నారు. వాన్స్, ఉష, వారి ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్ నాలుగు రోజుల భారత పర్యటనపై సోమవారం ఉదయం 10 గంటలకు పాలమ్ విమానాశ్రయంలో దిగనున్నారు. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా సుమారు అరవై దేశాలపై ప్రతీకార టారిఫ్‌లు విధించి, అటుపిమ్మట కొంత విరామం ప్రకటించిన కొన్ని వారాల తరువాత వాన్స్ మొదటిసారిగా భారత్‌కు వస్తున్నారు.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంతకాల కోసం న్యూఢిల్లీ, వాషింగ్టన్ ప్రస్తుతం సంప్రదింపులు నిర్వహిస్తున్నాయి. టారిఫ్, మార్కెట్ సదుపాయం సహా పలు సమస్యల పరిహరణకు ఆ ఒప్పందం దోహదం చేయగలదని ఆశిస్తున్నారు. వాన్స్ కుటుంబం ఢిల్లీ చేరుకున్న తరువాత స్వామి నారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించనున్నదని, వారు సాంప్రదాయక భారతీయ హస్తకళల ఉత్పత్తులు విక్రయించే ఒక షాపింగ్ కాంప్లెక్స్‌ను కూడా సందర్శించవచ్చునని అభిజ్ఞ వర్గాలు సూచించాయి. వాన్స్ దంపతులకు పాలమ్ విమానాశ్రయంలో సీనియర్ కేంద్ర మంత్రి ఒకరు స్వాగతం పలకనున్నారు. వాన్స్, ఆయన కుటుంబం ఢిల్లీతో పాటు జైపూర్, ఆగ్రా కూడా సందర్శిస్తారు. వాన్స్ వెంట పెంటగాన్, విదేశాంగ శాఖ సహా సీనియర్ అధికారులు కనీసం ఐదుగురు రావచ్చునని ఆ వర్గాలు తెలియజేశాయి.
సోమవారం రాత్రి 6.30 గంటలకు ప్రధాని మోడీ తన 7 లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో వాన్స్‌కు, ఆయన కుటుంబానికి స్వాగతం పలుకుతారు. ఆ తరువాత అధికారపూర్వక చర్చలు జరుగుతాయి. ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి తుది రూపం ఇవ్వడంపైన, రెండు దేశాల మధ్య సంబంధాల పెంపుదలపైన సమావేశంలో దృష్టి కేంద్రీకరించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోడీ సారథ్యంలోని భారతీయ ప్రతినిధి బృందంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రి, యుఎస్‌లోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఉండవచ్చునని ఆ వర్గాలు తెలియజేశాయి. చర్చల అనంతరం వాన్స్‌లు, వారి వెంట ఉన్న అమెరికన్ అధికారుల కోసం మోడీ విందుకు ఆతిథ్యం ఇస్తారు. వాన్స్, ఆయన కుటుంబం సోమవారం రాత్రి జైపూర్‌కు బయలుదేరి వెళతారని ఆ వర్గాలు తెలిపాయి. వాన్స్ కుటుంబం ఈ నెల 23న ఆగ్రా సందర్శిస్తుందని, వారు 24న జైపూర్ నుంచి యుఎస్‌కు తిరిగి బయలుదేరతారని ఆ వర్గాలు తెలియజేశాయి.