Saturday, April 26, 2025

గడువు తరువాత ఏ పాకిస్తానీని దేశంలో ఉండనివ్వకండి

- Advertisement -
- Advertisement -
  • సిఎంలు అందరికీ ఫోన్‌లో అమిత్ షా పిలుపు

న్యూఢిల్లీ : కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి, దేశం వీడేందుకు నిర్దేశించిన గడువు తరువాత ఏ పాకిస్తానీనీ భారత్‌లో ఉండనివ్వరాదని ఆదేశించినట్లు అభిజ్ఞ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తానీలకు జారీ చేసిన అన్ని వీసాలను ఈ నెల 27 నుంచి రద్దు చేస్తున్నట్లు భారత్ గురువారం ప్రకటించింది. మంగళవారం పహల్‌గామ్‌లో పర్యాటకులతో సహా 26 మంది వ్యక్తులను బలిగొన్న ఉగ్ర దాడిపై రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తిరిగి రావలసిందిగా పాకిస్తాన్‌లో నివసిస్తున్న భారత జాతీయులకు కేంద్రం సలహా ఇచ్చింది. హోమ్ శాఖ మంత్రి స్వయంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి గడువు తరువాత భారత్‌లో ఏ పాకిస్తానీ బస చేయకుండా చూడాలని వారిని కోరినట్లు ఆ వర్గాలు తెలియజేశాయి. తమ తమ ప్రాంతాల్లో ఉంటున్న పాకిస్తానీ జాతీయులను గుర్తించి, వారిని తిప్పిపంపేలా చూడాలని కూడ ముఖ్యమంత్రులను కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. వీసాల రద్దు ఆదేశం హిందు పాకిస్తానీ జాతీయులకు ఇదివరకే జారీ చేసిన దీర్ఘ కాలిక వీసాలకు వర్తించదు. అవి ‘చెల్లుబాటులో ఉంటాయి.’ పహల్‌గామ్ దాడికి సీమాంతర సంబంధాలు ఉండడంపై పాకిస్తానీ జాతీయులకు వీసా సర్వీసులను వెంటనే నిలుపుదల చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. 26/11 ముంబయి ఉగ్ర దాడి దరిమిలా దేశంలో పౌరులను లక్షంగా చేసుకున్న హీనమైన ఉగ్ర దాడి అది. అదనంగా సార్క్ వీసా పొడిగింపు పథకం (ఎస్‌విఇఎస్) కింద భారత్‌కు ప్రయాణించేందుకు పాకిస్తానీ జాతీయులను అనుమతించబోమని, ఎస్‌విఇఎస్ వీసా కింద ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాకిస్తానీ జాతీయుడు ఎవరైనా 48 గంటల్లోగా దేశం వదలి వెళ్లాలని కూడా ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఆ గడువు శుక్రవారంతో ముగిసింది. పహల్‌గామ్ మారణకాండలో పాత్ర ఉన్న ప్రతి ఉగ్రవాదిని, వారి ‘మద్దతుదారులను’ భారత్ ‘గుర్తించి, ఆచూకీ తీసి, శిక్షిస్తుంది’ అని, హంతకులను ‘భూమి చివరి వరకు ’ వెంటాడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం విస్పష్టంగా ప్రకటించారు. మరొక వైపు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా దౌత్యపరంగా దాడిని భారత్ ముమ్మరం చేసింది. గురువారం ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు అందరూ ఉగ్రవాదంపైన, ఉగ్ర శిబిరాలపైన కఠిన చర్య తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు హామీ ఇచ్చారు. భారత్ అదే సమయంలో 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని వెంటనే నిలిపివేస్తున్నట్లు కూడా పాకిస్తాన్‌కు తెలియజేసింది. ఒప్పందం షరతులను పాక్ ఉల్లంఘించిందని భారత్ ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News