Tuesday, April 22, 2025

కెటిఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఉట్నూరు పోలీసుస్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మూసీ ప్రాజెక్టు పేరుతో రూ.25 వేల కోట్ల నిధులను కాంగ్రెస్ పార్టీ తరలించిందంటూ కెటిఆర్ చేసిన ఆరోపణలు తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశారంటూ ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీసుస్టేషన్‌లో గత ఏడాది సెప్టెంబర్ 30న కేసు నమోదైంది. ఈ క్రమంలో కేసును కొట్టివేయాలని కోరుతూ కెటిఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తాజాగా ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. కెటిఆర్‌పై మహదేవ్‌పూర్ పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం. మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్ ఎగురవేశారనే కారణంతో కెటిఆర్ సహా మరికొంతమందిపై మహదేవ్‌పూర్ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అయితే, ఈ కేసును సవాల్ చేస్తూ కెటిఆర్ హైకోర్టును ఆశ్రయించారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. సోమవారం కూడా కోర్టులో విచారణ జరిగింది. మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని కెటిఆర్ తరఫు న్యాయవాది టివి రమణారావు వాదించారు. రాజకీయ కక్షతనే కేసు నమోదు చేశారని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ డ్రోన్ ఎగురవేయడం డ్యామ్ భద్రతకే ప్రమాదమన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం కెటిఆర్‌పై మహదేవ్‌పూర్ పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేసింది. ఈ మేరకు తీర్పు ఇస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందంటూ, బిఆర్‌ఎస్ అవినీతికి ఇదే నిదర్శనం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తమ పార్టీ నేతలతో కలిసి జూన్‌లో భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఆ టైమ్ లో బిఆర్‌ఎస్ కార్యకర్తలు కొందరు డ్రోన్ ఎగురవేసి మేడిగడ్డ బ్యారేజీ వీడియోలు తీశారు. ఆ వీడియోలను యూట్యూబ్, ఫేస్ బుక్, ఎక్స్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో అప్ లోడ్ చేశారు. దాంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.

ఈ వీడియోలను పోస్ట్ చూస్తే మేడిగడ్డ బ్యారేజీకి ఏం కాలేదని, పెద్ద ఎత్తున వరద వచ్చినా తట్టుకున్నదని, ప్రభుత్వం కావాలనే మేడిగడ్డపై రాజకీయం చేస్తుందని ప్రచారం చేశారు. అయితే, డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరణకు బిఆర్‌ఎస్ ముందస్తు అనుమతి తీసుకోలేదంటూ ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కెటిఆర్, బాల్క సుమన్, గండ్ర వెంకటరమణా రెడ్డి సహా పలువురిపై మహదేవ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజీయ కక్షతనే తనపై కేసు నమోదు చేశారని, తక్షణమే ఆ కేసును కొట్టివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో పలు దఫాలుగా వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. సోమవారం నాడు కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News