టాప్5 ర్యాంకుల్లో ముగ్గురు
అమ్మాయిలు శక్తి దూబే ఫస్ట్
ర్యాంక్, హర్షిత్ గోయల్ సెకండ్
ర్యాంక్ 11వ ర్యాంక్ సాధించిన
వరంగల్ యువతి సాయి శివాని
బన్నా వెంకటేశ్‌కు 15వ ర్యాంక్
తెలుగు రాష్ట్రాల నుంచి చెప్పుకోదగ్గ
ర్యాంకులు సాధించిన అభ్యర్థులు
దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ పరీక్ష (సిఎస్‌ఇ) 2024 తుది ఫలితాలు వెలువడ్డాయి. యుపిఎస్‌సి ఈ మేరకే మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 1009 మందిని యుపిఎస్‌సి ఎంపిక చేయగా వారిలో 725 మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు. జనరల్ కేటగరీలో 335 మంది, ఇడబ్లుఎస్ నుంచి 109 మంది, ఒబిసి నుంచి 318 మంది, ఎస్‌సి కేటగరీ నుంచి 160 మంది, ఎస్‌టి కేటగరీ నుంచి 87 మంది ఎంపిక అయ్యారు. జాతీయ స్థాయిలో టాప్ 10 ర్యాంకర్ల జాబితాను కూడా యుపిఎస్‌సి ప్రకటించింది. వారిలో శక్తి దుబే, హర్షిత గోయల్, డోంగ్రే అర్చిత్ పరాగ్, షా మార్గి చిరాగ్, ఆకాశ్ గార్గ్, కోమల్ పూనియా, ఆయుషి బన్సల్, రాజ్‌కృష్ణ ఝా, ఆదిత్య విక్రమ్ అగర్వాల్, మయాంక్ త్రిపాఠి ఉన్నారు. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ సత్తా చాటారు.
సాయి శివాని 11వ ర్యాంకుతో సత్తా చాటగా, బన్నా వెంకటేశ్ 15వ ర్యాంకు, అభిషేక్ శర్మ 38వ ర్యాంకు, రావుల జయసింహా రెడ్డి 46వ ర్యాంకు, శ్రవణ్ కుమార్ రెడ్డి 62వ ర్యాంకు, సాయి చైతన్య జాదవ్ 68వ ర్యాంకు, ఎన్ చేతనరెడ్డి 110వ ర్యాంకు, చెన్నంరెడ్డి శివగణేశ్ రెడ్డి 119వ ర్యాంకు సాధించారు. టాపర్ శక్తి దుబే అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి బయోకెమిస్ట్రీలో బిఎస్‌సి పట్టా పొందారు. ఆమె తన ఆప్షనల్ సబ్జెక్టుగా పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌తో పరీక్షకు అర్హత పొందినట్లు యుపిఎస్‌సి ఒక ప్రకటనలో తెలియజేసింది. హర్షితా గోయల్ బరోడా ఎంఎస్ విశ్వవిద్యాలయ నుంచి బికామ్ డిగ్రీ పొందారు. ఆమె తన ఆప్షనల్ సబ్జెక్ట్‌గా పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌తో పరీక్షకు అర్హత సాధించారు. తమిళనాడులోని వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విఐటి) నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బిటెక్ పట్టభద్రుడైన డోంగ్రే అర్చిత్ పరాగ్ తన ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఫిలాసఫీని ఎంపిక చేసుకున్నట్లు యుపిఎస్‌సి తన ప్రకటనలో తెలియజేసింది. అహ్మదాబాద్‌లోని గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో బిటెక్ పట్టభద్రురాలైన షా మార్గి చిరాగ్ తన ఆప్షనల్ సబ్జెక్ట్‌గా సోషియాలజీతో నాలుగవ ర్యాంక్ పొందారు.
ఢిల్లీలోని గురు గోబింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ పట్టభద్రుడైన ఆకాశ్ గార్గ్ తన ఆప్షనల్ సబ్జెక్ట్‌గా సోషియాలజీతో ఐదవ ర్యాంకు సాధించారు. మొదటి ఐదు స్థానాలు పొందిన అభ్యర్థుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ సహా 25 పైచిలుకు సర్వీసుల్లో వెయ్యికి పైగా పోస్ట్‌లు ఉన్నాయి. ప్రిలిమనరీ, మెయిన్స్ పరీక్షల అనంతరం మొత్తం 2845 మంది అభ్యర్థులు తుది దశగా జరిగే ఇంటర్వూకు అర్హత సాధించారు. సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో భాగంగా నిరుడు జూన్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా జూలై 1న ఫలితాలు వెలువడ్డాయి. ప్రిలిమినరీ పరీక్షకు 992599 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 583213 మంది మాత్రమే హాజరయ్యారు. అనంతరం సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. వాటి ఫలితాలను డిసెంబర్‌లో ప్రకటించారు. మెయిన్స్‌లో 14627 మంది ఉత్తీర్ణులకు గత జనవరి 7 నుంచి ఈ నెల 17 వరకు రెండు సెషన్లలో ఢిల్లీలో ఇంటర్వూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను యుపిఎస్‌సి ప్రకటించింది.
2024 సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా భర్తీ చేసేందుకు ఐఎఎస్‌లో 180, ఐఎఫ్‌ఎస్‌లో 55, ఐపిఎస్‌లో 147, వివిధ కేంద్ర గ్రూప్ ఎ సర్వీసుల్లో 695, గ్రూప్ బి సర్వీసుల్లో 142 పోస్ట్‌లు వెరసి 11296 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా, టాప్ 25 మంది అభ్యర్థుల్లో 11 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. సిఫార్సు చేసిన 241 మంది అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని ప్రొవిజనల్‌గా ఉంచినట్లు యుపిఎస్‌సి తెలిపింది. ఒక అభ్యర్థి ఫలితాన్ని కమిషన్ విత్‌హెల్డ్ చేసింది. పరీక్షల్లో ఉత్తీర్ణులైన మరి 230 మంది అభ్యర్థులను రిజర్బ్ జాబితాలో ఉంచినట్లు కమిషన్ తెలియజేసింది.