Monday, April 21, 2025

ఒక మెచ్చుకోదగ్గ ప్రయత్నం ‘ఫస్ట్ రీల్’

- Advertisement -
- Advertisement -

We have a rich past… but a very poor history అంటాడు ఫిల్మ్ క్రిటిక్ జిమ్మీ కేజ్. మన భారతీయ సినిమాకి మరీ ముఖ్యంగా తెలుగు సినిమాకి ఇది బాగా వర్తిస్తుంది. తెలుగులో సినిమా గురించీ సినిమా వాళ్ళ గురించీ చాలా పుస్తకాలు వచ్చినప్పటికీ మన తెలుగు సినిమా చరిత్రను క్రమపద్ధతిలో శాస్త్రీయ అవగాహనతో రాసినవి దాదాపుగా లేవు. రెంటాల జయదేవ రాసిన ‘మన సినిమా ఫస్ట్ రీల్’ విలక్షణ ప్రయత్నం. జయదేవ తొలి తెలుగు టాకీ ‘భక్తప్రహ్లాద’ విడుదల తేదీ సెప్టెంబర్ 15, 1931 అని ఇప్పటి వరకూ అనుకుంటున్నది తప్పని, సరైన తేదీ ఫిబ్రవరి 6, 1932 అని సాక్ష్యాలతో నిరూపించడమే కాకుండా తొలి తమిళ టాకీ ‘హరిశ్చంద్ర’ అని, అలాగే పూర్తిస్థాయి టాకీలలో తమిళం కన్నా తెలుగే ముందని కూడా మన సినిమా చరిత్రను సరిచేశారు.

చాలావరకూ సరైన ఆధారాలతో మరుగునపడ్డ మన సినిమా చరిత్రను సేకరించడం, అలాగే చరిత్ర గమనంలో ఎవరూ గమనించని కొన్ని అంశాలపై ‘ఫోకస్’ చేసి వాటిని పిట్టకథల్లాగా వర్ణించడం, చారిత్రక వాస్తవాలను చెప్పినప్పుడు వాటి పక్కనే ఆధారాలనివ్వడం.. ఇవీ ఈ పుస్తకం లో కనబడే విశేషాలు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో మొదటి టాకీలకు సంబంధించిన విషయాలను వివరంగా అందించారు రచయిత. 1930ల్లోనే పితృస్వామ్య సమాజాన్ని ఎదిరించి తన ప్రతిభతో నటిగా రాణించిన టిపి. రాజలక్ష్మి గురించి రాసిన ‘అనగనగా ఒక సినిమా రాణి’ ఆసక్తికరంగా ఉంటుంది.

‘కళైమామణి’ బహుమతి గ్రహీత అయిన ఈమె దక్షిణభారత సినిమాలో తొలి మహిళా దర్శకురాలు. ఇందులో రచయిత పరిశోధనతో కొత్తగా తేల్చిన విషయం దక్షిణభారతపు తొలి బహుభాషా (తమిళం, తెలుగు) చిత్రం ‘కాళిదాసు’ (1931)లో సంభాషణలు పూర్తిగా తెలుగులోనే ఉన్నాయని నిరూపించడం. ఇందులో కూడా భిన్నాభిప్రాయాలు సోషల్ మీడియాలో కనబడుతున్నా, ప్రస్తుతానికి దొరుకుతున్న ఆధారాలలో ఎక్కువ శాతం రచయిత ప్రతిపాదించిన విషయాన్నే బలపరుస్తున్నాయి.

మరో కొత్తవిషయం విఆర్ గంగాధర్ అనే తెలుగు నటుడు ‘కాళిదాసు’ పాత్రను పోషించాడనేది. దీనికి సాక్ష్యంగా (పు.185) ఇచ్చిన పత్రికాప్రకటన ఏ పత్రికలోదో చెప్పలేదు. సైలెంట్ సినిమా గురించి రాసిన అధ్యాయంలో హిమాంశురాయ్ ‘లైట్ ఆఫ్ ఏషియా’, పల్లెటూళ్ళలో వడ్డీ ప్యాపారులు పేదలను పీడించిన సబ్జెక్టుతో బాబూరావు పెయింటర్ తీసిన ‘సావ్కారీ పాష్’ వంటి చిత్రాల ప్రస్తావనే లేదు. దాదాసాహెబ్ ఫాల్కే గురించి, ఆయన చిత్రాల గురించి వివరంగా రాసి ఉంటే బాగుండే ది. ఇంతపెద్ద పుస్తకంలో సినిమాల విషయంలో ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న అంశాలకు తక్కువచోటు, అప్రధానమైన వాటికి ఎక్కువ చోటు ఇవ్వడం జరిగింది.

మూకీల నుంచీ కూడా తెలుగు సినిమాకు ముఖ్యమైన మూల స్తంభం సి.పుల్లయ్య గురించి ఏమీ చెప్పలేదు. 1925లోనే తెలుగు నేల మీద తెలుగువాడే తీసిన చిత్రం మార్కండేయ. తీసినది సి.పుల్లయ్య. ఈయన బొంబాయి వెళ్ళి సినిమా నిర్మాణంలో సాంకేతిక విషయాలను తెలుసుకుని వచ్చి కాకినాడలో మార్కండేయ మూకీ తీశాడు. సినిమా హాళ్ళ నిర్మాణాలను ఉద్యమ స్ఫూర్తితో చేపట్టాడు. ఈయన రాజమండ్రిలో దుర్గా సినీటోన్ స్టుడియో (1936), వైజాగ్‌లో ఆంధ్రా సినీ స్టూడి యో (1937)ల నిర్మాణానికి కలకత్తా నుంచి బెంగాలీ టెక్నీషియన్లను తీసుకొచ్చాడు. టాకీలు వచ్చాక సి.పుల్లయ్య చిత్ర విజయాలు చాలా ఉన్నాయి. భానుమతి, పుష్పవల్లి, కస్తూరి శివరావు, రేలంగి, అంజలీదేవి వంటి నటులు ఈయన ద్వారానే తెరకు పరిచయం అయారు. ఈయన సమకాలీకుడైన పి.పుల్లయ్యకు ఇచ్చిన చోటు కూడా ఈయనకు ఇవ్వకపోవడం ఆశ్చర్యం.

సెల్యులాయిడ్ మ్యాన్‌గా పేరుపొందిన పికె నాయర్ గురించి ప్రస్తావనే లేదు. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ మూలపురుషుడు పికె.నాయర్. ఫాల్కే తీసిన రాజా హరిశ్చంద్ర చిత్ర శకలాలను కూర్చడం దగ్గర నుంచీ ఈయన ఎన్నో సినిమాల ప్రింట్స్, రీళ్ళు మాత్రమే కాక సినిమా పత్రికలూ, పుస్తకాలనూ సేకరించి, భద్రపరచి మనకు అందించారు. దక్షిణాదిన మిగిలిన ఏకైక సైలెంట్ సినిమా ‘మార్తాండ వర్మ’ (1930) ప్రింట్‌ని సేకరించి భద్రపరిచారు. దీని దర్శకుడు పివి.రావు మన తెలుగువాడే. సత్యజిత్రాయ్ పథేర్ పాంచాలి, రాజ్‌కపూర్ జాగ్ తే రహో, అటెన్బరో గాంధీ చిత్రాల గురించి రాయడం బాగుంది గానీ వీటన్నిటికంటే ముందే మనదేశం నుంచి 1937లో వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మొదటి అంతర్జాతీయ అవార్డు అందుకున్న మరాఠీ చిత్రం సంత్ తుకారామ్ గురించి చెప్పలే దు. కొన్ని చిన్నవైనా పంటి కింద రాయిలా తగిలే తప్పులు కనబడతాయి.

1973లో విడుదలైన ‘ఎర్రకోట వీరుడు’ చిత్రం గురించి రాస్తూ దానికి నిర్వహణ జరిపిన దశరథ రామిరెడ్డి కూతురు ఫటాఫట్ జయలక్ష్మిఅంతులేని కథలో ఉందని చెప్పడానికి బదులు మరోచరిత్రలో నటించిందని చెప్పారు. పేజీ 160, 340లలో ఉన్న ఫొటోల్లో సునీల్‌దత్ బదులు సంజయ్‌దత్ అని వచ్చింది. వైవి.రావు తీసిన ‘తాసిల్దార్’ సినిమా పోస్టర్ స్టిల్ కింద సిహెచ్.నారాయణరావు, భానుమతి అని రాయడానికి బదులు వైవి.రావు, భానుమతి అని వచ్చింది. 549వ పేజీలో రెండో స్వర్ణ పతకం సాధించినది మలయాళ చిత్రం ‘నిర్మాల్యం’ అని చెప్పారు. మలయాళ ‘చెమ్మీన్’ తరువాత రెండో స్వర్ణ పతకం కన్నడ సినిమా ‘సంస్కార’కు వచ్చింది. తరువాత అదూర్ మలయాళ సినిమా ‘స్వయంవరం’కి వచ్చాక ‘నిర్మాల్యం’కి వచ్చింది. రెండో స్వర్ణపతకం దక్షిణాదిన కన్నడ సినిమాకు వచ్చింది. ‘నిన్న తెలియనిది ఇవాళ తెలిసిన ప్రతిసారి చరిత్ర కొత్తరూపం, కోణం సంతరించుకుంటుంది’ అని ముందుమాటలో అన్నది సత్యం. ఎన్నో పరిమితులూ ప్రతికూలతల మధ్య రెంటాల జయదేవ చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం.

‘మన సినిమా.. ఫస్ట్ రీల్’
రచన: రెంటాల జయదేవ
పేజీలు: 566, వెల: రూ. 750
ప్రతులకు: ఎమెస్కో బుక్స్, విజయవాడ. 0866- 2436643. నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్. ఇతర అన్ని ప్రముఖ బుక్ షాపుల్లోనూ లభిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News