Friday, April 25, 2025

అమరావతిలో మోదీ సభకు భారీ ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

మే 2వ తేదీన ఖరారైన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
శరవేగంగా సాగుతున్న పర్యటన ఏర్పాట్లు
ప్రధాని సభకు చేరుకునేందుకు 8 మార్గాలు
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి పర్యటనకు ప్రధాని మోడీకి స్వయంగా ఆహ్వానం
ప్రధాని మోదీ పర్యటన నిర్వహణకు మంత్రులతో కమిటీ
కమిటీలో లోకేశ్, పయ్యావుల, నారాయణ, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర
ఏర్పాట్లను వేదిక వద్ద పరిశీలించిన మంత్రి నారాయణ

మన తెలంగాణ / అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ మే 2వ తేదీన ఖరారైంది. ఈ క్రమంలో పర్యటన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. 15 నిమిషాల పటు రోడ్డుషో, గంట పాటు సాగే ఈ పర్యటనకు అమరావతి చరిత్ర తెలిపే పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ప్రధాని సభకు చేరుకునేందుకు దాదాపు 8 మార్గాలను గుర్తించారు. దాదాపు లక్ష కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టు పనులకు మోడీ శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా రాజధాని పనుల పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ క్రమంలో అమరావతి పర్యటనకు ప్రధానిని ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లి స్వయంగా ఆయనను అమరావతి పర్యటనకు ఆహ్వానించనున్నారు.

పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన : మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని చేరుకుని హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్‌కి వస్తారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కి.మీ. మేర 15 నిమిషాలపాటు రోడ్డు షోలో పాల్గొంటారు. 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుంది. అనంతరం అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సభ అనంతరం అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 5.20కి గన్నవరం నుంచి దిల్లీకి వెళతారు.

సభ కోసం 3 వేదికలు సిద్ధం : ప్రధాని సభ కోసం 3 వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదికపై మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మొత్తం 20 మంది ఆసీనులవుతారు. మిగతా వీవీఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు. దానిపై 100 మంది ఉంటారు. వీటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఒక వేదిక ఉంటుంది. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్ కార్యాచరణ, భూసమీకరణ విధానం వంటి అంశాల్ని ప్రధానికి వివరించేందుకు ప్రధాన వేదికకు వెనకవైపు అమరావతి పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు.

సభకు చేరుకునేందుకు 8 మార్గాలు : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటు విజయవాడ, అటు గుంటూరు, తెనాలి, నరసరావుపేట, సత్తెనపల్లి మీదుగా ప్రధాని సభకు చేరుకునేందుకు 8 మార్గాలను గుర్తించారు. మొత్తం 9 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ప్రముఖులు ప్రకాశం బ్యారేజీ, ఉండవల్లి, రాజధానిలోని సీడ్‌యాక్సెస్ రోడ్డు, ఎన్10 రహదారుల మీదుగా వేదిక వద్దకు చేరుకుంటారు. హైదరాబాద్, ఏలూరు, విజయవాడ నుంచి వచ్చేవారు జాతీయ రహదారి బైపాస్ బ్రిడ్జి మీదుగా రాజధానిలోకి ప్రవేశించి ఇ8, ఎన్8 రహదారుల ద్వారా వద్దకు చేరతారు.

విజయవాడ నుంచి కనకదుర్గ వారధి, తాడేపల్లి మీదుగా వచ్చేవారు భారతమాత విగ్రహం, ఉండవల్లి సెంటర్, కృష్ణాయపాలెం మీదుగా ఈ8, ఎన్9 రహదారుల్లోకి ప్రవేశించి వేదిక వద్దకు చేరతారు. గుంటూరు, తెనాలి, మంగళగిరి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం మీదుగా వచ్చేవారు ఇ8, ఎన్9 రహదారుల్లోకి ప్రవేశించి వేదిక వద్దకు చేరతారు. కాజా టోల్‌ప్లాజా సమీపంలోని మురుగన్ హోటల్ వద్ద ఎన్‌హెచ్-16 సర్వీసు రోడ్డులోంచి, ఎన్‌హెచ్ బైపాస్ జంక్షన్, నిడమర్రు, కురగల్లు మీదుగా ఎన్9 రహదారిలోకి ప్రవేశిస్తారు. గుంటూరు అమరావతి రోడ్డు, ఐఆర్‌ఆర్ జంక్షన్, గోరంట్ల, లామ్-తాడికొండ క్రాస్‌రోడ్లు, పెదపరిమి మీదుగా వచ్చేవారు ఇ6, ఎన్11, ఇ8, ఎన్10 రహదారుల ద్వారా వేదిక వద్దకు చేరతారు. నరసరావుపేట, సత్తెనపల్లి, అమరావతి, గుంటూరు, పెదమద్దూరు, వైకుంఠపురం, హరిశ్చంద్రపురం, దొండపాడు మీదుగా వచ్చేవారు ఇ3, ఎన్11, ఇ8 రహదారుల ద్వారా వేదిక వద్దకు చేరతారు.

నాలుగు హెలీప్యాడ్లు ఏర్పాటు : పీఎం మోదీతో పాటు ప్రముఖుల కోసం 4 హెలీప్యాడ్లు అవసరం కాగా సచివాలయం ఎదుట ఇప్పటికే మూడు హెలీప్యాడ్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరొకటి రెడీ చేస్తున్నారు. హెలీప్యాడ్ నుంచి వేదిక వరకు ఇరు వైపులా రైతులు, మహిళలు నిలబడి పీఎం మోదీకి పూలు చల్లుతూ స్వాగతం పలకనున్నారు.

ఆరుగురు మంత్రులతో నిర్వహణ కమిటీ : రాజధాని పనుల శంకుస్థాపన కోసం మే 2వ తేదీన ప్రధాని పర్యటన కోసం మంత్రులతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కొల్లు రవీంద్రలతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటైంది. ప్రధాని పర్యటన కోసం నోడల్ అధికారిగా జి.వీరపాండియన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రధాని పర్యటన ఏర్పాట్లతో పాటు నిర్మాణ పనుల శంకుస్థాపన, పెట్టుబడుల ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షించనుంది.

ఏర్పాట్లను వేదిక వద్ద పరిశీలించిన మంత్రి నారాయణ : ప్రధాని పర్యటన ఏర్పాట్లను వేదిక వద్ద ఎపి పురపాలక శాఖ మంత్రి నారాయణ గురువారం పరిశీలించారు. ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లు 90 శాతం పూర్తయ్యాయని, వచ్చే నెల 2 న మోడీ చేతుల మీదుగా అమరావతి పనుల పునః ప్రారంభం అవుతాయని వెల్లడించారు. సభా వేదిక వద్దకు వచ్చేందుకు అవసరమైన రోడ్లను గుర్తించామని, 11 పార్కింగ్ ప్రాంతాలు,8 రోడ్లను గుర్తించినట్లు చెప్పారు. కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాలు భూమిని రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని, ప్రధాని సభ వద్ద రైతులను గౌరవించాలని సీఎం చెప్పారన్నారు.

మొత్తం మూడు స్టేజ్ లు ఏర్పాటు చేస్తున్నామని, అదనపు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నామని తెలిపారు. ప్రజలు ల్యాండ్ పూలింగ్ కు అంగీకరిస్తే చేస్తాం లేని పక్షం లో భూసేకరణ ఆప్షన్ ఆలోచిస్తామని, హైదరాబాద్ లో ఒక ఎయిరోపోర్టు ఉన్నా శంషాబాద్‌లో మరొకటి నిర్మించామని, ఇప్పుడు రెండవ ఎయిర్‌పోర్టు లేకుండా ఉంటే హైదరాబాద్ లో ఇప్పుడు 10శాతం విమానాలు కూడా దిగేవి కావన్నారు. రానున్న 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని సిఎం అమరావతి నిర్మాణం చేస్తున్నారని చెప్పారు. పెరిగిన భూముల విలువ నిలవాలన్నా, పెరగాలన్నా ప్రజలు ఉండాలని, ప్రజలు లేకపోతే భూముల విలువ పడిపోతుందన్నారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉంటేనే స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News