Saturday, April 26, 2025

ఎన్నో ఎదురుదెబ్బలు.. అయినా ప్రజల పక్షమే

- Advertisement -
- Advertisement -

గత 17 నెలల్లో పార్టీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంది
అయినా సమర్థవంతమైన ప్రతిపక్షంగా నిలబడ్డాం పాలకుల
తప్పిదాలను ఎండగట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాం
రేవంత్‌రెడ్డి ఇప్పటికీ ప్రతిపక్షంలోనే ఉన్నట్లు భావిస్తున్నారు
ఆయనను సొంత పార్టీ వారే సిఎంగా గుర్తించడంలేదు మోడీకి
క్రమంగా తగ్గుతున్న ఆదరణ రాష్ట్రంలో బిజెపి మాకు పోటీయే
కాదు డిసెంబర్‌లోనే ఎన్‌డిఎస్‌ఎ తుది నివేదిక బిఆర్‌ఎస్ సభ
ఉందని హడావుడిగా విడుదల అసెంబ్లీలో మమ్మల్నే
తట్టుకోలేకపోతున్నారు కెసిఆర్ వస్తే పారిపోతారు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నామని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా సొంత పార్టీ నాయకులు, ఎంఎల్‌ఎలే గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తాము అధికారంలో లేము అని, ప్రతిపక్ష పార్టీగా గత 17 నెలల్లో ప్రజలకు ఆత్మవిశ్వాసం కల్పించామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా బిఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు అండగా నిలిచిందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భవన్ జనతా గ్యారేజీలా మారిందని, ఏ సమస్య వచ్చినా ప్రజలు తెలంగాణ భవన్‌కు వచ్చి చెబుకుంటున్నారని వ్యాఖ్యానించారు. లగచర్ల ఘటనను ఢిల్లీ వరకు తీసుకెళ్లామని, బాధితుల పక్షాన తమ పార్టీ చేసిన కృషి వల్లనే లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. అలాగే హెచ్‌సియు విషయంలో దేశం దృష్టిని ఆకర్షించామని అన్నారు. గడిచిన 17 నెలల్లో తమకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా ప్రజల పక్షాన నిలబడ్డామని ఉద్ఘాటించారు. 17 నెలల్లో అనుకోకుండా కెసిఆర్ కాలు జారిపడి అనారోగ్యానికి గురికావడం, కవిత అరెస్ట్, 10 మంది ఎంఎల్‌ఎలు పార్టీ మారడం వంటి ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా తాము మాత్రం ప్రజల పక్షాన నిలబడి వారిలో విశ్వాసం కల్పించామని చెప్పారు. బిఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా కెటిఆర్ శుక్రవారం ‘మన తెలంగాణ’ ఇంటర్వూలో పలు అంశాలపై మాట్లాడారు.

మా ప్రత్యర్థి ముమ్మాటికీ కాంగ్రెస్సే
రాష్ట్రంలో తమ ప్రత్యర్థి ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీనే అని కెటిఆర్ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఉన్నాయని, వీటిలో మెరుగైన పాలన ఎవరు అందిస్తారో ప్రజలు ఆలోచిస్తారని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో తమ పార్టీ అధికారంలో కోల్పోయిందని తెలిపారు. రాష్ట్రంలో బిజెపి పార్టీకి తాము పోటీగా భావించడం లేదని, అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవలసిన ఖర్మ తమకు లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిది మంది బిజెపి ఎంపిలను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించింది తామేనని అన్నారు. ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని తమ పార్టీ ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్‌రావు అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు ఓడించారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రభావం వల్ల రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలిచారని చెప్పారు. 2014 తర్వాత తెలంగాణలో జరిగిన మూడు ఎన్నికల్లో బిజెపి సింగిల్ డిజిట్ దాటలేదని అన్నారు. 2014లో తాము రాష్ట్రంలో, బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ఇతర పార్టీల మద్దతుతో కేంద్రంలో బిజెపి అధికారంలో ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి క్రమంగా ఆదరణ తగ్గుతోందని, ఈ సమయంలో బిజెపి పార్టీని పోటీగా భావించడం లేదని చెప్పారు. 2014 నుంచి 2024 వరకు దేశంలో కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ కాకుండా మంచి పరిపాలన డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైనా ఉందా..? అని అడిగారు. కెసిఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అమలయ్యే పథకాలు పలు రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసిందని అన్నారు. అందుకే టిఆర్‌ఎస్ పార్టీని బిఆర్‌ఎస్‌గా పేరు మార్చుకుని దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని భావించామని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు కూడా తమ పార్టీ పేర్లను మార్చుకున్నాయని గుర్తు చేశారు.

ఎంఎల్‌ఎలు మళ్లీ పార్టీలోకి తిరిగి
వస్తామన్నా రానివ్వం
బిఆర్‌ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన ఎంఎల్‌ఎలు మళ్లీ పార్టీలోకి వస్తే రానివ్వకూడదనేది తన అభిప్రాయమని కెటిఆర్ పేర్కొన్నారు. ఎంఎల్‌ఎలు పార్టీ మారడం వల్ల ఆయా నియోజకవర్గాలలో తమకు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకునే అవకాశం లభించిందని తెలిపారు. తిరిగి పార్టీలోకి చేర్చుకోవాల్సి వస్తే చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిచినా ఓడినా రాష్ట్రంలో అధికారం మారదు అనే ఉద్దేశంతోనే తాము పోటీ చేయలేదని చెప్పారు.
అది ఎన్‌డిఎస్‌ఎ రిపోర్ట్ కాదు..
ఎన్‌డిఎ రిపోర్ట్
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ ఇచ్చింది ఎన్‌డిఎస్‌ఎ రిపోర్టు కాదు అని, అది ఎన్‌డిఎ రిపోర్టు అని కెటిఆర్ విమర్శించారు. అది బిజెపి, కాంగ్రెస్ పార్టీ నేతలు కలిపి రాసిన నివేదిక అని పేర్కొన్నారు. మేడిగడ్డను చూడకుండానే, అక్కడ ఎలాంటి పరీక్షలు నిర్వహిచకుండానే ఎన్‌డిఎస్‌ఎ వచ్చిందని, గుజరాత్, బీహాల్‌లో జరిగిన ఘటనలపై ఎన్‌డిఎస్‌ఎ ఎందుకు అక్కడికి వెళ్లలేదని ప్రశ్నించారు. ఆ రాష్ట్రాలలో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకున్నారా..? అని అడిగారు. సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిపోయింది. ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ కూలిపోయి 60 రోజులు అయినా ఇప్పటి వరకు వీటి వద్దకు రాని ఎన్‌డిఎస్‌ఎ ఒక రాజకీయ ఎజెండాతో కాళేశ్వరంలో విషయంలో ఆగమేఘాల మీద నివేదిక ఇచ్చిందని అన్నారు. 2024 డిసెంబర్‌లో ఎన్‌డిఎస్‌ఎ తుది నివేదిక ఇస్తే, ఇప్పుడు ఎందుకు బయటపెడుతున్నారని నిలదీశారు. కేవలం బిఆర్‌ఎస్ రజతోత్స సభ నేపథ్యంలోనే ఎన్‌డిఎస్‌ఎ రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టిందని ఆరోపించారు.

కెసిఆర్ అసెంబ్లీకి రాకూడదనే కోరుకుంటా
రాష్ట్రంలో తాము కెసిఆర్ మార్గదర్శనంలోనే సమర్థవంతం గా తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని కెటిఆర్ తెలిపా రు. కెసిఆర్ స్థాయిని కూడా చూడకుండా దుర్భాషలాడే సిఎం ఉన్నప్పుడు ఆ దూషణలను వినడానికి ఆయన అ సెంబ్లీకి రావాలా..? అని అడిగారు. కెసిఆర్ అభిమానిగా ఆయన అసెంబ్లీకి రాకూడదనే కోరుకుంటానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తమనే తట్టుకోలేకపోతుందన్నారు. ఇక కెసిఆర్ వస్తే సిఎం సహా అధికార పార్టీ స భ్యులు అసెంబ్లీ నుంచి పారిపోయే పరిస్థితి వస్తుందని వి మర్శించారు. ఎన్‌టిఆర్, జయలలిత, కరుణానిధి వంటి నే తలు కూడా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అసెంబ్లీకి వెళ్లలేదని తెలిపారు. కెసిఆర్ ప్రతిపక్ష నేతగా కాకుండా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటానని అన్నారు.
మేము చేసింది చెప్పుకోలేకపోయాం
బిఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తాము చేసింది చెప్పుకోవడం విఫలమయ్యామని కెటిఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్లు చెయ్యనిది కూడా చేసినట్లుగా చెప్పుకున్నారని విమర్శించారు. బిఆర్‌ఎస్ హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా చెప్పుకోలేకపోయామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ లో అత్యధిక వేతనాలు చెల్లించామని, 6.5 లక్షల రేషన్‌కార్డులు, రూ.73 వేల కోట్ల రైతుబంధు ఇచ్చినా పూర్తి స్థా యిలో ప్రచారం చేసుకోలేకపోయామని అన్నారు. అప్పుల విషయంలో 28 రాష్ట్రాలలో తెలంగాణ కింది నుంచి 5వ స్థానంలో ఉందని కేంద్రమే చెప్పిందని పేర్కొన్నారు.

అక్టోబర్‌లో పార్టీ అధ్యక్ష ఎన్నిక
మే నెలలో డిజిటల్ విధానంలో బిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేపడతామని కెటిఆర్ వెల్లడించారు. అక్టోబర్‌లో పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, జిహెచ్‌ఎంసి ఎన్నికలు వచ్చినా తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డి, బిజెపి మధ్య రహస్య బంధం ఉందని ఆరోపించారు. సిఎం రేవంత్‌రెడ్డిని కాపాడుతుందే బిజెపి నాయకత్వం అని పేర్కొన్నారు.
బిఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తి
బిఆర్‌ఎస్ పార్టీ విజయవంతంగా 24 ఏళ్లు పూర్తి చేసుకుందని, రెండున్నద దశాబ్దాలు పూర్తి చేసుకున్న ప్రాంతీయ పార్టీలు చాలా తక్కువగా ఉన్నాయని కెటిఆర్ చెప్పారు. జెఎంఎం కూడా ఉద్యమ పార్టీ ప్రస్తానం ప్రారంభించిందని, అదే తరహాలోనే తమ పార్టీ కూడా మనుగడ సాగిస్తుందని అన్నారు. హన్మకొండలోని ఎల్కతుర్తిలో 1300 ఎకరాల్లో జరుగనున్న బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. బహిరంగ సభ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై, 6.30కు ముగిసేలా ఏర్పాట్లు చేశామన్నారు. సభకు వచ్చే తమ పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News