ప్రపంచ పరస్పరం అర్థం చేసుకోవడానికి భాష ఒక బలమైన వారధి. భాష అంటే మానవాళి భావాలను ఒకరితో ఒకరు తమ ఆలోచనలను, భావాలను, సమాచారాన్ని పంచుకోవడానికి ఉపయోగించే ఒక వ్యవస్థ. భాష ద్వారానే మనుషులు తమ సంస్కృతిని, జ్ఞానాన్ని తరతరాలకు బదిలీ చేస్తారు. ఒకనాటి బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లం మాట్లాడే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. భాష కేవలం భావ వ్యక్తీకరణకు ఒక సాధనమే కాదు ! అంతకు మించి ఒక గొప్ప సాంస్కృతిక సంపద అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23న ఆంగ్ల సాహిత్య శిఖరం, నాటక చక్రవర్తి విలియం షేక్స్పియర్ పుట్టిన రోజుతోపాటు మరణించిన రోజు కూడా కావడంతో ఈ రోజును ఆంగ్ల భాషా దినోత్సవంగా జరుపుకోవడం విశేషం.
1564 ఏప్రిల్ 23న జన్మించిన ఆయన విధి విచిత్రంగా సరిగ్గా 52 ఏళ్ల తర్వాత 1616 ఏప్రిల్ 23న కన్నుమూశారు. ఆంగ్ల సాహిత్యంలో తిరుగులేని రచయితగా షేక్స్పియర్ ఆధునిక ఆంగ్లభాషపై చెరగని ముద్రవేశారు. భాషతో ఆయన చేసిన సృజనాత్మక ప్రయోగాలు అద్భుతం. వందలాది కొత్తపదాలు, పదబంధాలను ఆంగ్ల భాషకు అందించారు. నేడు మనం విరివిగావాడే ‘గాసిప్’, ‘ఫ్యాషన్’, ‘లోన్లీ’ వంటి పదాలు మొదట షేక్స్పియర్ కలం నుండి జాలువారినవే. అంతేకాదు, ‘బ్రేక్ ది ఐస్’, ‘ఫైంట్-హార్టెడ్’, ‘లవ్ ఈజ్ బ్లైండ్’ వంటి ఎన్నో అందమైన పదబంధాలను ఆయనే పరిచయం చేశారు. ఆయన రచించిన 39 నాటకాలు, 154 సొనెట్‌లు, మూడు సుదీర్ఘ కథన పద్యాలు ఆంగ్ల సాహిత్యానికి దివ్యమైన కానుకలు.
నిపుణులు భావించేదాని ప్రకారం ఆయన రచనల్లోని విషాదఛాయలు ఆయన వ్యక్తిగత జీవితంలోని దురదృష్టకర సంఘటనలకు అద్దంపడతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే షేక్స్పియర్ సుమారు 1700 కొత్త పదాలను ఆంగ్ల భాషకు బహూకరించారు. 2025 సంవత్సరానికి ప్రపంచ ఆంగ్ల భాషా దినోత్సవం ఇతివృత్తం ‘ఇంగ్లీష్: నిజంగా ప్రపంచ భాష’. ఈ అంశం ప్రపంచ భావ వ్యక్తీకరణ, సహకారంకోసం ఆంగ్లం పోషిస్తున్న కీలక పాత్రను నొక్కి చెబుతుంది. అంతేకాకుండా, ఆంగ్లం విభిన్న సంస్కృతులను ఎలా కలుపుతుంది ? భావ వ్యక్తీకరణ అడ్డంకులను ఎలా తగ్గిస్తుంది? అనే విషయాలపై చర్చలు జరుగుతాయి.అంతర్జాతీయ దౌత్యం, సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం, విద్య వంటి అనేక రంగాలలో ఆంగ్లం ప్రాముఖ్యతను ఈ రోజున గుర్తు చేసుకుంటారు. నేటి ప్రపంచంలో బహుభాషావాదం ప్రాధాన్యతను, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రత్యేక స్థానాన్ని చాటి చెప్పడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం.
యునెస్కో 2010లో మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహించింది. ప్రపంచంలోని 75 కంటే ఎక్కువ దేశాలు ఆంగ్లాన్ని తమ అధికారిక భాషగా గుర్తించాయి. భాషను అన్వేషించడం ద్వారా బహుభాషావాదం సాంస్కృతిక వైవిధ్యాన్ని ఎలా పరిరక్షిస్తుందో తెలియజేయడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ఆంగ్ల భాషా దినోత్సవం చరిత్ర, సంస్కృతి, భాషతో ముడిపడి ఉన్న విజయాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం దీని ముఖ్యోద్దేశం.
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే రెండవ భాషగా ఆంగ్లం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రపంచీకరణ యుగంలో ఆంగ్లం నేర్చుకోవడం ఒక అనివార్య అవసరంగా మారింది. వివిధ దేశాల ప్రజలు ఒకరితో ఒకరు సులభంగా సంభాషించడానికి ఇది ఒక విశ్వ వేదికగా ఉపయోగపడుతుంది.
బహుళజాతి కంపెనీలు ఆంగ్లంపై పట్టు ఉన్న ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రపంచంలోని అనేక ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన కొనసాగుతోంది. సైన్స్, ఏవియేషన్, కంప్యూటర్లు, దౌత్యం, పర్యాటకం వంటి అనేక కీలక రంగాలకు సంబంధించిన ప్రామాణిక గ్రంథాలు అధికంగా ఆంగ్లంలోనే అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలకు ఆంగ్లమే ప్రాథమిక ఆధారం. నేటి డిజిటల్ యుగంలో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లలో నిక్షిప్తం చేయబడిన సమాచారంలో 80 శాతానికి పైగా ఆంగ్లంలోనే ఉండటం విశేషం. దాదాపు అన్ని ముఖ్యమైన వెబ్‌సైట్‌లు ఆంగ్లంలోనే రూపొందించబడ్డాయి. అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలకు ఆంగ్లం ఒక కీలకమైన సాధనం. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సంబంధాలు విజయవంతంగా కొనసాగించడానికి ఆంగ్ల భాషా పరిజ్ఞానం అవసరం. ఆంగ్లం నేర్చుకోవడం కేవలం ఉద్యోగ అవకాశాలనే కాకుండా ఇతర సంస్కృతులను అర్థం చేసుకోవడానికి, విభిన్న ప్రాంతాల ప్రజలతో నిజమైన అనుబంధం ఏర్పరచుకోవడానికి, వారి జీవనశైలిని తెలుసుకోవడానికి కూడా సహాయపడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల మంది ప్రజలు ఈ భాషను మాట్లాడుతున్నారు. ఈ సంఖ్య 2050 నాటికి 200 కోట్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మన భారతదేశంలో దాదాపు 14 కోట్ల మంది అంటే జనాభాలో 10 శాతం మంది ఆంగ్లం మాట్లాడేవారు ఉన్నారు. ఆంగ్లం మాట్లాడే వారిని ‘ఆంగ్లోఫోన్స్’ అని పిలుస్తారు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో రెండవ స్థానంలో ఉన్న మాండరిన్ చైనీస్ కంటే ఆంగ్లం మాట్లాడే వారి సంఖ్య 28 శాతం అధికంగా ఉండటం గమనార్హం. సుమారు 1500 సంవత్సరాల క్రితం కేవలం మూడు తెగల ప్రజలు మాత్రమే ఈ భాషను మాట్లాడేవారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 95 కోట్ల మంది ఆంగ్లాన్ని వారి మొదటి భాషగా, మరో 60 కోట్ల మంది రెండవ భాషగా మాట్లాడుతున్నారు. ఆంగ్లం ప్రపంచంలో అత్యంత విస్తృతంగా మాట్లాడబడుతున్నందున దీనిని తరచుగా ‘ప్రపంచ భాష’ గా అభివర్ణిస్తారు.
ఇది ఆధునిక యుగం భాష. అనేక దేశాలలో అధికారిక భాష కానప్పటికీ ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా బోధించే ఒక విదేశీ భాషగా ప్రాచుర్యం పొందింది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో సహా అనేక ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థల అధికారిక భాషల్లో ఆంగ్లం ఒకటి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో పనిచేసే వ్యోమగాములకు రష్యన్‌తో పాటు ఇది ఒక సహ అధికారిక భాష కావడం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లం మాట్లాడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆంగ్లం ఇతర భాషల నుండి అనేక పదాలను స్వీకరించింది.
డి జనకమోహన రావు
82470 45230