సీనియర్ హీరోయిన్ రంభ 1990ల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అయితే, రంభ సినిమాలకు దూరమై 15 ఏళ్లు అయిపోయాయి. ప్రస్తుతం ఓ టీవీ రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. కాగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రంభ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. వివాహం అనంతరం కెనడాలో స్థిరపడినట్లు ఆమె చెప్పుకొచ్చింది. రంభ ఇంకా మాట్లాడుతూ.. “నా పిల్లలకు ఒక వయసు వచ్చేవరకూ తల్లిగా పూర్తి బాధ్యత తీసుకున్నాను. వారిని దగ్గరుండి చూసుకున్నాను.
ఇప్పుడు మా బాబుకు 6 ఏళ్లు. కుమార్తెలకు 14, 10 ఏళ్లు వచ్చాయి. వాళ్ల కోసమే నేను ఇన్నేళ్లు సినిమాలకు దూరమయ్యాను” అని రంభ చెప్పింది. “నాకు సినిమాలపై ఉన్న ఆసక్తి నా భర్తకు తెలుసు. ఆయన ప్రోత్సాహంతోనే ఈ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించేందుకు అంగీకరించాను. ఈ షో కోసం నన్ను సంప్రదించినప్పుడు ఇందులో భాగం కావాలా, వద్దా అని ఆలోచించాను. నా కుటుంబం నన్ను ప్రోత్సహించింది. నాకు సినిమాలపై మరోసారి ఆసక్తి కలిగింది. 15 ఏళ్లు దూరమైనప్పటికీ నటన నా రక్తంలోనే ఉంది. నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన ఎంతోమంది నేటికీ నటిస్తూనే ఉన్నారు. అందుకే నేను కూడా మరోసారి వెండితెరపై కనిపించాలని నిర్ణయించుకున్నాను”అంటూ రంభ తెలిపింది.