కశ్మీర్ ఫహల్గామ్‌లో ఇటీవల నరమేథం సాగించినట్లు అనుమానిస్తున్న ఉగ్రవాదులు ముగ్గురి ఊహాచిత్రాలను (స్కెచ్) జమ్మూ కశ్మీర్ పోలీసులు బుధవారం విడుదల చేశారు. వీరికి సంబంధించిన వివరాలు , ఆచూకి ఉంటే తమకు తెలియచేయాలని ప్రకటన వెలువరించారు. మంగళవారం ముష్కరులు జరిపిన అతి సమీపపు కాల్పుల్లో 26 మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువగా పర్యాటకులే ఉన్నారు. రెండు మూడు రకాల స్కెచ్‌లను , ఘటనాస్థలిలోని ప్రత్యక్ష సాక్షుల కథనాల మేరకు ఇప్పుడు విడుదల చేశారు. ఉగ్రవాదుల మూకను పట్టుకోవడానికి పోలీసు బలగాల దర్యాప్తు ముమ్మరం అయింది. ఉగ్రవాదులు ముగ్గురూ యువకులే. వీరిలో నూనుగు మీసాలు, చిన్నపాటి గడ్డంతో ఉన్నవాడు కూడా ఒక్కడున్నాడు. ఈ ఉగ్రవాద అనుమానితుల పేర్లు అసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హా అని , వీరికి మూసా, యూనస్, అసిఫ్ అనే మారు పేర్లు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.
కశ్మీర్‌లో ఇంతకు ముందు జరిగిన పలు ఉగ్రవాద దాడుల వెనుక వీరు ఉన్నట్లు, ఇప్పుడు జరిపింది వీరి చర్యలలో పరాకాష్ట వంటిదని వివరించారు. పాకిస్థాన్ కేంద్రీకృత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా కొత్తగా పుట్టుకొచ్చిన ది రెసిస్టెంట్స్ ఫోర్స్ ( ఆర్‌ఎఫ్)కు చెందిన వారుగా వీరిని అనుమానిస్తున్నారు. ఫహల్గామ్‌లోని బైసారన్ పర్యాటక పచ్చికమైదానాలలో వీరు రక్తపాతం సృష్టించి వెళ్లారు. నిషేధిత లష్కరే తోయిబా ఆగకుండా జరుపుతున్న ఉగ్రవాద దాడుల జాబితాలో ఇప్పుడు ఈ ఘటన కూడా చేరింది. ప్కెచ్‌లను కేంద్రీయ భద్రతా బలగాలు , నిఘా సంస్థలు కూడా ధృవీకరించాయి. ఈ ముగ్గురిలో ఒక్కడు హతుడైనట్లు ప్రకటించారు. మిగతా ఇద్దరిని పట్టుకుంటే దాడి వివరాలు, పాకిస్థాన్ లోగుట్టు తెలిసేందుకు వీలుంటుంది. ఫహల్గామ్ ఇతర ప్రాంతాలలో భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ ప్రాంతంలోనే మరి కొందరు ఉగ్రవాదులు పొంచి ఉన్నట్లు, మరిన్ని దాడులను చేసేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడైంది.
ఇప్పుడు లభ్యమైన స్కెచ్‌లు గత ఏడాది చివరిలో హతుడైన లష్కరే ఉగ్రవాది జునాయిడ్ అహ్మద్ భట్ సెల్‌ఫోన్‌లో కన్పించిన ఫోటో ఆధారంగా ఈ స్కెచ్ రూపొందించారు. డిసెంబర్ నుంచి కూడా ఉగ్రవాదులు జట్లు జట్లుగా ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ వచ్చినట్లు వెల్లడైంది. ఇప్పుడు వేసవిలో పర్యాటకులు ఎక్కువగా ఉన్న సమయం చూసుకుని , ఈ ప్రాంతంలో దాడికి దిగినట్లు వెల్లడవుతోంది. చుట్టుపక్కల ఉండే అత్యంత దుర్భేధ్యమైన ఫహల్గామ్ కొండలలోనే ఆరుగురు వరకూ ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించారు. వీరిని వెలుపలికి రప్పించేందుకు బలగాలు రంగంలోకి దిగాయి.