ఉప ప్రాంతీయ ఉద్యమ సంస్థగా ప్రారంభమై దాదాపు 14 సంవత్సరాలు ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పోరాటం చేసి లక్ష్యాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఆ తరువాత దాదాపు పది సంవత్సరాలు అధికారంలో ఉండి మధ్యలో భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెంది జాతీయ రాజకీయాలు చేయబోయి ప్రతిపక్షంలో కూర్చున్న పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్నది. ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఈ దేశంలో అనేకం పుట్టుకొస్తూ ఉంటాయి. వచ్చినంత వేగంగా అంతర్థానం అయిపోతూ ఉంటాయి. ఇప్పటిదాకా చాలా కొద్ది సంఖ్యలోనే ప్రాంతీయ రాజకీయ పార్టీలు దీర్ఘకాలం మనుగడ సాగించడం చూసాం. వాటిల్లో ఒకటి భారత రాష్ట్ర సమితి.ప్రస్తుత జాతీయ రాజకీయ పక్షాల పరిస్థితి చూసినప్పుడు ఇకపైన భారతదేశంలో ప్రాంతీయ రాజకీయ పార్టీలదే రాజ్యం అన్న అభిప్రాయం కలగకమానదు. జాతీయ పార్టీల యుగం అంతరించి ప్రాంతీయ పక్షాలవైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారనడానికి ఇటీవలి కాలంలో నెలకొంటున్న పరిణామాలే నిదర్శనం. రెండు తెలుగు రాష్ట్రాలనే ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో 1978 నుండి ఇప్పటిదాకా జాతీయ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చింది మూడు పర్యాయాలే. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ కాంగ్రెస్ నామరూపాలు లేకుండాపోతే, రాష్ట్ర విభజన జరిపిన తెలంగాణలో మూడోసారి కానీ అధికారంలోకి రాలేకపోయింది. మరో జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీల కూటమి చివరన తోక పట్టుకుని వేళ్ళాడే స్థితి.
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఈ పరిస్థితుల్లో రజతోత్సవాలు జరుపుకోవడం చెప్పుకోదగ్గ విశేషమే. ఓటమి తర్వాత కారణాంతరాలవల్ల ఇప్పటిదాకా ప్రజల మధ్యకు రాకుండా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా చట్టసభలకు వెళ్లకుండా ఉన్న ఆ పార్టీ అధినేత చంద్రశేఖర రావు ప్రసంగంలో ఏం ఉండబోతోందన్న ఆసక్తి ఆ పార్టీ శ్రేణులకే కాకుండా తెలంగాణ ప్రజలందరికీ ఉండడంలో ఆశ్చర్యం లేదు. తాము జాతీయ రాజకీయపక్షంగా రూపాంతరం చెందడం సరైనదే అని ప్రజలు ఆమోదించారని ఆ పార్టీ మరో ముఖ్య నేత కెటి రామారావు గత రెండు మూడు రోజులుగా మీడియా సంస్థలకు ఇచ్చిన వరుస ఇంటర్వ్యూలలో చెప్పారు. ‘2023 లో మేము భారత రాష్ట్ర సమితి పేరుతో పోటీ చేస్తే తెలంగాణలో ప్రజలు 37 శాతం ఓట్లు ఇచ్చి 39 సీట్లు ఇచ్చారు’ అని చెప్తున్నారు. కాబట్టి భారత రాష్ట్ర సమితిని ప్రజలు ఆమోదించినట్టే అని ఆయన అభిప్రాయం. అదే వాస్తవం అయితే ప్రజలు బిఆర్‌ఎస్‌కు అధికారమే ఇచ్చి ఉండాలి కదా? అంతేకాదు, ఆ తర్వాత కొద్ది మాసాలకే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఒక్క స్థానం కూడా ఎందుకు ఇవ్వలేదు? అనే విషయాలపై ఆత్మవిమర్శ చేసుకుంటారా?
రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శతోపాటు జాతీయ రాజకీయాల విషయంలో కెసిఆర్ ఏం మాట్లాడబోతున్నారనే చర్చ కూడా జరుగుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాదిలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ వైపు చూస్తున్నది. గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బిజెపిలో ఆ ఆశలను మరింత పెంచాయి. తాను అధికారంలో ఉన్నకాలంలో భారతీయ జనతా పార్టీని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తీవ్రంగా విమర్శించిన చంద్రశేఖరరావు ఈ బహిరంగ సభలో తెలంగాణ ప్రజలకు ఆ పార్టీపట్ల తమ వైఖరి ఏమిటో చెప్పబోతున్నారా అన్న చర్చ కూడా జరుగుతున్నది. ఓటమికి కారణాలను సమీక్షిస్తారా, జరిగిన పొరపాట్లకు చింతిస్తున్నామని చెప్తారా లేక ప్రజలు మోసపోయారని, కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశారని చెప్పి అదే ధోరణి కొనసాగిస్తారా అనే చర్చ కూడా ఇవాళ పెద్దఎత్తున జరుగుతున్నది.
ఉద్యమ సంస్థగా ఉన్నకాలంలో సకల జనుల సహకారంతో ఉద్యమానికి నాయకత్వం వహించి లక్ష్యాన్ని సాధించిన అనంతరం కెసిఆర్ ఉద్యమ సంస్థను ఫక్తు రాజకీయ పార్టీగా మార్చామని చెప్పారు తప్ప ఆచరణలో అది జరిగినట్టు కనిపించదు. ఒక రాజకీయ పార్టీకి బలం గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయివరకు పార్టీ నిర్మాణమే. అలాంటిది టిఆర్‌ఎస్‌లో సంపూర్ణంగా జరిగినట్టు కనపడదు. ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఏకవ్యక్తి నాయకత్వంలో నడుస్తాయన్నమాట వాస్తవమే అయినా కిందిదాకా పూర్తిస్థాయిలో పార్టీ నిర్మాణం లేని పక్షంలో దాని మనుగడ ఒక దశలో ప్రశ్నార్థకంగా మారడం సహజం.
16 మాసాల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని, వచ్చే మూడేళ్ల కాలంలో ఆ పార్టీ మరింత ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుందని భారత రాష్ట్ర సమితి నాయకులు పదేపదే బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికలకింకా మూడున్నర సంవత్సరాల వ్యవధి ఉన్న పరిస్థితుల్లో రజతోత్సవ సభలో ప్రత్యక్షమయిన అనంతరం ప్రజాక్షేత్రంలోనే కొనసాగుతారా లేదా అన్నది కూడా ముఖ్యం. కెటిఆర్ ఇంటర్వ్యూలలో కొన్ని విషయాలు చెప్పారు. ఒకటి శాసనసభలో కెసిఆర్ గైర్హాజరీకి కారణం చెత్త భాష వినడానికి, తిట్టించుకోవడానికి అంత పెద్ద మనిషి సభకు రావలసిన అవసరం ఉందా అని. మరో కారణం వయసు రీత్యా, ఆరోగ్య పరిస్థితి రీత్యా కూడా ఆయన తరచూ బయటికి రాకపోవచ్చు అని కూడా చెప్పారు. కెసిఆరే తమ పార్టీ ట్రంప్ కార్డు అని కూడా ఆ పార్టీ నాయకులు అందరూ చెబుతూ ఉంటారు. పేకాట భాష తెలిసిన వాళ్లకు ట్రంప్ కార్డు ఎప్పుడు వాడతారో తెలిసే ఉంటుంది. వాడవలసిన సమయంలో దానిని వాడకపోయినట్టయితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. భారత రాష్ట్ర సమితికి సంబంధించినంత వరకు ట్రంప్ కార్డు అయినా, పేకలోని మిగతా ముక్కలైనా అన్నీ కెసిఆరే. అయితే రాష్ట్రాన్ని పోరాడి సాధించి రెండు పర్యాయాలు అధికారంలో ఉండి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేసి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అధికారం ఎందుకు కోల్పోయామనే విషయంలో స్పష్టత లేకపోయినట్లయితే,
ప్రజలే తప్పు చేశారు లేదా కాంగ్రెస్ మాయమాటలకు ప్రజలు మోసపోయారు అనే అభిప్రాయంలోనే ఉండిపోదల్చుకుంటే పప్పులో కాలేసినట్టే.ఏం చేసినా, చేయకపోయినా పాలకులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ముఖ్యమంత్రిగా కెసిఆర్ ప్రగతి భవన్‌కు పరిమితమై, ప్రజలకు దూరంగా ఉంటూ కనీసం తన మంత్రివర్గ సభ్యులకు కూడా నెలల తరబడి దర్శనం ఇవ్వని విధంగా వ్యవహరించినందువలనే ప్రధానంగా ప్రజలు కినుక వహించారని విమర్శ వచ్చింది. ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకుంటానని ప్రజలకు ఏమైనా హామీ ఇవ్వబోతున్నారా లేక పాత ధోరణే కొనసాగుతుందా? మామూలు పరిస్థితుల్లో అయితే ఇంకో మూడేళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి. తెలంగాణ శాసనసభకు ఈ రజతోత్సవ సభలో ఒక సందేశాన్ని ఇచ్చి, మళ్లీ తన వ్యవసాయ క్షేత్రంలోని తన నివాసానికే పరిమితమైపోతారా కెసిఆర్? జాతీయ రాజకీయాల జోలికి పోకుండా తెలంగాణకు పరిమితం అవుతాం అని చెప్తారా? పార్టీ పేరు మార్చుకొని తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా కొనసాగుతారా?.. ఇటువంటి ప్రకటనలు ఏమైనా ఆయన నుండి వస్తాయా?
వీటన్నిటికీమించి భారత రాష్ట్ర సమితి, దాని అధినేత కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు కొన్ని గడ్డు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో నిజం ఎంత అనేది నిగ్గు తేలాల్సి ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిషన్ జరుపుతున్న విచారణలో పార్టీ అధినేత చంద్రశేఖర రావుతోపాటు ఆనాటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీశ్ రావు పేరు కూడా నిందితుల జాబితాలో ఉన్నాయి. కెసిఆర్ కుమార్తె, శాసనమండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి నిందితురాలిగా తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండులో ఉండి వచ్చారు. ఆయన కుమారుడు కెటి రామారావు మీద ఫార్ములా ఇ కార్ రేసులకు సంబంధించి అభియోగం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతోపాటు కేంద్రం పరిధిలో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా దీని మీద దృష్టి పెట్టింది. ఈ అభియోగాలన్నీ నిరూపితం అవుతాయా, నిరాధారమైనవేనా అన్న విషయం అంతిమంగా తేలుతుంది కానీ ఇప్పటికైతే వీటన్నిటినీ ఎదుర్కొని మరింత బలంగా పార్టీని నడిపించగలరా అన్నది చూడాలి.
భారత రాష్ట్ర సమితి ప్రస్తుతం ప్రదర్శిస్తున్నదంతా మేకపోతు గాంభీర్యమా లేక చివరిదాకా నిలిచి పోరాడుతుందా అన్నది రానున్న మూడు సంవత్సరాల కాలంలో తేలాల్సి ఉన్నది. జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వ కూటమికి నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీకి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సొంతంగా అవసరమైనన్ని స్థానాలు వచ్చి ఉంటే ఇప్పటికే తెలంగాణలో రాజకీయ అస్థిరత సృష్టించి ఉండేది అన్న చర్చను కొట్టి పారేయడానికి వీల్లేదు. ఎందుకంటే మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ వ్యవహరించిన తీరు ఇటువంటి అనుమానాలకు తావు ఇస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అటువంటి ప్రయత్నాలు ఇప్పుడే చేయకపోవచ్చునని పరిశీలకుల అభిప్రాయం. భారత రాష్ట్ర సమితి తరఫున గెలిచిన 39 మందిలో పది మంది ఇప్పటికే వలసపోయారు. వారి సభ్యత్వానికి సంబంధించి సుప్రీం కోర్టు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తున్నాం. కానీ తెలంగాణ శాసనసభ స్థాయిలో మాత్రం ఎటువంటి కదలిక ఉండడం లేదు. ఆ పదిమందిమీదా అనర్హత వేటుపడితే భారత రాష్ట్ర సమితికి కొత్త శక్తి వచ్చినట్టే. ఇప్పటిదాకా బిజెపి, కాంగ్రెస్ రెండూ కలిసే ఉన్నాయని, తమ పార్టీని తుదముట్టించే ఆలోచన చేస్తున్నాయని మాట్లాడుతున్న భారత రాష్ట్ర సమితి నాయకులు చివరిదాకా ఇదే వైఖరితో ఉంటారో లేదో కూడా చూడాలి. ఇన్నింటిమధ్య భారత రాష్ట్ర సమితి జరుపుకుంటున్న రజతోత్సవ వేడుకలు పార్టీ కార్యకర్తల్లో, క్రింది శ్రేణి నాయకులలో కొత్త ఉత్సాహాన్ని కల్పిస్తాయన్నమాట వాస్తవమే. కానీ, ఆ జోష్ మూడేళ్లపాటు అలాగే నిలిచి ఉండే విధంగా కెసిఆర్ ఇవాళ్టి ప్రసంగం తదుపరి ఆయన వ్యవహారశైలి ఉంటుందా అన్నది చూడాలి.