Tuesday, April 22, 2025

పిడుగుపాటుకు పత్తి లారీ దగ్ధం

- Advertisement -
- Advertisement -

రోడ్డుపై వెళ్తున్న పత్తి లారీపై పిడుగు పడి దగ్ధ్దమైంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా, నేరెడుచర్ల మండలం, చిల్లేపల్లి వద్ద మిర్యాలగూడ =కోదాడ ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, లారీ డ్రైవర్ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన లారీ తెలంగాణలోని కరీంనగర్ జిల్లా, సైదాపూర్ మండలం, చింతపల్లిలోని కవిత కాటన్ ఇండస్ట్రీస్ పత్తి మిల్లు నుండి సుమారు రూ.40 లక్షల విలువ గల 24 టన్నుల పత్తిలోడు చేసింది. అనంతరం తమిళనాడులోని కోవైపట్టిలో మహావిష్ణు స్పిన్నింగ్ మిల్లుకు పత్తి లారీ లోడుతో బయలుదేరి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో నేరెడుచర్లకు వచ్చే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. రాత్రి 11.30 సమయంలో చిల్లేపల్లి వద్దకు చేరుకునే సరికి లారీపై ఉన్న పత్తి నుండి మంట వస్తోందని స్థానికులు, వెనక నుండి వస్తున్న వాహనదారులు డ్రైవర్‌కు తెలిపారు.

దీంతో లారీ పక్కకు ఆపి చూడగా మంట విపరీతంగా వస్తోంది. వెంటనే స్థానికులు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. మిర్యాలగూడ ఫైర్ స్టేషన్ నుండి వాహనం వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు అదుపు కాలేదు. సుమారు 8 గంటలు కష్టపడినా మంటలను ఆర్పలేకపోవడంతో జెసిబి సహాయంతో లారీలోని పత్తిని తొలగించారు. వర్షం సమయంలో పిడుగు పడిందా.. లేదా విద్యుత్‌షార్ట్ సర్కూట్ జరిగి లారీపై మంటలు వ్యాపించాయా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం వల్ల సుమారు రూ.40 లక్షలు విలువ గల పత్తితో పాటు రూ.40 లక్షలు విలువ గల లారీ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఎస్‌ఐ రవీందర్ తన సిబ్బందితో నిరంతరం పర్యవేక్షిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News