కశ్మీర్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రాంతం పహల్‌గామ్. పర్యాటకులే లక్షంగా ఉగ్రతోడేళ్లు వెంటాడి వేటాడి బలి తీసుకున్నాయి. ఇక్కడ జరిపిన దాడుల్లో దాదాపు 30 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తెలుగువారు ఉన్నారు. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడులు జరిగిన తీరును పరిశీలిస్తే పర్యాటకుల ఊరు, పేరు, కులం, మతం ఈ వివరాలన్నీ అడిగి వెంటాడి వేధించి అతి కిరాతకంగా చంపడం హృదయాన్ని కలచి వేస్తోంది. పర్యాటక సీజన్ ప్రారంభమైనందున విశేష సంఖ్యలో పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శిస్తుండటం ఏటా పరిపాటిగా వస్తున్నదే. అనేక వ్యాపారాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్విరామంగా సాగుతుంటాయి. కొన్ని కోట్ల రూపాయలు పర్యాటక రంగంనుంచి ప్రభుత్వానికి ఆదాయంగా వస్తోంది. ఇంత ప్రాముఖ్యం కలిగినప్పటికీ పర్యాటకులకు తగిన భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పక తప్పదు. ఉగ్రవాదులను జల్లెడపట్టడానికి భద్రతా దళాలు నిత్యం జమ్మూకశ్మీర్‌లో మోహరిస్తున్నప్పుడు ఈ దాడులను ఎందుకు అడ్డుకోలేకపోయారన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. నిఘా వ్యవస్థలు ఏమయ్యాయి? భద్రతా దళాలు ఏం చేస్తున్నాయి? పర్యాటకులకు భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ సందర్భంగా మూడు ముఖ్యమైన సంఘటనలపై ఆలోచించవలసిన అవసరం ఉంది. సౌదీ అరేబియా పర్యటనలో ప్రధాని మోడీ ఉండటం, అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భారత్‌లో అధికారిక పర్యటన జరుపుతుండటం, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కశ్మీర్‌ను వదులుకోలేమని గత వారం బహిరంగంగా వ్యాఖ్యానించడం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి భద్రత విషయంలో అత్యంత సవాళ్లను ఎదుర్కోవలసిన పరిస్థితిని కల్పించాయి. ఇప్పుడు ప్రభుత్వం తక్షణం చేపట్టాల్సిన చర్యలు చాలా ఉన్నాయి. మొదటిది పర్యాటక ప్రాంతాలకు భద్రత కల్పించడం, అక్కడ స్థానికులకు లేదా వ్యాపారులకు ఎలాంటి భయాందోళనలు కలగకుండా రక్షణ ఏర్పాటు చేయడం, ఉగ్రమూకల ఎత్తుగడలను పసిగట్టి వారిని కట్టడి చేయడం, మతం, భాష వేర్పాటువాదంతో దాడులకు పాల్పడిన వారిని వెంటనే వేటాడి అదుపులోకి తీసుకోవడం చేయాలి. ఈ దాడులకు పాల్పడింది ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్) అనే కొత్తగా ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ అని బయటపడింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తరువాతనే ఇది ఏర్పాటైంది. పాకిస్థాన్ నుంచి మారణకాండను నడిపిస్తున్న లష్కర్ ఏ తోయిబా సృష్టించిన చోటా ఉగ్రవాద సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్). 2019లో ఇది ఏర్పాటైన దగ్గర నుంచి కశ్మీర్ ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. అనేక దాడులకు దిగుతోంది. కశ్మీర్‌లోని సిక్కులను, పండిట్లను ఏరికోరి టార్గెట్ చేసుకుని హతమార్చే సంఘటనలు ఎన్నో జరిగాయి. వలస కార్మికులను, ముస్లిమేతరులను లక్షం చేసుకుని దాడులు సాగించడం ఈ ఉగ్రసంస్థ ప్రధాన లక్షం. 2021 లో 11 మందిని బలి తీసుకుంది. వీరిలో బీహార్‌కు చెందిన ముగ్గురు, యుపి, చత్తీస్‌గఢ్‌లకు చెందిన ఇద్దరు ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కశ్మీర్‌కు వచ్చి వ్యాపారాలు చేస్తున్నా, ఏవైనా పనులు చేస్తున్నా ఈ సంస్థ వారిపై దాడులు చేస్తోంది. భయం రేపుతోంది. 2021 లోనే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దీని ఉనికిని గుర్తించినా, ఆమేరకు నియంత్రించే చర్యలు తీసుకోలేదు. అయితే 2023లో టిఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థల జాబితాలో భారత్ చేర్చింది. భారతదేశం స్వాతంత్య్రం పొందినప్పటికీ జమ్మూకశ్మీర్ ప్రాంతం అత్యంత వివాదాస్పదంగానే కొనసాగుతోంది. ముఖ్యంగా పొరుగున ఉన్న పాకిస్థాన్ కళ్లన్నీ పచ్చని కశ్మీర్‌ను కొల్లగొట్టాలనే ఎత్తుగడలు సాగిస్తోంది. వేర్పాటువాదులను, ఉగ్రమూకలను పెంచి పోషిస్తోంది. వేర్పాటువాదుల తిరుగుబాటు ఈ పరిస్థితికి దారి తీస్తోంది. 1989 నుండి ఈ తిరుగుబాట్లు తప్పడం లేదు. కశ్మీర్‌లో ఉగ్రవాదులు, భారత భద్రతా దళాల మధ్య అనేక సార్లు సంఘర్షణలు సంభవించి వేలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 2014 లో యువకశ్మీరీలు తిరుగుబాటులో చేరారు. వీరిలో ఎక్కువ మంది 2008 ముంబై దాడులకు కారణమైన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో చేరారు. 2016 లో భద్రతా దళాలు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీని హతమార్చిన తరువాత హింస మరింత చెలరేగింది. అప్పటి నుంచి జైష్ ఏ మొహమ్మద్ గ్రూపుకు చెందిన ఉగ్రవాదులు 2016లో ఉరి దాడి, 2018లో సుంజువాన్ దాడికి పాల్పడ్డారు. 2019 ఫిబ్రవరిలో పుల్వామా దాడి జరిగింది. దీనిలో జైష్ ఏ మొహమ్మద్ ఆత్మాహుతి దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది మరణించారు. 2017 మార్చి నాటికి ప్రభుత్వ డేటా ప్రకారం 14,000 మంది పౌరులు, 5000 మంది భద్రతా సిబ్బంది, 22000 మంది ఉగ్రవాదులు, మొత్తం 41000 మంది తిరుగుబాటు ఘర్షణల్లో బలైపోయారు. 1990 2000 ప్రాంతం లోనే అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ తిరుగుబాటు ఘర్షణల కారణంగానే ముస్లింయేతర మైనారిటీ కశ్మీర్ హిందువులు కశ్మీర్ లోయ నుండి భారీ సంఖ్యలో వలసపోవాల్సి వచ్చింది. గత రెండు సంవత్సరాలుగా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అల్ మన్సురిన్, అల్ నాసిరిన్ అనే రెండు గ్రూపులుగా విడిపోయింది. ఇది కాక సేవ్ కశ్మీర్ ఉద్యమం, హర్కత్ ఉల్ ముజాహిదీన్ అనే సమూహాలు ఏర్పాటయ్యాయి. ఫ్రీడమ్ ఫోర్స్, ఫర్జాందన్ ఎ మిలాత్, అల్ బదర్ అనే చిన్న గ్రూపులు కూడా చురుకుగా పనిచేస్తున్నాయి.
ఉగ్రభూతానికి పాక్ ఊతం
- Advertisement -
- Advertisement -
- Advertisement -