జుక్కల్ ఎంఎల్‌ఎను రూ.5కోట్లు
డిమాండ్ చేసినట్లు శ్యామ్‌పై
ఫిర్యాదు అరెస్టు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు
మన తెలంగాణ/రాజేంద్రనగర్:కుట్రపూరితం గా ఓ శాసనసభ్యుడి ప్రతిష్ఠకు భంగం కలిగిం చే విధంగా యత్నించడంతో పాటు రూ. 5 కో ట్లను డిమాండ్ చేసిన ఓ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ శాసన సభ్యుడి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజడానికి ఓ మహిళ ఇంటర్వూను బూ చిగా పెట్టినట్లు పోలీసులు ఒక ప్రకటనలో వె ల్లడించారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం… ఈ నెల 22వ తేదీన బండ్లగూడ సన్ సిటీ మప్లెటౌన్‌లోని విల్లా నంబర్ ఎంపి-4లో నివాసం ఉంటున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పోలీసులను ఆశ్రయించాడు. తనకు ప్రజా వాయిస్ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ ఎం. శ్యామ్ సుందర్‌తో ప్రమాదం పొంచి ఉందని, తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడంతో పాటు తన పరువు తీయడానికి ఓ మహిళను ఇంటర్వూ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలో రెండు వారాల క్రితం శ్యామ్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకు ఫోన్ చేసి తనను వ్యక్తిగతంగా కలవాలని కోరాడు. ఈనేపథ్యంలో ఈనెల 15వ తేదీన శ్యామ్ కొంత మంది సహచరులతో కలసి హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని నం.202కు వచ్చాడు. అనంతరం తన వద్ద నిరూప అనిల్ కుమార్ దదాయని ఇచ్చిన సమాచారం ఉందని చెప్పాడు. ఆ సమాచారాన్ని సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తానని, దాంతో లక్ష్మీకాంతరావు వ్యక్తిత ప్రతిష్టతోపాటు రాజకీయ కెరీర్ నష్టం తప్పదన్నాడు. సున్నితమై వీడియోలు బహిర్గతం చేయవద్దంటే రూ. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అతని బ్లాక్ మెయిలింగ్‌కు లొంగని లక్షీకాంతారావు తాను పారదర్శకమైన జీవితాన్ని గడిపానని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను బెదిరించడం మానుకోవాలని కోరాడు. ఇదిలా ఉండగా, ఈనెల 21వ తేదీన యూట్యూబర్ శ్యామ్ తన సన్నిహుతుడైన నరేష్ నాయుడు ఫోన్‌కు ఫేక్ స్క్రీన్ షాట్ చిత్రాలు పంపాడు.
ఈ స్క్రీన్ షాట్‌లు లక్ష్మీకాంతరావుకు చూపించాలని సూచించాడు. తాను కోరిన మొత్తం ఏర్పాటు చేయకపోతే నిరూప అనిల్ కుమార్ ఇంటర్వూను సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దాంతో శ్యామ్ సుందర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. నేరం ఒప్పుకుని లొంగిపోయినట్లు రాజేంద్రనగర్ డిసిపి చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. లక్ష్మీకాంతారావును బ్లాక్ మెయిల్ చేయడానికి ఆయన ఉపయోగించినట్లుగా భావిస్తున్న లాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌తో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శ్యామ్ సుందర్ పై బిఎన్‌ఎస్ 308(3), 351(3), 352,61(2) ఆర్/డబ్లూ 3(5) తో పాటు 3(2) ఎస్సీ, ఎస్టీ(పిఒఎ) యాక్ట్ 1989 ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుచగా న్యామూర్తి రిమాండ్ రిటర్న్ చేస్తూ 41 సిఆర్‌పి నోటీసు ఇవ్వాలని సూచించినట్లు సమాచారం.
ఎమ్మెల్యే నా వద్ద కోటి రూపాయలు తీసుకున్నాడు : నిరూప
లక్ష్మీకాంతారావు 2012లో ఓ స్థలం చూపించి తన వద్ద కోటి రూపాలయలు తీసుకున్నాడని నిరూప అనిల్‌కుమార్ తెలిపింది. తన సోదరుడైన బాలయ్యదిగా సదరు స్థలానికి సంబంధించి ఫేక్ డాక్యుమెట్లు సృష్టించి ఇవ్వడంతోపాటు అందుకు సంబంధించిన నకిలీ రశీదులు సైతం తనకు ఇచ్చాడని వెల్లడించింది. 2022లో రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో నిరూప ఫిర్యాదు చేసిట్లు తెలుస్తోంది. లక్ష్మీకాంతారావు పదవిని అడ్డు పెట్టుకుని తనపై పెట్టిన కేసులపై చర్యలు తీసుకోకుండా మేనేజ్ చేస్తాడని ఆరోపించింది.
ఈనేపథ్యంలో శ్యామ్ సుందర్‌ను ఆశ్రయించిన తనకు జరిగిన అన్యాయాని వివరిస్తూ ఇంటర్వూ ఇచ్చానని, ఆ ఇంటర్వూ బయటికి రాకుండా శ్యామ్‌పై తప్పుడు కేసులు పెట్టారని ఆమె ధ్వజమెత్తింది. నకిలీ డాక్యుమెంట్లతో తనను మోసం చేసిన లక్ష్మీకాంతారావు పై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. ఒక మహిళతో లక్ష్మీకాంతారావు అక్రమ సంబంధం పెట్టుకుని, ఆమెను లొంగదీసుకున్నాడని శ్యామ్ సుందర్ ఆరోపించాడు. సదరు మహిళకు ఒక కుమారుడు సంతానం కాగా, లక్ష్మీకాంతారావు పట్టించుకోవడంలేదని తన వద్దకు వచ్చిందన్నారు. దాంతో ఆమె నుంచి వివరాలు తీసుకుని, ఎమ్మెల్యేని ఆమెకు న్యాయం చేయాలని సూచించినట్లు పేర్కొన్నాడు.