కథానాయకుడు సంపూర్ణేష్ బాబు అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న ’సోదరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. మన్ మోహన్ మేనం పల్లి దర్శకత్వంలో క్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్ర కథానాయకులు సంపూర్ణేష్ బాబు, సంజోష్‌లు మీడియాతో ముచ్చటించారు.
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. ‘అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు అలాంటి అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై మనకు ఆవిష్కరించబోతున్న చిత్రమే సోదరా. ఇది నా గత చిత్రాల తరహాలో ఉండదు. ఇది కుటుంబ కథ ఇద్దరూ అన్నదమ్ముల కథ. ఈ సినిమా అందరినీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది’ అని అన్నారు. మరో కథానాయకుడు సంజోష్ మాట్లాడుతూ.. ‘ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి దర్శకుడు ఈ సినిమాకు బ్రోమాంటిక్ అని ట్యాగ్ పెట్టాడు. ఇది అమాయకుడైన అన్న, అప్‌డేట్ అయినా తమ్ముడి కథ. ఇలాంటి అన్నదమ్ముల కథతో ఇప్పటి వరకు తెలుగులో ఏ సినిమా రాలేదు.ఈ సినిమాకు అందరూ కనెక్ట్ అవుతారు’ అని తెలిపారు.