ఆర్థిక ఇబ్బందులు ఇద్దరు చిన్నారుల ఉసురు తీశాయి. ఇద్దరు కుమార్తెలను వాగులోకి తోసి తాను కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది ఓ తల్లి. ఈ ఘటన సోమవారం జిల్లాలోని తూప్రాన్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… తూప్రాన్ శివారులో జాతీయ రహదారి 44 పక్కనే గల హల్దీవాగు బ్రిడ్జి వద్ద మమత తన ఇద్దరు ఆడపిల్లలు పూజిత (7), తేజస్విని (5)ని వాగులో తోసేంది. తాను కూడా దూకుదామనుకుంది… కానీ ఆమెకు భయమేసి పిల్లలను కాపాడే ప్రయత్నం చేసింది కానీ అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
స్థానికులు చిన్నారుల మృతదేహాలను వెతికితీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మమతకు మాసాయిపేటకు చెందిన స్వామితో వివాహం కాగా రెండేళ్ల క్రితం ఆనారోగ్యంతో భర్త మృతి చెందాడు. అప్పటి నుంచి శివ్వంపేట మండల పరిధిలోని దంతాన్‌పల్లిలో తల్లిగారి ఇంటి వద్దనే పిల్లలతో సహా ఆమె ఉంటోంది. ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితుల కారణం వల్ల ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.