ప్రపంచ వ్యాప్త విస్తృతి పొందిన సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు యునెస్కో గుర్తింపు లభించింది. భారత దేశ వారసత్వ ప్రతీకగా భావించే భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి అరుదైన గౌరవం సంప్రాప్తించింది. ప్రాచీన వారసత్వ సంపదలను భద్రపరిచే ఐక్యరాజ్యసమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో వీటికి తాజాగా చోటు దక్కింది. ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్భంగా ఈ విషయాలను యునెస్కో సంస్థ వెల్లడించింది.
భగవద్గీత, నాట్యశాస్త్ర లిఖిత ప్రతులతో పాటు వివిధ దేశాలకు చెందిన 74 వారసత్వ డాక్యుమెంటరీలను గుర్తించింది. దీంతో ఇంతవరకు మొత్తం సేకరణల సంఖ్య 570కి చేరింది. ‘భారతీయ జ్ఞానసంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోంది. ఈ రచనలు మన దేశంపై ప్రపంచ మానవ దృక్పథానికి, జీవన విధానానికి పునాదులుగా భాసిల్లుతున్నాయి. మన దేశం నుంచి 14 గ్రంథాలు యునెస్కో రిజిస్టర్‌లో చోటు చేసుకోవడం విశేషం. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన గుర్తింపుగా ప్రధాని నరేంద్ర మోడీ తన సందేశంలో పేర్కొన్నారు. శతాబ్దాలుగా మానవ ఔన్నత్యానికి దోహదపడిన ఈ రెండు ఉద్గ్రంధాలను నిక్షిప్తం చేయడమంటే కాలాతీత విజ్ఞానాన్ని సైతం పుణికిపుచ్చుకునే ప్రక్రియగానే స్వీకరించాలి.
భారతీయ జ్ఞానసంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోందనడానికి నిదర్శనం నేటి గుర్తింపే. భారతీయ జీవన విధానానికి పునాదులుగా భాసిల్లుతున్న ఈ రెండు గ్రంథాల సారాంశాలు సర్వజనావళికి ఆచరణీయాలేనన్న విషయాన్ని ప్రపంచమూ గుర్తించింది. ఇప్పటివరకు మన దేశంనుంచి 14 శాసనాలు. యునెస్కో రిజిస్టర్‌లో చోటు దక్కించుకున్నాయి.ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. గీతా సారాన్ని, నాట్య శాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్‌లో చేర్చడం మన జ్ఞాన సంపద, సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపు. ఇవి వేల శతాబ్దాలుగా మన నాగరికత ఔన్నత్యాన్ని వివరించి, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయి.
ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. యుద్ధరంగంలో సోదరులు, గురువులు, బంధుజనులందరినీ చూసి ధనుర్బాణాలు విడిచి చతికిల పడిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధ భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి బోధ మానవ వర్తన, వికాసానికి మెచ్చుతునక. మనుషులు ప్రవర్తించవలసిన తీరు, పారలౌకికాన్ని పొందే విధానం రెండింటినీ శ్రీకృష్ణుడు బోధించాడు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన క్షణంగా అభివర్ణించవచ్చు. భారత దేశమంటేనే వివిధ భాష, సంస్కృతుల సమ్మేళనం.
రామాయణ, మహాభారత ఇతిహాసాలు, ఉపనిషత్తుల నుండి సముపార్జించిన విజ్ఞాన సంపదతో విలసిల్లేదే మన పుణ్యభూమి. భగవద్గీతను కేవలం ఒక మతగ్రంథంగా ఎవరూ చూడరు.అదొక కర్తవ్య బోధమాత్రమే. భరత నాట్యకళ అంటేనే ప్రపంచమంతా మెచ్చే శాస్త్రం.
వీటిని ప్రపంచ వారసత్వ సంప్రదాయాలుగా యునెస్కో గుర్తించడమంటేనే భారతీయ విలువలకు, తత్వబోధకు, కళాకౌశల శాస్త్రానికి ఇచ్చిన సమున్నత గౌరవంగా భావించవచ్చు. భగవద్గీత లాంటి నిజజీవన సత్యాలు, తత్వాల చిత్రీకరణ, ధర్మబద్ధ జీవితం గురించి సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే ప్రవచించిన అంశాలు నిజంగా నిత్యజీవన అంశాలే. వాటి విశ్లేషణ ప్రతి ఒక్కరికీ అనుభవైక వేద్యాలే! ప్రపంచ దేశాలకు భారతీయతను పరిచయం చేసే ప్రక్రియ ఈనాడే మొదలు కాలేదు. కేవలం అర్జునుడి సందేహాలకు, సందిగ్ధానికి ఓ మేలుకొలుపుగా ఉండేవి. గీత పుట్టిన నాడే సర్వోన్నత స్థాయిలో ప్రపంచానికి తత్వశాస్త్రంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మానవునిలో ఉన్న భ్రమలను తొలగించే నీతినియమాల పాఠ్యాంశంగా ప్రాచుర్యం పొందింది. అందుకే భగవద్గీత ఎన్నో ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో అధ్యయన శాస్త్రంగా భాసిల్లుతోంది. ఈ గుర్తింపు ఏనాడో రావాల్సి ఉంది. అయినా ఇప్పటికీ ఆలస్యం కానట్లే. మన నాగరికతను, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించిందనే కాదు, ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నందునే ఇలాంటి గుర్తింపు సబబే! అణువణువునా ఆత్మస్థైర్యం సన్నగిల్లి నరనరానా నిరాశా, నిస్పృహలు ఆవహించిన వారికి గీతా పఠనం చైతన్యం నింపుతుంది.
అంతరాంతరాల్లో ఉన్న ఆసక్తులు, అనురక్తులు పొంగి పొర్లినప్పుడు నృత్యం జీవననాదమవుతుంది. గీతాసారం నిత్యజీవన సారమైతే, భరత నాట్యం భారతీయ కళల్లో ఉత్కృష్టమైంది. అంగికం, అభినయం నుంచి కళా సమ్మిళత నాట్యంగా ఎన్నో దేశాల భామలు నాట్యాభినయంలో మునిగితేలుతున్నారు. వీటి గురించి దేశవిదేశాల్లో తెలియని దేశమంటూ లేదు. సర్వకళాసారం వీటిలోనే ఉంటుందని దేశం ఏనాడో గుర్తించింది. విభిన్న సంస్కృతుల మేళవింపు కలిగిన సందర్భంలో పరిస్థితుల్లో నాట్యకళ కాని, గీతాపఠనం కాని చెక్కుచెదరకుండా ఆదరిస్తుండడం వాటి ఖ్యాతిని గురించి చెప్పుకోవడం విశేషమే. అందుకే అవి ఈనాటి విశ్వకళా రాజసాలుగా వినుతికెక్కాయి. దైనందిన జీవితానికి మార్గదర్శకంగా ధర్మాచరణ ప్రాశస్త్యమున్న అంశాలను భగవద్గీత మాత్రమే చూపుతుంది. భగవద్గీత, భరత నాట్య విశేషాలను మరింత విస్తృత స్థాయిలో భవిష్యత్‌లకు తెలియచేసేందుకు ప్రభుత్వాలు పూనుకోవాలి. వాటి వైశిష్టతలను భరతజాతికి పునరంకితం చేసే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవడం అవసరం.
సభావట్ కళ్యాణ్
90143 22572