Sunday, April 27, 2025

కమ్ముకొస్తున్న యుద్ధమేఘాలు

- Advertisement -
- Advertisement -

పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. తమకు జీవనాడి వంటి సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం, తమపై ప్రత్యక్షంగా యుద్ధానికి కాలుదువ్వడమేనని పాకిస్థాన్ భగ్గుమంటోంది. దీనికి ప్రతీకారంగా 1972 నాటి సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన భేటీలో వాఘా బోర్డర్ మూసివేత, వాణిజ్య సంబంధాలు బంద్, వీసాల రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్‌కు తన గగనతలాన్ని మూసివేసింది. దీనివల్ల మన విమానాలు చుట్టూ తిరిగి రావాల్సిందే. విమానాల దారిమళ్లింపు ప్రయాణికులపై మరింత భారం పడుతుంది. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధమేనని ప్రకటించింది. సరిహద్దుల వెంబడి సైనిక దళాల మోహరింపు ఎక్కువ చేసింది. మరోవైపు పాకిస్థాన్ ఎప్పటికీ తేరుకోలేని విధంగా భారత్ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. గురువారం ఆక్రమణ్ పేరిట భారత్ సైన్యం భారీ వైమానిక విన్యాసాలు నిర్వహించింది. అత్యాధునిక రఫేల్‌తోపాటు సుఖోయ్ తదితర యుద్ధవిమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఇరుదేశాలూ పోటాపోటీగా అరేబియా సముద్రంలో క్షిపణి పరీక్షలు నిర్వహించాయి. భారత్ నేవీకి చెందిన స్వదేశీ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్‌ఎస్ సూరత్ నుంచి సీ స్కిమ్మింగ్ టార్గెట్లను ఛేదించే క్షిపణిని పరీక్షించింది. 70 కి.మీ పరిధిలో టార్గెట్లను ఛేదించగల మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (ఎంఆర్‌ఎస్‌ఎఎం)ను పరీక్షించింది. పాక్ తన గగనతల రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసింది. భారత విమానాల కదలికలను ట్రాక్ చేయడానికి వారి అవాక్స్ నిరంతర నిఘా పెట్టింది. ఉపరితలం పైనుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి పరీక్షలను చేపడతామని పాక్ ప్రకటించింది. ఈ మేరకు మిలిటరీ నోటమ్(నోటీస్ టు ఎయిర్‌మెన్/మెరైనర్స్) జారీ చేసింది. ఇక 1972 నాటి భారత్‌పాక్ సిమ్లా ఒప్పందం నిలిపివేస్తున్నట్టు పాక్ ప్రకటించడం దీర్ఘకాలంలో వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉంది. 1971లో పాకిస్థాన్ నుంచి విముక్తి కోరుతూ తూర్పు పాకిస్థాన్ ప్రజలు జరిపిన పోరాటానికి పలకగా, భారత సైన్యంపై పాక్‌దాడులకు దిగడంతో ఉభయ దేశాల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ గొప్ప విజయం సాధించింది. అంతేకాదు పాకిస్థాన్‌లోని 13 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకుంది. పర్యవసానంగా బంగ్లాదేశ్ ఆవిర్భవించిన తరువాత 1972 జులై 2 న భారత్‌పాక్ సిమ్లా ఒప్పందం కుదిరింది. ఇరుదేశాలు ఘర్షణలకు స్వస్తి పలికి స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పుకోవడమే ఈ ఒప్పందం లక్షం. ఆ సమయంలోనే నియంత్రణ రేఖ ఏర్పడింది. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని పాక్ నిలిపివేయడంతో నియంత్రణ రేఖకు కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఉండదు. ఇప్పటికే నియంత్రణ రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్)ను ఉల్లంఘిస్తూ తరచుగా కాల్పుల సంఘటనలు జరుగుతున్నాయి. ఇవి మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడు నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ సిద్ధంగా ఉన్నాయని నిఘా వర్గాలు వెల్లడించడం గమనార్హం. ఇక్కడ శిక్షణ పొందిన 200 మంది ఉగ్రవాదులు ఏ క్షణమైనా భారత్ సరిహద్దుల్లోకి అక్రమంగా ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారని నిఘా వర్గాల సమాచారం. వీరిలో 115 మంది పాక్ జాతీయులు కాగా, జమ్మూకశ్మీర్‌లోని హిజ్బుల్ ముజాహిద్దీన్, జైష్ ఎ మహ్మద్, లష్కర్ ఎ తొయిబా తదితర ఉగ్రవాద సంస్థలకు చెందిన మొత్తం 60 మంది విదేశీ ఉగ్రవాదులు మరో 17 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు. వీరిని సరిహద్దు దాటించేందుకు పాక్ సహకరిస్తోంది. యుద్ధభయంతో పాకిస్థాన్ బుధవారంనుంచే నియంత్రణ రేఖ వద్దకు సైన్యాన్ని, యుద్ధట్యాంకులను పంపించింది. సరిహద్దుల్లో తన బలగాలను పాక్ పెంచుతోంది. అఫ్ఘానిస్థాన్ సరిహద్దులతోపాటు బలోచిస్థాన్‌లో ఉన్న మిలిటరీ సిబ్బందిని నియంత్రణ రేఖ వద్దకు పంపుతోంది. జవాన్ల సెలవులను కూడా పాక్ మిలిటరీ రద్దు చేసింది. ఇటీవల ఎల్‌ఒసి వద్ద పాక్ అనేక ఉల్లంఘనలు జరిపింది. దీన్ని కారణంగా చూపించి భారత్ ఉగ్రస్థావరాలను లక్షంగా చేసుకుని ఆపరేషన్లు చేపట్టే అవకాశం ఉంది. పహల్గాం ఉగ్రవాదులను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదన్న దేశప్రజల డిమాండ్ బట్టి పాక్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో భారత్ ప్రభుత్వం అవకాశాలను వెదుకుతోంది. ప్రస్తుతం వాయుసేనలో అత్యాధునిక ఫైటర్ జెట్లు, రఫేల్, మిరాజ్ 2000 ఉన్నాయి. వీటిని ఉపయోగించి పాక్‌లోని కీలక సైనిక కార్యాలయాలపై దాడులు చేయాలన్న వ్యూహంలో భారత్ ఉంటోంది. ఈ సమయంలో బాలాకోట్‌పై దాడి తరువాత ఎదురైన అనుభవాలు మళ్లీ ఎదురుకాకుండా చూసుకోవాల్సి ఉంది. మరోవైపు దేశంలోని పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే విధులకు హాజరు కావాలని కేంద్ర ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. జమ్మూకశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. శ్రీనగర్ లోని విమానాశ్రయంలో సైన్యం భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తం మీద రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుండటంతో ఐక్యరాజ్యసమితి స్పందించింది. భారత్‌పాక్ దేశాలు సంయమనం పాటించాలని కోరింది. ఇరు దేశాల మధ్య ఏదైనా సమస్య ఉంటే శాంతియుత చర్చలతో పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నట్టు అభిప్రాయపడింది. సింధూ జలాల ఒప్పందం అమలు నిలిపివేత వంటి కీలకాంశాలపై సంయమనం పాటించి, పరిస్థితులు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నట్టు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News