Wednesday, April 23, 2025

సన్‌రైజర్స్‌కు చావోరేవో

- Advertisement -
- Advertisement -

నేడు ఉప్పల్‌లో ముంబైతో కీలక పోరు

మన తెలంగాణ/హైదరాబాద్: వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగే పోరు సవాల్‌గా మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది.

ఈ సీజన్‌లో హైదరాబాద్ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ఇలాంటి స్థితిలో ముంబైతో పోరు జట్టుకు చావోరేవోగా తయారైంది. ఈ సీజన్‌లో ఇప్పటికే హైదరాబాద్‌ను ఓడించిన ముంబై ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్దమైంది. వరుస విజయాలతో మళ్లీ పుంజుకున్న ముంబై ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లు కూడా గెలుపే లక్షంగా పెట్టుకోవడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

సవాల్ వంటిదే..

ఆతిథ్య సన్‌రైజర్స్‌కు ఈ మ్యాచ్ సవాల్ వంటిదేనని చెప్పాలి. కిందటి మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడడంతో జట్టు ఆత్మవిశ్వాసం మరింత సన్నగిల్లింది. ఇలాంటి స్థితిలో బలమైన ముంబైను ఓడించడం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. కిందటి సీజన్‌లో అసాధారణ ఆటతో ప్రత్యర్థి జట్లను హడలెత్తించిన సన్‌రైజర్స్ ఈసారి మాత్రం పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. విధ్వంసక బ్యాటర్లుగా పేరున్న అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ తదితరులు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమవుతున్నారు. అభిషేక్, ఇషాన్‌లు ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే మెరుగ్గా రాణించారు. మిగతా అన్ని పోటీల్లోనూ నిరాశ పరిచారు.

కనీసం ఇకపై జరిగే మ్యాచుల్లోనైనా వీరు తమ తమ బ్యాట్‌లకు పని చెప్పాల్సిన అవసరం ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన బ్యాటర్లు హైదరాబాద్ ఉన్నా ఫలితం కనిపించడం లేదు. ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరో మ్యాచ్‌లో పూర్తిగా నిరాశ పరుస్తున్నారు. ఇది జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. ఐపిఎల్‌లోనే అత్యంత ప్రమాదకర జోడీగా పేరున్న అభిషేక్, హెడ్‌లు ఈ సీజన్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. గత సీజన్‌లో హైదరాబాద్ ఫైనల్‌కు చేరిందంటే ఈ జంట విధ్వంసక బ్యాటింగే ప్రధాన కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈసారి మాత్రం సన్‌రైజర్స్ ఓపెనర్లలో ఆ జోష్ కనిపించడం లేదు. క్లాసెన్ కూడా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమయ్యాడు. అతని వైఫల్యం కూడా జట్టుకు ప్రతికూలంగా తయారైంది.

ఇషాన్ కూడా పూర్తిగా తేలిపోతున్నాడు. ఒక్క మ్యాచ్‌లో తప్పిస్తే అతను ఇతర పోటీల్లో కనీసం రెండంకెల స్కోరును కూడా అందుకోలేక పోయాడు. దీన్ని బట్టి అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. నితీశ్ కుమార్ రెడ్డి కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. జట్టును ఆదుకోవడంలో విఫలమవుతున్నాడు. ఇలా కీలక ఆటగాళ్లందరూ తేలిపోతుండడంతో సన్‌రైజర్స్‌కు వరుస ఓటములు తప్పడం లేదు. బౌలింగ్‌లో కూడా జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో షమి, కెప్టెన్ కమిన్స్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తదితరులు ఆశించిన రీతిలో బౌలింగ్ చేయలేక పోతున్నారు. ముఖ్యంగా షమి వైఫల్యం జట్టును వెంటాడుతోంది. షమి ఒక్క మ్యాచ్‌లో కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. కనీసం మిగిలిన మ్యాచుల్లోనైనా రాణిస్తాడా లేదా అనేది సందేహమే.

జోరు మీదుంది..

మరోవైపు మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జోరుమీదుంది. ఆరంభ మ్యాచుల్లో వరుస పరాజయాలు చవిచూసిన ముంబై ప్రస్తుతం గెలుపు బాట పట్టింది. వరుస విజయాలతో మళ్లీ గాడిలో పడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబై సమతూకంగా ఉంది. ఓపెనర్ రోహిత్ శర్మ ఫామ్‌ను అందుకోవడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. రియాన్ రికెల్టన్ కూడా నిలకడగా బ్యాటింగ్‌చేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, విల్ జాక్స్ తదితరులతో ముంబై బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక బుమ్రా, దీపక్ చాహర్, బౌల్ట్, హార్దిక్, సాంట్నర్ వంటి స్టార్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న ముంబై మరో విజయంపై కన్నైసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News