- చైనాకు నష్టం కలిగించేలా చేస్తే ఊరుకోబోమన్న చైనా అధ్యక్షుడు
- అలాంటి ఒప్పందాలు జరిగితే ప్రతీకార చర్యలు తప్పవన్న జిన్‌పింగ్
- యుఎస్; చైనా మధ్మ ముదురుతున్న వాణిజ్య పోరు
బీజింగ్ : ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింతగా ముదురుతోంది. రెండు దేశాలు పోటాపోటీగా ఒకదానిపై మరొకటి టారిఫ్‌లు విధించుకున్నాయి. ఈ నేపథ్యంలో తమ ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవద్దని చైనా ఇతర దేశాలను హెచ్చరించింది. తమ హెచ్చరికలను పెడచెవిని పెట్టి ఒప్పందాలు కుదుర్చుకోవాలని చూస్తే ప్రతీకార చర్యలు తీసుకుంటామని చైనా స్పష్టం చేసింది. అమెరికాతో సుంకాలను తగ్గించుకోవడం లేదా మినహాయింపుల కోసం చర్చలు జరుపుతున్న దేశాలు చైనాతో వాణిజ్యాన్ని తగ్గించుకునేలా అమెరికా (ట్రంప్ ప్రభుత్వం) ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధం అవుతోందన్న వార్తల నేపథ్యంలో చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. ‘చైనా ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏ దేశం ఒప్పందం చేసుకున్నా దానిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అటువంటి పరిస్థితి తలెత్తితే దానిని ఎప్పటికీ అంగీకరించబోమని, కచ్చితంగా ప్రతీకార చర్యలు తీసుకుంటామని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. ‘స్వప్రయోజనాల కోసం ఇతరుల ప్రయోజనాలను దెబ్బ తీయడం పులి చర్మాన్ని కోరుకోవడమే. అది చివరికి విఫలం అవుతుంది. ఇతరులకు హాని చేస్తుంది’ అని చైనా తన ప్రకటనలో పేర్కొన్నది. అమెరికా ఏకపక్షంగా, రక్షణాత్మక విధానాలతో వ్యవహరిస్తోందని, సుంకాలను దుర్వినియోగం చేస్తోందని చైనా ఆరోపించింది. తమ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునే సామర్థం తమకు ఉందని, అమెరికా చర్యలకు వ్యతిరేకంగా అన్ని దేశాలతో కలసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చైనా తెలియజేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాతో వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఒక మంచి ఒప్పందం కుదురుతుందని ఇటీవల ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే, ఈ చర్చల విషయాన్ని చైనా ధ్రువీకరించలేదు, తాము వాణిజ్య యుద్ధాన్ని కడ వరకు కొనసాగిస్తామని చెబుతూనే చర్చలకు సిద్ధమని సంకేతాలు ఇచ్చింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఈ వాణిజ్య వివాదం ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చునని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.