గత లోక్‌సభ ఎన్నికలకు ముందు విడిపోయిన ఎఐఎడిఎంకె, బిజెపి పొత్తు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత, 2026 ప్రారంభంలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి ఏర్పర్చుకొనేందుకు రెండు పార్టీలు ముందడుగు వేస్తున్నాయి. 2021లో అధికారాన్ని కోల్పోయినప్పటి నుండి తన ప్రాబల్యాన్ని కోల్పోతూ వస్తున్న ఎఐఎడిఎంకె డిఎంకె నేతృత్వంలోని కూటమిని అధికారం నుండి తొలగించే ప్రయత్నాలలో బిజెపితో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నది. మరోవంక, దక్షిణాదిన వ్యాప్తి చెందేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించక పోవడంతో తమిళనాడులో బలం పెంచుకునేందుకు బిజెపి సైతం ఆత్రుతతో వ్యవహరిస్తున్నది.
అయితే ఆ రెండు పార్టీలు తప్పనిసరి పరిస్థితులలో చేతులు కలుపుతున్నా ఆచరణలో పరస్పరం అవిశ్వాసంతో వ్యవహరిస్తున్నాయి. ఆయా పార్టీలలో సైతం పొత్తుకు సానుకూలమైన సంకేతాలు కనిపించడం లేదు.
ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా విధానం వంటి అంశాలను దూకుడుగా లేవనెత్తడంతో పాటు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో సంఘర్షణకు దిగడం ద్వారా ‘తమిళ్ ప్రైడ్’ ఆయుధంగా ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు.
ఓ విధంగా రాష్ట్రరాజకీయాలపై ఆధిపత్యంతో వ్యవహరిస్తున్న డిఎంకెను ఎదుర్కొనేందుకు అవసరమైన సైద్ధాంతిక, రాజకీయ పటుత్వం ఎఐఎడిఎంకె- బిజెపి కూటమిలో కనిపించడం లేదు. బిజెపితో తిరిగి పొత్తు పెట్టుకోవడంపై ఎఐఎడిఎంకెలో అసంతృప్తి గుసగుసలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. చివరకు ఈ పొత్తులో కీలకంగా కనిపించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం ఒత్తిడులు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తున్నది. ఆయన మద్దతుతోనే బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఏకపక్షంగా వ్యవహరిస్తూ, అన్నాడిఎంకెను మాత్రమే కాకుండా పార్టీలో కీలక నేతలను సైతం దూరం చేసుకున్నారని తెలుస్తోంది. పొత్తు ప్రకటన కోసం చెన్నైకి రావడానికి రెండు రోజుల ముందు కొంతమంది బిజెపి కార్యకర్తలు ఢిల్లీ వెళ్లి ఆయనను కలిసి అన్నామలైను అధ్యక్ష పదవి నుండి తొలగించాలని కోరితే ఆయన తీవ్రమైన ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు.
నాయకత్వం విషయం తమకు వదిలివేసి బూత్ స్థాయిలో పార్టీ పని చూసుకోండి అంటూ మందలించి పంపించారు. నాయకులపై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి రావద్దని హెచ్చరించారు. అయితే, ఎఐఎడిఎంకెతో పొత్తు కోసం ఏప్రిల్ 10న అమిత్ షా చెన్నైకి వచ్చినప్పుడు, దాని నాయకుడు ఇ కె పళనిస్వామి విమానాశ్రయంలో తనకు స్వాగతం చెప్పేందుకు రాకపోవడంతో ఖంగుతిన్నారు. ఆ రోజు సాయంత్రం అనుకున్న ఎన్‌డిఎ మీడియా సమావేశం బిజెపి సమావేశంగా మారింది. దానితో వెంటనే ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త గురుమూర్తి వద్దకు వెళ్లి సమాలోచనలు జరిపారు. ఆ వెంటనే అన్నామలై సైతం వెళ్లి ఆయనను కలిశారు.
అన్నాడిఎంకె- బిజెపి పొత్తులో మొదటి నుండి గురుమూర్తి కీలక భూమిక నిర్వహిస్తున్నారు. ఆ తర్వాతనే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం, మరుసటి రోజు మాజీ అన్నాడిఎంకె నేత నైనార్ నాగేంద్రన్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాతనే పొత్తు ఖరారు చేస్తూ అమిత్ షా ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి పళనిస్వామి రావడం జరిగింది. అయితే ఆ తర్వాత తమ పొత్తు సీట్ల సర్దుబాటు వరకే అని, ఎన్నికల అనంతరం తాము ఏర్పాటు చేయబోయే మంత్రివర్గంలో బిజెపి ఉండబోదని పళనిస్వామి ప్రకటించడం గమనార్హం. అన్నాడిఎంకెతో పొత్తు ప్రకటించిన తర్వాత ఇటీవలి సంవత్సరాలలో బిజెపి వైపు ఉన్న మాజీ ఎఐఎడిఎంకె నాయకులు, మాజీ సిఎం ఓ పన్నీర్ సెల్వం, తన సొంత పార్టీ ఎఎంఎంకెకు నాయకత్వం వహిస్తున్న టిటివి దినకరన్ వంటి వారు ఈ కూటమికి దూరంగానే కనిపిస్తున్నారు. బిజెపి- ఎఐఎడిఎంకె కూటమి అటువంటి పార్టీలను ఎన్‌డిఎ కూటమిలో ఎలా తీసుకురాగలదో చూడాలి.
చెన్నైలో తమ కూటమిని ప్రకటిస్తూ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిజెపి ఎఐఎడిఎంకె అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోదు లేదా తొలగించిన నాయకులను తిరిగి చేర్చుకోవాలని వారిని అడగదు. ఎటువంటి జోక్యం ఉండదు అని స్పష్టమైన హామీ ఇవ్వాల్సి రావడం గమనార్హం. 2016 ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేసిన బిజెపి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దాని 188 మంది అభ్యర్థులలో ఎనిమిది మంది తప్ప మిగిలిన వారందరూ డిపాజిట్లు కోల్పోయారు. 2.8% వద్ద, బిజెపి ఓట్ల వాటా 2011 ఎన్నికలలో పొందిన 2.2% నుండి స్వల్పంగా మాత్రమే పెరిగింది. అంతకు ముందు లోక్ సభ ఎన్నికలకు మాత్రమే పరిమితమైన ఎఐఎడిఎంకె- బిజెపి పొత్తు మొదటిసారిగా 2021లో అసెంబ్లీ ఎన్నికలకు విస్తరించింది. దానితో మొదటిసారిగా బిజెపి నాలుగు సీట్లు గెల్చుకోగలిగింది. ఆ పార్టీ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను గెలుచుకోవడం ఇది మూడోసారి మాత్రమే. ఎఐఎడిఎంకె సీట్ల సంఖ్య 66కు పడిపోయింది. చాలా సీట్లలో పోటీ చేసిన ఎఐఎడిఎంకె తన ఓట్ల వాటాను 33.3%కి తగ్గించుకుంది. అయితే, కేవలం 20 సీట్లలో పోటీ చేసినప్పటికీ బిజెపి ఓట్ల వాటా స్వల్పంగా 2.6%కి పడిపోయింది. సెప్టెంబర్ 2023 లో, ఎఐఎడిఎంకె నాయకత్వంపై అన్నామలై చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య సంబంధాలను తెంచుకొనే వరకు వెళ్లడంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేశాయి. డిఎంకె నేతృత్వంలోని ఇండియా బ్లాక్ రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా తన ఆధిపత్యాన్ని కొనసాగించడంతో వారిద్దరూ ప్రభావం చూపలేకపోయారు.
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను అసెంబ్లీ స్థాయిలో పరిశీలిస్తే, ఒక్క సీటు కూడా గెలవలేకపోయినప్పటికీ, బిజెపి 59 సెగ్మెంట్లలో రెండవ స్థానంలో, 64 సెగ్మెంట్లలో మూడవ స్థానంలో నిలిచింది. వీటిలో, బిజెపి 56 అసెంబ్లీ సెగ్మెంట్లలో 20 శాతం కంటే ఎక్కువ ఓట్లను, 20 సెగ్మెంట్లలో 30 శాతం కంటే ఎక్కువ ఓట్లను సాధించింది. ఆ బలంతోనే వచ్చే ఎన్నికలలో తన ఉనికిని మరింతగా పెంచుకునేందుకు బిజెపి ఉత్సాహ పడుతున్నది. తమిళ పార్టీలు తమ సైద్ధాంతిక పటుత్వం కోల్పోయాయని, దానితో ఇప్పుడు జాతీయ రాజకీయ పార్టీలకు తమిళనాడులో అనువైన వాతావరణం ఏర్పడుతున్నదని తుగ్లక్ సంపాదకుడు ఎస్ గురుమూర్తి భావిస్తున్నారు. అందుకనే అన్నాడిఎంకె- బిజెపి కూటమిని తమిళ ప్రజలు ఆదరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే, జయలలిత మరణం తర్వాత అన్నాడిఎంకె శ్రేణులు అందరినీ ఉమ్మడిగా తీసుకెళ్లగల నాయకత్వం ఆ పార్టీలో కనిపించడం లేదు. మరోవంక బిజెపిని ‘తమిళ్ వ్యతిరేక’ పార్టీగా ప్రజలు చుస్తున్నారని, అందుకనే ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని దెబ్బ తిన్నామని గతంలో ఆ పార్టీ నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి వ్యవహారం సైతం బిజెపిని ‘తమిళ వ్యతిరేక’ పార్టీగా చూపే ప్రయత్నాలకు ఊతం కలిగిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులే ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ రెండు సార్లు ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా పక్కన పడవేయడం ద్వారా సుప్రీం కోర్టు ద్వారా చివాట్లు తిన్న తర్వాత కూడా ఆయన వైఖరిలో మార్పు కనిపించడం లేదు. ఆ బిల్లుల్లో ఒక బిల్లు విశ్వవిద్యాలయాల వ్యవహారాలలో గవర్నర్ పాత్ర నామమాత్రమే అని స్పష్టం చేస్తుంది.
ఏప్రిల్ 16న అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్‌లతో ముఖ్యమంత్రి స్టాలిన్ సమావేశం నిర్వహించారు. అయితే విశ్వవిద్యాలయాలపై ముఖ్యమంత్రి కన్నా తానే అధికుడని సంకేతం ఇచ్చేందుకు ఏప్రిల్ 25 నుండి మూడు రోజుల పాటు ఊటీలో అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల సమావేశం ఏర్పాటుచేసి, దానికి స్వయంగా ఉపరాష్ట్రపతి జగదేవ్ ధంకర్‌ను ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఈ విధంగా సమావేశం ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు తీర్పు ధిక్కారమే అంటూ కేవలం డిఎంకే కూటమిలోని పక్షాలే కాకుండా అన్నాడిఎంకె,- బిజెపి కూటమిలోని పక్షాలు సైతం ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నాయి. చివరకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు సైతం గవర్నర్ చర్యను సమర్థింపలేకపోతున్నారు. గవర్నర్ చర్యలు రాజకీయంగా డిఎంకె కూటమికి బలం చేకూరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకనే తక్షణమే గవర్నర్‌ను మార్చాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది. మరోవంక, అన్నామలైని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకురావడం ద్వారా తమిళ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా కొనసాగించాలంటూ అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలు సైతం ఈ కూటమి సయోధ్యకు ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పరస్పర వైరుధ్యాల మధ్య ఈ కూటమి వచ్చే ఏడాది ఎటువంటి ఫలితాలు సాధించగలదో చూడాల్సి ఉంది.
చలసాని నరేంద్ర
98495 69050