ఉద్ధవ్‌ను ప్రశ్నించిన నితేష్ రాణె
ముంబయి : ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ థాక్కరే ప్రకటనకు స్పందించే ముందు శివసేన (యుబిటి) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్కరే తన భార్య రష్మి థాక్కరేను సంప్రదించారా అని మహారాష్ట్ర మంత్రి, బిజెపి నేత నితేష్ రాణె ఆదివారం ప్రశ్నించారు. విడిపోయిన జ్ఞాతులు ఉద్ధవ్, రాజ్ మధ్య పొత్తు గురించిన ఊహాగానాలకు రాజ్ ప్రకటన దారి తీసిన విషయం విదితమే. రాజ్, ఉద్ధవ్ కొన్ని రోజులుగా చేస్తున్న ప్రకటనలు వారి మధ్య రాజీకి అవకాశం ఉందనే ఊహాగానాలకు దారి తీశాయి. తాము ‘చిన్న సమస్యలను’ పట్టించుకోకుండా, మహారాష్ట్ర, మరాఠీ ‘మనూల’ కోసం చేతులు కలపవచ్చుననే సంకేతాలను వారి వ్యాఖ్యలు వదిలాయి.
రాణె ఒక హిందీ వార్తా చానెల్‌తో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, ‘ఎంఎన్‌ఎస్‌తో చేతులు కలపడానికి ఉపక్రమించడానికి ముందు రష్మి థాక్కరే అనుమతి తీసుకున్నారా అని ఉద్ధవ్ థాక్కరేను మీరు అడగాలి. అటువంటి నిర్ణయాల్లో ఆమె అభిప్రాయానికి మరింత విలువ ఉంటుంది’ అని చెప్పారు. ఉద్ధవ్, రాజ్ మధ్య ‘తీవ్ర విభేదాలు ఏవీ’ లేనప్పటికీ శివసేన నుంచి రాజ్ నిష్క్రమణలో ‘ప్రధాన పాత్ర’ పోషించిన వ్యక్తి రష్మి థాక్కరే అని రాణె ఆరోపించారు. శివసేన (యుబిటి), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) చేతులు కలిపే అవకాశాలపై ప్రశ్నకు రాణె సమాధానం ఇస్తూ, బిజెపి నాయకత్వంలోని మహాయుతి మహారాష్ట్రలో అఖండ విజయం సాధించిందని చెప్పారు. ‘వారి మధ్య పొత్తు గురించి మేము ఆందోళన చెందడం లేదు’ అని రాణె స్పష్టం చేశారు.