Tuesday, April 22, 2025

నక్సలిజం నిర్మూలన దిశగా మా అడుగులు ఆగవు

- Advertisement -
- Advertisement -
  • ఝార్ఖండ్‌లో తాజా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో హోమ్ మంత్రి అమిత్ షా
  • బోకారో జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో 8 మంది నక్సల్స్ హతం
  • వారిలో అగ్రశ్రేణి నక్సల్‌పై కోటి రూపాయల రివార్డు

న్యూఢిల్లీ: నక్సలిజం నిర్మూలనకు తమ ప్రభుత్వ నిబద్ధత కొనసాగుతుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సోమవారం స్పష్టం చేశారు. ఝార్ఖండ్‌లో భద్రతా దళాలతో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది నక్సలైట్ల వధ నేపథ్యంలో హోమ్ శాఖ మంత్రి ఆ వ్యాఖ్యలు చేశారు. ఝార్ఖండ్ బొకారో జిల్లాలో సిఆర్‌పిఎఫ్ కోబ్రా కమాండోలు, పోలీసులతో ఎన్‌కౌంటర్‌లో తన తలపై కోటి రూపాయల రివార్డు ఉన్న తీవ్రవాదులు అగ్ర శ్రేణి కేంద్ర కమిటీ సభ్యునితో సహా ఎనిమిది మంది నక్సల్స్ హతులయ్యారు. ‘నక్సలిజం నిర్మూలన దిశగా మా అడుగులు ఆగకుండా సాగుతున్నాయి. నక్సలిజం నిర్మూలనకు ప్రస్తుతం సాగుతున్న ఆపరేషన్‌లో భద్రతా దళాలు సోమవారం మరొక విశిష్ట విజయం సాధించాయి. ఝార్ఖండ్ బొకారో జిల్లాలోని లుగు హిల్స్‌లో ఎన్‌కౌంటర్‌లో కోటి రూపాయల రివార్డు ఉన్న అగ్రశ్రేణి నక్సల్ నేత, మరి ఇద్దరు ఘరానా నక్సలైట్లు సహా ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. మన భద్రత దళాలను శ్లాఘించాలి’ అని అమిత్ షా ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. సిఆర్‌పిఎఫ్ 209 కోబ్రా సిబ్బంది రాష్ట్ర పోలీసులతో కలసి నిర్వహించిన ఆపరేషన్‌లో ఎనిమిది మంది నక్సల్స్ హతులైనట్లు, ఒక ఎకె సీరీస్ రైఫిల్‌ను, మూడు ఇన్సాస్ రైఫిల్స్‌ను, ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (ఎస్‌ఎల్‌ఆర్)ను, ఎనిమిది దేశవాళీ తుపాకులను, ఒక పిస్తోలును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. హతుల్లో తీవ్రవాద సంస్థ సెంట్రల్ కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్, స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు అర్వింద్ యాదవ్ అలియాస్ అవినాశ్, జోనల్ కమిటీ సభ్యుడు సహెబ్రమ్ మాంఝీ అలియాస్ రాహుల్ మాంఝీ, మహేష్ మాంఝీ అలియాస్ మోటా, తాలు, రంజు మాంఝీ, గంగారామ్, మహేశ్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News