ఎంబి రికార్డు చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ మేడ్చల్ జిల్లా, నాగారం మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డిఈఈ) సుదర్శనం రఘుతో పాటు ఇద్దరు ఔట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లను ఎసిబి అధికారులు అదుపులో తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఎసిబి డిఎస్‌పి ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… నాగారం మున్సిపల్ పరిధిలో సిసి రోడ్డు పనులు చేపట్టేందుకు ఓ కాంట్రాక్టు టెండర్ ద్వారా రూ.11 లక్షల విలువ చేసే పనులు దక్కించుకున్నాడు. సకాలంలో పనులు పూర్తి చేసి బిల్లుల కోసం డిఈఈని సంప్రదించాడు. చేసిన పనులకు బిల్లు చెల్లించేందుకు జిఎస్‌టి ఇతర పన్నులు పోను రూ.8.50 లక్షలకు డిఈఈ ఎంబి రికార్డు చేయాల్సిన ఉంది. ఇందుకు ఆయన కాంట్రాక్టర్ నుంచి రూ.1.37 లక్షలు (16 శాతం) లంచం డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని కాంట్రాక్టర్ ప్రాధేయపడటంతో రూ.1.30 లక్షలు ఇవాల్సిందేనని డిఈఈ చెప్పాడు.
దీంతో బాధితుడు ఏసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు కాంట్రాక్టర్ డిఈఈని కలిసేందుకు సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాడు. మొదటి విడతగా రూ.లక్ష ఇవ్వబోగా వర్క్ ఇన్స్‌పెక్టర్ సురేష్‌కు ఇవ్వాలని డిఇఇ చెప్పాడు. కాంట్రాక్టర్ సురేష్‌ను కలువగా అతను మరో వర్క్ ఇన్స్‌పెక్టర్ రాకేష్‌కు ఇవ్వాల్సిందిగా సూచించాడు. దీంతో డిఈఈకి ఇవ్వాల్సిన రూ.లక్ష నగదును వర్క్ ఇన్స్‌పెక్టర్ రాకేష్ కాంట్రాక్టర్ నుంచి తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం డిఈఈ సుదర్శనం రఘు, ఔట్ సోర్సింగ్‌లో ఇర్క్ ఇన్స్‌పెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న వి.రాకేష్, వి.సురేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలోని ఇంజనీరింగ్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. విచారణ అనంతరం డిఈఈ, వర్క్ ఇన్స్పెక్టర్లను ఎసిబి కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.