తెలంగాణలో రోహింగ్యాలు, బంగ్లాదేశ్, పాకిస్థాన్ మూలాల వ్యక్తులు కూడా నివాసం ఉంటున్నారని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో కేంద్రం ఆదేశాల మేరకు చర్యలు తీసుకోకపోతే, భాగ్యనగరంలో అశాంతి తలెత్తే ప్రమాదం ఉందని అన్నారు. రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను శనివారం ఆయన కార్యాలయంలో కలిసి ఎంపీ రఘునందన్ రావు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను డిజిపి దృష్టికి తెచ్చినట్లు తెలిపారు.
జిన్నారం మండలంలో శివాలయం ధ్వంసం ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారు. శివాలయం ధ్వంసం ఘటనలో పోలీసులు సకాలంలో స్పందించలేదని, అలాగే దాడికి పాల్పడిన మదర్సాలోని విద్యార్థులపై చర్యలు తీసుకోలేదని అన్నారు. కానీ దాడిపై నిరసన తెలిపిన హిందువులపై నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శివాలయ ధ్వంసానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజీలు ఇంకా బయటకు రాలేదని, మదర్సా పిల్లల జాతీయతపై, వారికి భారతీయ పౌరసత్వం ఉందా అనే అనుమానాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ ఘటనల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందని విమర్శించారు.