చెన్నమనేని రమేష్
భారతీయుడు కాదు తేల్చి
చెప్పిన ఉన్నత న్యాయస్థానం
తప్పుడు పత్రాలతో 15ఏళ్లుగా
న్యాయస్థానాలను తప్పుదోవ
పట్టిస్తున్నారని ఆగ్రహం
పిటిషనర్ ఆది శ్రీనివాస్‌కు
25 లక్షలు చెల్లించాలని ఆదేశం
తప్పు ఒప్పుకొని ఆది
శ్రీనివాస్‌కు డిడి అందించిన
చెన్నమనేని రమేష్ తరఫు
న్యాయవాది వేములవాడ
ప్రజలకు క్షమాపణ చెప్పాలని
ఆది శ్రీనివాస్ డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. చెన్నమనేని రమేశ్ పౌరసత్వం పై గతంలో ఇచ్చిన తీర్పుపై సోమవారం హైకోర్టు లో విచారణ జరిగింది. చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని, జర్మన్ పౌరు డని న్యాయస్థానం తేల్చి చెప్పింది. తప్పుడు పత్రాలతో అధికారులు, న్యాయస్థానాలను 15 ఏళ్ల పాటు తప్పుదోవ పట్టించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నమనేని భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. చెన్నమనేని కోర్టు ఖర్చుల కింద రూ. 30 లక్షలు పిటిషనర్‌కు చెల్లించాలని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. 30 లక్షల్లో పిటిషనర్ ఆది శ్రీనివాస్‌కు 25 లక్షల రూపాయలు, హైకోర్టు లీగల్ సర్విసెస్ కమిటీకి రూ. 5 లక్షలు చెల్లించాలని ఆదేశించిన విషయం విదితమే. చెన్నమనేని రమేశ్ భారత పౌరుడు కాదని గత 15 ఏళ్లుగా ఆది శ్రీనివాస్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై అప్పీల్ చేయకుండా తప్పు ఒప్పుకుని కోర్టు ఖర్చుల కింద చెన్నమనేని రమేశ్ 30 లక్షల రూపాయలను చెల్లించారు.
దీంతో సోమవారం హైకోర్టు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ ముందు రూ. 25 లక్షలు పిటిషనర్ ఆది శ్రీనివాస్‌కు చెన్నమనేని రమేష్ తరపు న్యాయవాది డిడి అందించారు. ఈ సందర్భంగా పిటిషనర్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెన్నమనేని రమేశ్ అన్నారన్నారు. భారత పౌరుడు కాదని గత 15 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నానని, హైకోర్టు తీర్పుపైన అప్పీల్ చేయకుండా తప్పు ఒప్పుకున్నారని కోర్టు ఖర్చుల కింద 30 లక్షల రూపాయలను చెన్నమనేని చెల్లించా రని తెలిపారు. సోమవారం హైకోర్టు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ ముందు 25 లక్షల రూపాయలు తనకు డిడి రూపంలో చెన్నమనేని తరపు న్యాయవాది అందించారని చెప్పారు. మరో అయిదు లక్షల రూపాయలను తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించారన్నారు.