కోవిడ్… ఈ పేరు తలచుకుంటేనే వెన్నులోంచి వణుకు పుడుతుంది. ఐదేళ్ల క్రితం వెలుగుచూసిన ఈ ప్రాణాంతక వ్యాధి ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రాణాలను కబళించింది. కోవిడ్ మిగిల్చిన విషాదంనుంచి ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు కోలుకోలేదంటే అతిశయోక్తి కాదు. అకస్మాత్తుగా వెలుగుచూసిన కరోనా వైరస్ గురించి పదిమందికీ తెలిసేలోగానే కోరలు సాచి ప్రపంచమంతటా కమ్ముకుంది. వ్యాధేమిటో, దానికి మందేమిటో తెలిసేలోగానే ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. ప్రపంచ దేశాల మధ్య సయోధ్య, సహకారాలు లేకపోతే అది ఎంతటి వినాశనానికి దారితీస్తుందో కరోనా కళ్లకు కట్టింది.
ప్రజారోగ్యం సంక్షోభంలో పడినప్పుడు రాజకీయ విభేదాలను, తారతమ్యాలను పక్కనబెట్టి ప్రపంచ దేశాలన్నీ చేయి చేయి కలపకపోతే ఇలాంటి సంక్షోభాలనుంచి గట్టెక్కడం కష్టమని కరోనా నేర్పిన గుణపాఠంతో కళ్లు తెరిచిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ).. మానవాళి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సభ్యదేశాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు నడుం బిగించింది. మూడున్నరేళ్లుగా ఆయా దేశాలతో దఫదఫాలుగా జరిపిన చర్చలు ఇటీవలే ఒక కొలిక్కి వచ్చాయి. భవిష్యత్తులోనూ కోవిడ్ వంటి వ్యాధులు ముప్పేట దాడి చేస్తే వాటిని తుదముట్టించేందుకు ఏం చేయాలన్నదానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపకల్పన చేసిన ఒప్పందం ముసాయిదాపై తాజాగా 191 దేశాలు సంతకం చేశాయి. పాండమిక్ ట్రీటీగా వ్యవహరిస్తున్న ఈ ఒప్పందం ఒక చారిత్రక పరిణామం. రాజకీయ వైషమ్యాలతో, భిన్నాభిప్రాయాలతో ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్న వివిధ దేశాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు సదరు సంస్థ చేసిన కృషి అమోఘం, అభినందనీయం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ 75 ఏళ్ల చరిత్రలో ఇది రెండో కీలక ఒప్పందంగా భావించవచ్చు. ఈ సంస్థ నాయకత్వంలో 2003లో కుదిరిన పొగాకు నియంత్రణ ఒప్పందం మొదటిది. కరోనా సమయంలో వ్యాధికారకాన్ని గుర్తించడంలోనూ, నివారణకు చేపట్టవలసిన వైద్య ప్రక్రియల్లోనూ ప్రపంచ దేశాల మధ్య ఐక్యత కొరవడింది. చైనాలోని వూహాన్ ప్రయోగశాలనుంచి కరోనా వైరస్ బయటకొచ్చి విలయతాండవం చేసిందంటూ దేశాలన్నీ నెత్తీనోరూ మొత్తుకున్నా తప్పు ఒప్పుకునేందుకు చైనా ససేమిరా అన్నది. వ్యాక్సీన్ల రూపకల్పనలోనూ భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. కొన్ని దేశాలు తయారు చేసిన వ్యాక్సీన్లను మరికొన్ని దేశాలు తిరస్కరించాయి కూడా.
పేద దేశాలకు వ్యాక్సీన్ల సరఫరా అందలేదన్న విషయం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో తలెత్తకుండా ఉండే విధంగా రోగనిర్ధారణ పరీక్షలు మొదలుకుని వైద్యచికిత్సా పద్ధతులు, వ్యాక్సీన్ల వరకూ, వైరస్ సమాచారం మొదలుకుని నివారణ వరకూ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు అంగీకరిస్తూ సభ్యదేశాలన్నీ ఒప్పంద ప్రతిపై సంతకాలు చేశాయి. వ్యాధి నివారణలో వైద్య పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు సైతం ఆయా దేశాలు ఒక అంగీకారానికి రావడం శుభపరిణామం. మహమ్మారి వ్యాధుల నివారణకు, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థల రూపకల్పనలోనూ, ఆరోగ్య అత్యయిక పరిస్థితుల్లో దేశాల మధ్య సమాచార, వైద్యపరిజ్ఞాన మార్పిడితోపాటు ఔషధాల సరఫరాకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేస్తుంది. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలపట్ల వివక్ష చూపకూడదన్న విషయంలోనూ సభ్యదేశాలు సమ్మతి తెలిపాయి. వాస్తవానికి చైనాలో కళ్లు తెరిచిన కరోనా వైరస్‌ను సకాలంలో గుర్తించడంలోనూ, ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందనే చెప్పాలి.
సభ్యదేశాల రాజకీయ ప్రయోజనాలకు అడ్డుకట్టవేసి, స్వతంత్రంగా చర్యలు తీసుకోలేకపోయిందన్న ఆగ్రహంతో అగ్రరాజ్యం ప్రపంచ ఆరోగ్య సంస్థనుంచి గత జనవరిలో వైదొలగడం సదరు సంస్థకు పెను విఘాతం. ఇప్పటివరకూ ఆర్థికంగా డబ్ల్యుహెచ్‌ఒను ఆదుకుంటున్నది అమెరికాయే. 2023లో సంస్థ బడ్జెట్లో ఐదో వంతు నిధులను అగ్రరాజ్యమే సమకూర్చిందన్న వాస్తవం విస్మరించరాని విషయం. అమెరికా సహకారం లేకపోయినా పాండమిక్ ట్రీటీకి రూపకల్పన చేసే విషయంలో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం డబ్ల్యుహెచ్‌ఒ కార్యదక్షతకు నిదర్శనం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషిని అమెరికా గుర్తించి, వెన్నుదన్నుగా నిలవవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తన సహజ సిద్ధమైన తెంపరితనాన్ని వదిలి, విశాల దృక్పథంతో డబ్ల్యుహెచ్‌ఒ కృషికి మద్దతు పలకాలి. ఎవియన్ ఇన్ ఫ్లుయెంజా, ఎంపాక్స్, మార్బర్గ్ వైరస్ వంటి రకరకాల వ్యాధులు, వ్యాధికారక క్రిములు వెలుగుచూస్తున్న తరుణంలో ప్రపంచ దేశాల మధ్య కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందం అహ్వానించదగినది. ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచేందుకు రూపొందించిన అమూల్యమైన ఒప్పందంగా ప్రశంసలు అందుకుంటున్న ఈ పాండమిక్ ట్రీటీ ముసాయిదాకు వచ్చేనెలలో జరిగే ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ఆమోదముద్ర పడితే, అమలులోకి వచ్చినట్లే.