మోడీజీ..140కోట్ల మంది ప్రజలు మీ వెంట ఉన్నారు 1971లో
ఇందిరాగాంధీ ఒక్క దెబ్బకు పాక్‌ను రెండు ముక్కలు చేశారు
ఇప్పుడు మీరూ వేటు వెయ్యండి.. పిఒకెను భారత్‌లో కలపండి
పహల్‌గామ్ దాడిని నిరసిస్తూ జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్:జమ్మూకశ్మీర్‌లో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవి క దాడులను ఖండిస్తున్నామని, ఇలాంటి దా డులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహారించాలని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల కు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పో రాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నా రు. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్‌లోని పీపుల్ ప్లాజా వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సిఎం రేవంత్‌రెడ్డి, మం త్రులు, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపిలు, భారత్ సమ్మిట్-2025 హాజరైన విదేశీ ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్డు, ఇందిరా గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీని చేపట్టారు. ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి.
అందరం ఒక్కటై తీవ్రవాదంపై పోరాడాలి
ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్‌లో పర్యాటకులపై దాడి చేసి చంపడం తీవ్రమైన ఘటన అని, అందరం ఒక్కటై తీవ్రవాదంపై పోరాడాలని సిఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మద్దతు ఇవ్వాలని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. దాడులకు పాల్పడిన వారికి తగిన బుద్ధి చెప్పాలని, పార్టీలకు అతీతంగా దీనికి అందరూ సహకరించాలని, తీవ్రవాదాన్ని అంతం చేయాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు.
కోట్లాది భారతీయులంతా మోడీకి మద్దతుగా
ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకు మద్దతు పలికేందుకు అందరం సిద్ధంగా ఉన్నామన్నారు. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రవాద దాడుల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సానుభూతి తెలుపుతోందన్నారు. ఆ కుటుంబాలకు అందరం అండగా నిలబడి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. 1967, 1971 లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారని, ఒక్క దెబ్బతో పాకిస్తాన్ ను బంగ్లాదేశ్‌గా వేరు చేసి రెండు ముక్కలు చేశారని ఆయన తెలిపారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని వాజ్ పేయ్ దుర్గామాతతో పోల్చారని, ప్రధాని మోడీ కూడా దుర్గామాత భక్తుడిగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలని సిఎం రేవంత్ సూచించారు. ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలని ఆయన కోరారు. కోట్లాది భారతీయులంతా మోడీకి మద్దతుగా ఉంటారని, ఒక్క దెబ్బతో పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్ లో కలపాలని ఆయ న డిమాండ్ చేశారు.
ఏఐసిసి పిలుపుమేరకు
ఉగ్రదాడి నేపథ్యంలో గురువారం ఢిల్లీలో ఏఐసిసి నాయకులు సమావేశం అయ్యారు. బాధితులకు అండగా నిలబడాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ జరపాలని నిర్ణయించారు. అన్ని రాష్ట్రాల్లో, డివిజన్లలో శాంతి ర్యాలీ చేపట్టాలని ఇందులో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా పాల్గొనాలని ఏఐసిసి పిలుపునిచ్చింది. అందులో భాగంగా సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ శాంతి ర్యాలీ నిర్వహించారు. మరోవైపు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనలో మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా కీలక నేతలు పాల్గొన్నారు.
ఉగ్ర ఘాతుకంపై భారత్ సమ్మిట్ తీవ్ర దిగ్భ్రాంతి
ఐక్యత, సామరస్యం, రాజ్యాంగ విలువలపై దాడిగా ప్రకటన
పహల్గామ్‌లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడిపై భారత్ సమ్మిట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హైదరాబాద్ లో శుక్రవారం ప్రారంభమైన సదస్సులో పాల్గొన్న వంద దేశాలకు చెందిన ప్రగతిశీల పార్టీలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖులు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పహల్గామ్‌లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడి పట్ల మేం తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నాం. ఉగ్ర దాడిలో 26 మంది అమాయక పౌరులు మృత్యువాత పడ్డారు. అనేక మంది గాయపడ్డారు. భారత ప్రజలకు మేం సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతియుత పౌరులపై ఇటువంటి క్రూరమైన చర్యలకు సమాజంలో స్థానం లేదని ప్రతినిధులు తెలిపారు.