Tuesday, April 22, 2025

దండకారణ్యంలో ఆగని హత్యాకాండ

- Advertisement -
- Advertisement -

‘హింస ద్వారా హింసను ఎప్పటికీ ఆపలేరు. ప్రేమ ద్వారా మాత్రమే హింసను జయించగలం. ఇది శాశ్వతమైన సత్యం’ అని బుద్ధుడు అన్నారు. ‘ప్రజలే అసలైన హీరోలు, అయితే వారిని అణచివేస్తే తిరుగుబాటు తప్పదు’ అని మావో అన్నారు. ఇద్దరి మాటలూ అహింస, ప్రేమ, శాంతి మార్గమే మానవ మనుగడకు అనుసరణీయమని చెబుతున్నాయి. ఆది వాసీల జల్, జంగల్, జమీన్, ఇజ్జత్‌ల కోసం మావోయిస్టులు చేస్తున్న పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా అత్యంత దారుణంగా అణచివేస్తోంది. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో అది సాగిస్తున్న సైనిక చర్యతో దండకారణ్యం అగ్నిగుండంలా రగులుతోంది. ఎన్‌కౌంటర్లు, వాయుసేన దాడులతో ఈ ప్రాంతాన్ని మరింత రక్తసిక్తం చేస్తోంది.

చత్తీస్‌గఢ్‌తో మొదలై మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విస్తరించిన ఈ దుర్మార్గపు యుద్ధం అమాయక ఆదివాసీల జీవితాలను బలిగొంటోంది. సొంత ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ప్రభుత్వం ఏం సాధిస్తుంది? ఇది కేవలం దూకుడు, ఆత్మరక్షణ శక్తుల మధ్య పోరాటం కాదు. ఇది భారత ప్రభుత్వం తన కార్పొరేట్ అనుకూల విధానాలను రుద్దడానికి సాగిస్తున్న ఏకపక్ష యుద్ధం. ఈ హింసాత్మక వాతావరణంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి శాంతి చర్చలే ఏకైక మార్గమని మావోయిస్టులు చేస్తున్న ప్రకటన వారి చిత్తశుద్ధికి నిదర్శనం. సాయుధ పోరాటం కంటే ఇతర శాంతియుత మార్గాల్లోనూ ప్రజల ప్రయోజనాలను సాధించవచ్చని వారు విశ్వసిస్తున్నారు.

బుద్ధుడు, మావో ఆలోచనా విధానాలను పాటిస్తున్నారు. ఒకవైపు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటిస్తున్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం చర్చలకు ముందుగానే మావోయిస్టులు లొంగిపోవాలనే షరతు విధించడం అత్యంత హాస్యాస్పదమైన విషయం. ప్రభుత్వం ముందుగా చర్చలకు వచ్చి మిగిలిన అంశాలను తేల్చాక కదా లొంగిపోవాలనే డిమాండ్ పెట్టేది. ఈ పోరాటంలో భారత ప్రభుత్వం సామాన్య ప్రజలను నేరుగా లక్ష్యంగా చేసుకుంటోందని మావోయిస్టులు అంటున్నారు. పైకి ఇది మావోయిస్టులకు వ్యతిరేకంగా జరుగుతున్నట్టు చిత్రీకరిస్తున్నా ‘ఆపరేషన్ కగార్’ కారణంగా చనిపోతున్న వారిలో దాదాపు ముప్పావు వంతు మావోయిస్టులు కాని, నిరాయుధులైన పౌరులేనని వారు వాదిస్తున్నారు.

మధ్య భారతదేశంలో సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకే భారత ప్రభుత్వం ఈ యుద్ధాన్ని ప్రారంభించిందని శాంతి చర్చల కమిటీ కూడా తీవ్రంగా ఆరోపిస్తోంది. ఆ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న ఆదివాసీలను తుడిచిపెట్టి, భారతదేశాన్ని ఆదివాసీ- ముక్త దేశంగా మార్చడమే ప్రభుత్వ అసలు లక్ష్యమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది బలగాలు, వందలాది సైనిక శిబిరాల మధ్య నలిగిపోతున్న ఆదివాసీల జీవితాలు క్షణక్షణం ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తమ దండకారణ్య కమిటీ చేసిన ప్రతిపాదనలను చత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి పంపింది. చత్తీస్‌గఢ్‌తో పాటు మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా వెంటనే శాంతి చర్చలకు రావాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘అణచివేతకు గురైన ప్రజలు, అణగారిన వర్గాలు, అణచివేతకు గురైన జాతీయతలకు వ్యతిరేకంగా ‘కగార్’ యుద్ధం జరుగుతోంది’ అని మావోయిస్టులు కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేస్తున్నారు.

ఇది కేవలం మావోయిస్టులకు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న సాధారణ వివాదం కాదు. జనవరి 2024 నుంచి ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కొనసాగుతున్న ఈ మారణహోమంలో ఇప్పటివరకు 400 మందికి పైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ మానవ విధ్వంసానికి వ్యతిరేకంగా దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగానూ గళాలు వినిపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితిలో సైతం భారతదేశంలో ఆదివాసీల హక్కుల ఉల్లంఘన తీవ్రంగా చర్చకు వచ్చింది. ఈ దారుణమైన యుద్ధంలో భారత ప్రభుత్వం కేవలం తన సైనిక బలగాలనే కాకుండా ఆదివాసీ యువతను సైతం నియమించి, వారిచేత ఇతర ఆదివాసీలను చంపిస్తోంది.

బలవంతంగా లొంగిపోయిన నక్సలైట్లను కూడా ప్రభుత్వ అణచివేత వ్యూహంలో భాగంగా ఉపయోగించే ప్రమాదం ఉంది. ఇది ఆ ప్రాంతంలో అంతర్యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రియా పర్యటన సందర్భంగా వియన్నాలో జరిగిన కమ్యూనిటీ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత్ బుద్ధుడిని ఇచ్చిందని, యుద్ధాన్ని కాదని ప్రపంచానికి గర్వంగా చెప్పగలమని అన్నారు. అంతేకాదు భారతదేశం ఎప్పుడూ శాంతి గురించి మాట్లాడుతుందన్నారు. మరి ఆయన ప్రభుత్వం దేశంలో చేస్తున్నదేమిటని ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్నాయి. సొంత ప్రజలను సొంత ప్రజలపైనే ఉసిగొల్పుతున్న ప్రభుత్వ దుర్మార్గపు చర్య ఇది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఏర్పడిన శాంతి చర్చల కమిటీ తక్షణమే కాల్పుల విరమణ పాటించి శాంతి చర్చలకు రావాలని ప్రభుత్వానికి, మావోయిస్టులకు విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు మరోసారి హైదరాబాద్‌లో ఏర్పడిన శాంతి చర్చల కమిటీ చేసిన ప్రతిపాదనకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సానుకూలంగా స్పందించింది.

ప్రజల ప్రయోజనాలను కేవలం సాయుధపోరాటం ద్వారానే కాకుండా ఇతర శాంతియుత మార్గాల్లోనూ సాధించవచ్చని వారు స్పష్టం చేశారు. తీవ్రమైన పోరాటంలో చిక్కుకున్నా మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉండడం వారి రాజకీయ పరిణతిని, ప్రజలపట్ల వారికున్న నిబద్ధతను తెలుపుతోంది. కేవలం ఆదివాసీల గురించే కాకుండా ఆదివాసీయేతర ప్రజల ప్రయోజనాల గురించి కూడా వారు ఆలోచిస్తున్నారు. శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడితే, పాలకుల అభివృద్ధి నమూనా తెచ్చిన మారణహోమం, రాజ్యాంగ పాలనలో నెలకొన్న సామాజిక, సాంస్కృతిక ఆందోళనల గురించి కూడా చర్చించడానికి వారు సిద్ధంగా ఉన్నారు.

మతపరమైన మైనారిటీలపై జరుగుతున్న వివక్ష, ఆదివాసీ, ఆదివాసీయేతర ప్రజల సాంస్కృతిక సంప్రదాయాల రక్షణ గురించి వారు గళం విప్పుతున్నారు. పౌరుల ప్రాణాలకు అత్యంత విలువనిస్తూ, మావోయిస్టులు శాంతి చర్చలకు సుముఖత వ్యక్తంచేయడం వారి మానవత్వాన్ని చాటుతోంది. ఆరు రాష్ట్రాల్లో భీకర యుద్ధం కొనసాగుతున్నా, పౌర సమాజం హృదయపూర్వక పిలుపునకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ వెంటనే స్పందించడం గమనార్హం. చర్చలతో తమకు లాభం చేకూరుతుందా లేదా అనే స్వార్థపూరిత ఆలోచనను పక్కనబెట్టి, శాంతి ప్రతిపాదన వచ్చినప్పుడల్లా మావోయిస్టులు సానుకూలంగా స్పందించడం వారి చిత్తశుద్ధిని, ప్రజల పట్ల వారికున్న బాధ్యతను తెలుపుతోంది.

మేకల ఎల్లయ్య
99121 78129

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News