ఎపి రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మే 2వ తేదీన ప్రధాని అమరావతిలో పర్యటించి, సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారని మంత్రుల కమిటీ వెల్లడించింది. ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై చర్చించేందుకు మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ లతో కూడిన కమిటీ విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఆర్డీఏ అధికారులు, వివిధ శాఖల కార్యదర్శులు, సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులతో కూడిన నిర్వహణ కమిటీ సభ్యులు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మే 2న ప్రధాని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఏర్పాట్ల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కమిటీ అధికారులను ఆదేశించింది. ప్రధాని పర్యటన సందర్భంగా అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సుమారు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని మంత్రుల కమిటీ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా సభా ప్రాంగణం, హెలిప్యాడ్ల నిర్మాణం, సభకు చేరుకునే రహదారుల అభివృద్ధి, పార్కింగ్ సౌకర్యాలు, వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీరు, మజ్జిగ వంటి సౌకర్యాలను కల్పించడంపై మంత్రులు అధికారులతో చర్చించారు. జన సమీకరణ, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని అమరావతికి చేరుకుంటారని, సాయంత్రం 5:20 వరకు కార్యక్రమాల్లో పాల్గొంటారని మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతి పునర్నిర్మాణ వేదిక నుంచే ప్రధాని మోడీ లక్ష కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన చేస్తారని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ఈ పనులన్నింటికీ ఇప్పటికే ఆర్థిక వనరులు సమకూరాయని, కాంట్రాక్టర్లను కూడా ఖరారు చేశారని ఆయన తెలిపారు.
‘ప్రధానమంత్రి పనులను ప్రారంభించిన మరుసటి రోజు నుంచే క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం‘ అని పయ్యావుల కేశవ్ వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారని, వారికి గౌరవం కల్పించే వేదికగా కూడా ఈ కార్యక్రమం నిలవాలని ఆశిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అన్ని జిల్లాల నుంచి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సమన్వయంతో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ చారిత్రక ఘట్టంలో పాలుపంచుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ ఆహ్వానించారు. ప్రధాని పర్యటనతో అమరావతి అభివృద్ధి పనులు తిరిగి ఊపందుకుంటాయని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు.