చూస్తూ ఊరుకునేది లేదు
అందర్నీ కోర్టుకు లాగుతా
మాజీ క్రికెటర్ అజహరుద్దిన్ హెచ్చరిక
న్యూఢిల్లీ : ప్రముఖ మాజీ క్రికెటర్ అజహరుద్దిన్ స్టాండ్ పేరు ఎత్తివేత వ్యవహారం వివాదానికి దారితీసింది. భారత జట్టు మాజీ కెప్టెన్ తాజా నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పది సంవత్సరాల పాటు జట్టుకు నాయకత్వం వహించాను. గెలుపులతో గర్వకారణం అయ్యాను. అంతేకాకుండా హైదరాబాదీగా తనకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిని పట్టించుకోకుండా ఓ అంబుడ్స్‌మెన్ నార్త్ స్టాండ్ పేరు మార్పిడి ప్రకటన చేస్తారా? అని క్రికెటర్ ప్రశ్నించారు.దీనిని తాను చూస్తూ ఊరుకునేది లేదని , తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తానని , తక్షణ స్టే మంజూరికి అభ్యర్థిస్తానని అజర్ తెలిపారు.
క్రికెట్ స్టేడియంలో అజర్ స్టాండ్ చిరకాలంగా అలరారుతోంది. అజహరుద్దిన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( హెచ్‌సిఎ) అధ్యక్షులుగా ఉన్న దశలో అజర్ తన పదవీ దుర్వినియోగానికి దిగారని , పెద్ద ఎత్తున నిధులు కాజేశారని అనుబంధ లార్ట్ క్రికెట్ క్లబ్ ఫిర్యాదు చేసింది. దీనికి అనుగుణంగానే హెచ్‌సిఎ అంబుడ్స్‌మెన్, విశ్రాంత న్యాయమూర్తి వి ఈశ్వరయ్య ఎథిక్స్ ఆఫీసర్ హోదాలో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టాండ్‌కు అజహరుద్దిన్ పేరును తీసివేయాలని ఆదేశించారు. అయితే తాను చూస్తూ ఊరుకునేది లేదని , హైకోర్టుకు వెళ్లుతానని అజర్ చెప్పడం తో విషయం కీలక మలుపు తిరిగింది.
గిట్టని వారి పిటిషన్‌ను తీసుకుని తనను అగౌరవపర్చే రీతిలో వ్యవహరించడం అనుచితం అని అజర్ చెప్పారు. 99 టెస్టులు, 334 ఒన్డేల ఘనత ఉందన్నారు. అయితే పేరు గొప్పనే కానీ ఆయన హెచ్‌సిఎ అత్యున్నత మండలిలో కీలక పదవిలో ఉండగా , తనకు తానుగా నార్త్ స్టాండ్‌కు ఆయన పేరు పెట్టుకున్నారని, దీనిపై ఎవరిని ఏమి మాట్లాడనివ్వకుండా చేసుకుని, ఏకపక్షంగా తన పంతం నెగ్గించుకున్నారని అంబుడ్స్‌మెన్ ఆరోపించారు.. ఈ ఆరోపణలను అజహరుద్దిన్ ఖండించారు. విశిష్ట సేవలు అందించిన మాజీ కెప్టెన్ పేరు తొలిగించి ఈ విధంగా చేయడం మర్యాదనేనా అని ప్రశ్నించారు.
ఈ వ్యవహారంపై తాను తప్పనిసరిగా హైకోర్టుకు వెళ్లితీరుతానని తెలిపారు. పిచ్చి వాళ్లు, ఎప్పుడూ బ్యాట్ పట్టని వారు, బంతి టచ్ చేయని వారు అడ్డగోలుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతర్జాతీయ క్రికెట్లో 15000కు రన్స్ ఘనత ఉన్న తనకు ఇంతటి అవమానం అన్యాయం అని స్పందించారు. శివలాల్ యాదవ్ ఇతరుల పేరిట ఉన్న స్టాండ్లకు కూడా ఇదే గతి కల్పిస్తారా? అని అజర్ ప్రశ్నించారు. తాను పదవి దుర్వినియోగానికి పాల్పడినట్లు ఎవరో చెప్పగానే చర్య తీసుకుంటారా? అని నిలదీశారు.