మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ కేసును ఫిలింనగర్ పోలీసులు ఛేదించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. జనవరి 10వ తేదీన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న ఫిలింనగర్ పోలీసులు నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. యూపీ రాష్ట్రానికి చెందిన రాజ్ కుమార్ పాండాతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు, మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్92లో పొన్నాల లక్ష్మయ్య తన సతీమణి అరుణాదేవి నివాసం ఉంటున్నారు. జనవరి 10న సమీపంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయానికి వెళ్లి వచ్చారు. మరుసటి రోజు ఉదయం బెడ్రూమ్ తలుపులు, కబోర్డు తెరిచి ఉన్నట్లు గుర్తించారు. అల్మారాలో భద్రపరిచిన రూ.10లక్షల బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు కనిపించకపోవడంతో అరుణాదేవి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, అల్మారాలో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలున్నా వాటి జోలికి వెళ్లకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఇంట్లోని పనివారు లేదా తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావించారు.చోరీ తర్వాత సరైన ఆధారాలు లభ్యం కాకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఘటనాస్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడం, కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ చీకటి వల్ల సరిగ్గా కనిపించకపోవడంతో నిందితులను గుర్తించలేకపోయారు. ఈ క్రమంలోనే ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ నంబర్ 87లో నివాసం ఉంటున్న వ్యాపారి సురేంద్రరెడ్డి ఇంట్లో చోరీ కోసం వచ్చిన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన డ్రైవర్ రాజ్‌కుమార్ పాండా అనే వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పదేళ్ల నుంచి నగరంలో ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్ పాండాను అదుపులోకి తీసుకున్న ఫిలింనగర్ పోలీసులు తమదైన శైలిలో విచారించగా పొన్నాల లక్ష్మయ్య ఇంటి చోరీ విషయం బయటపడింది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.